కుక్క
గడ్డివాముపై కూర్చున్న కుక్క పశువులను గడ్డిదగ్గరకు రానీయదు. తాను తినదు. అదే విధముగ కొందరు తాము సత్కార్యములు చేయరు. ఒకరిని చేయ నివ్వరు. ఇదే కుక్కలో మంచిగుణము కూడా వుంది. తన యజమాని పట్ల అంతులేని విశ్వాసము. అతడు ఎక్కడ వున్నా ఏ వేషమేసుకుని తిరిగినా గుర్తుపట్టగలదు. మనకు దేవుని యందు ఆట్టి విశ్వాసంవుండాలి.
గబ్బిలము
గబ్బిలముల వంటి పక్షులు వెలుగును చూడలేవు. చీకటిలోనే సంచరిస్తాయి. సూర్యోదయం కాగానే ఎగిరిపోతాయి. అదే విధముగ హృదయమునావరించి యున్న చీకటిలో అసూయ, ద్వేషము, గర్వము క్రోధములనే గబ్బిలములు భగవన్నామస్మరణచే హృదయమును ప్రకాశవంతం చేస్తే తొలిగిపోతాయి.
గొర్రె
గొర్రె చాలా సాధుజంతువు. ఆకులు, గడ్డి మొదలైన సాత్త్విక ఆహారమునే భుజిస్తుంది.
గొర్రె ఎప్పుడూ మందను వదలివెళ్లదు. గ్రుడ్డిగా మందను అనుసరించటం గొర్రె స్వభావం, మనము సాధుస్వభావం కలిగి ఉండాలి. మనము మనవారితో కలసి మెలసి ఉండవచ్చు. కాని గొర్రెవలె ఎవరిని గ్రుడ్డిగా అనుసరించకూడదు.
చెఱకు
తనలోని మాధుర్యమును అందరూ అనుభవించుటకు చెఱకుగడ ఖండనము, దండనము, జ్వలనములను భరిస్తుంది. మానవుడు కూడా కష్టనష్టములను సహించినప్పుడే సజ్జనుడుగా, జ్ఞానిగా రూపొందగలడు.
నదులు:
నదులు కొండలనుండి రాళ్ళు రప్పలు ముండ్లు దాటుకుంటూ సముద్రము వైపునకు ప్రవహిస్తుంటాయి. తమ నీటిని సృష్టిలో సకల జీవరాసులకు అందిస్తాయి. ఈ విధంగా నదులు తమ కర్తవ్యమును నిస్స్వార్థముగ నిర్వర్తిస్తూ గమ్యమును మరువక అటువైపుననే పరుగులిడుతాయి. మనము ఈ వైఖరిని అలవరచుకోవాలి.
పర్వతములు
పర్వతములు ఎండనూ వాననూ భరించి సహన శీలతను నిరూపిస్తాయి. అదే విధముగా మనము సుఖదుఃఖములలో, కష్టనష్టములలో శాంతముగా వుండడం అలవరచుకోవాలి.
బత్తాయిపండు
బత్తాయి పండులోని తియ్యని రసమును రుచి చూడాలి అంటే, చేదుగా వుండే పై తొక్కను తొలగించాలి. తొనలో వుండే గింజలను ఏరి పారవెయ్యాలి. అదే విధముగ జీవితములో నిజమైన ఆనందమును అనుభవించాలంటే అహంకారమనే తొక్కను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనే గింజలను దూరము చేయాలి.
సముద్రము
సముద్రము నిరర్ధకములైన ఆలిచిప్పలను ఒడ్డుకు నెట్టివేసి విలువైన ముత్యములను తన హృదయమున దాచు కుంటుంది. అదే విధంగా మనము మన హృదయము నుండి దుష్టభావములను తొలగించి, పవిత్రమైన వాటిని దాచుకోవాలి.
సర్పము
సర్పము సూటిగాకాక వంకరగ ప్రాకుతూ వెళ్తుంది. ఇంద్రియాలను అనుసరిస్తున్న వ్యక్తి నడత కూడ అంతే. మనస్సు అనే పుట్టలో నుంచి విషయవాసన లనే సర్పములు బయటకు విజృంభిస్తుంటాయి.వాటిని నామసంకీర్తనముచే వశము చేసుకోండి.
(సా.యా.పు.1,3,5,7,9)