అనేకమంది దైవాన్వేషణ జరుపుతున్నామంటున్నారు. ఈ దైవాన్వేషణ ఈనాటిది కాదు. అనాది కాలము నండి దైవాన్వేషణ జరుగుతూనే వస్తున్నది. సత్యాన్ని సరైన మార్గములో అనుసరించినప్పుడు సర్వమూ దైవ స్వరూపంగా రూపొందుతుంది. ఈ సత్యాన్ని అన్వేషణ ఎలా చేయాలి? సత్యమన్నది ఒక్కటే కదా! ఎక్కడున్నదని మనం వెదకాలి? చిన్న ఉదాహరణ. తల్లిని చూస్తున్నావు. సోదరిని చూస్తున్నావు; బిడ్డను చూస్తున్నావు; భార్యను చూస్తున్నావు. ఇక్కడ విచారణ చేయాలి. తల్లిని ఏ విధంగా చూడాలి? మాతృమూర్తిగా మనం చూడాలి, పూజనీయురాలిగా చూడాలి, గౌరవనీయురాలిగా చూడాలి, దేవతా స్వరూపిణిగా చూడాలి. ఇది ఇందులో చూడవలసిన సత్యము. బిడ్డము బిడ్డగానే భావించాలి. "ఆ బిడ్డ నా యొక్క అంశమే. ఈ అంశమే ఈ బిడ్డ రూపంలో వచ్చింది " అని గుర్తించాలి. ఎవరు తల్లి? ఎవరు బిడ్డ? ఎవరు సోదరి? ఈ విధముగా సత్యాన్వేషణ చేయాలి. చూచేది ఒకే కన్నులే. అయితే తల్లిని ఏ దృష్టితో చూడాలి. సోదరిని ఏ దృష్టితో చూడాలి. బిడ్డను ఏ దృష్టితో చూడాలి. భార్యను ఏ దృష్టితో చూడాలి - ఇదే సత్యాన్వేషణ.
(ద.య.స.98.పు.7)