అశ్వము
అశ్వము చాలా చంచల స్వభావంకల జంతువు. అది ఎప్పుడూ ఏదో ఒక అవయవమును కదిలిస్తూనే ఉంటుంది. మన మనస్సు కూడ నిరంతరం చలిస్తూనే ఉంటుంది. ఆశ్వము వలె చంచలమైన మనస్సును నిశ్చలంగా ఉంచుటకు మనో విగ్రహము మనకు అవసరము.
ఈగ
ఈగఒక స్థానమున స్థిరముగ వుండదు. ఒక నిముషము మంచి భక్ష్యములమీద వాలుతుంది. మరొక నిముషము మాలిన్యములమీద వాలుతుంది. మనస్సుకూడ అంతే. ఈగవలె వుండరాదు మనస్సు.
కస్తూరి మృగము
కస్తూరి మృగము తనను ఆకర్షించిన పరిమళమును అన్వేషిస్తూ పరుగులిడుతుంది. చివరికి విసిగి వేసారి తన ముఖమును బొడ్డునకానించుకొని పండుకొనినప్పుడు, ఆ పరిమళము తన నుండే వస్తున్నదని తెలుసుకుంటుంది. ఆ విధంగానే మనము ఆనందము కొరకు బాహ్య ప్రపంచంలో వెదకి వేసారి, చివరకు మనలోనే ఆనందం ఉన్నదనే సత్యాన్ని గుర్తిస్తాము.
కాకులు
మనము భుజించి, కొన్ని మెతుకులను విదిలించి నప్పుడు కాకి తానొక్కతే భుజించదు. కావుకావుమంటూ కాకులన్నిటినీ పిలిచి కలిసి తింటుంది. అంత ఐకమత్యముంది కాకులలో, మీరు అటువంటి ఐకమత్యమును అలవరచుకోవాలి.
చీడపురుగు
మొక్కకు చీడపురుగు వలె, వృక్షమునకు వేరుపురుగు వలె క్రమంగా మానవులను నాశనము చేస్తాయి దుర్గుణములు. వాటిని చేరనీయకూడదు.
చేపలు
చేపలు నీటిలో ఉన్నంత కాలము సురక్షితముగా సుఖముగా వుంటాయి. నీటినుండి బైటకు తీస్తే గిలగిల కొట్టుకొని చనిపోతాయి. అలాగే మానుడు ప్రేమ అనే నీటిలో వున్నంతవరకు సౌఖ్యముగా వుంటాడు.
భూమి
భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన రాత్రి, పగలు ఏర్పడుతున్నవి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుట వలన ఋతువు లేర్పడి ఎండలు కాసి, వానలు కురిసి పంటలు పండి జీవించే మార్గము ఏర్పడుతున్నది. ఈ భ్రమణము వలన భూమికి ఎట్టి లాభము లేదు. నిస్స్వార్థ నిర్విరామ సేవకు చిహ్నము భూమి.
రాబందులు
రాబందుల దృష్టి ఎప్పుడూ క్రిందివైపే వుంటుంది. కళేబరాలు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూంటుంది. దాని నివాసస్థలము శ్మశానవాటిక, రాబందులవలె క్రిందిచూపు ఆలవరచుకొనవద్దు. ఊర్ధ్వ దృష్టిని అలవరచుకొనండి.
వృక్షములు
వృక్షములు తమ నీడను, ఫలములను అందరికీ అందిస్తాయి. తమ కొమ్మలను నరికిన వారికీ, ఫలములను రాళ్ళతో కొట్టేవారికి కూడా అందిస్తాయి. మనము కూడా మన మిత్రులకే కాక శత్రువులకు కూడా ఉపకారం చేయాలి.
(సా.యా.పు.6,12,14,17,26,28,30,34)