మానవుడు తనను తాను గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు అతనికి పవిత్రమైన బుద్ధిని అనుగ్రహించాడు. బుద్ధి పరిశుద్ధమైన అద్దము వంటిది అద్దమునకు ఒకవైపున రసాయనం పూయబడినప్పుడు దానిలో మీరు మీ ప్రతిబింబమును చూసుకోవచ్చు. రసాయనము పూయని అద్దమును ఎదురుగా పెట్టుకుంటే దాని వెనుక భాగమున ఉన్నదేదో కనిపిస్తుందిగాని, మీకు మీరు కనిపించరు. అదేవిధంగా, మీరు స్వస్వరూపాన్ని గుర్తించాలంటే మీ బుద్ధి అనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనే రసాయనమును పూయాలి. అయితే మీరు బుద్ధి అనే అద్దమును మాత్రం ఎదురుగా పెట్టుకున్నారు గాని, దానికి ప్రేమ అనే రసాయనమును పూయటం లేదు. కనుకనే, మీరు స్వస్వరూపాన్ని దర్శించలేక పోతున్నారు. రసాయనం పూయని అద్దంలో మీకు ఇతరుల ముఖం కనిపిస్తుందిగాని, మీ ముఖం ఎలా కనిపిస్తుంది. కనుకనే, ఈనాడు ప్రతి ఒక్కరూ "ఎవరండీ మీరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని ఎదుటివారిని ప్రశ్నిస్తున్నారేగాని, మొట్టమొదట "నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను?" అని తమను తాము ప్రశ్నించుకోవడం లేదు. మొట్టమొదట "నీవెవరు?" అనే ప్రశ్నవదలిపెట్టి నేనెవరు? అనే విచారణను ప్రారంభించాలి. ఇతరుల దోషాలను చూడటం మానివేసి మీలోని దోషాలను గుర్తించుకోవాలి. భగవంతుడు మీకు బుద్ధిని అనుగ్రహించినది. మిమ్మల్ని మీరు చూసుకోవడానికే గాని, పరులయొక్క దోషాలను చూడటానికి కాదు.
(స.సా.మే2000 పు. 150/151)
నే నెవడు అని విచారణ చేసినచో వృత్తులన్నియూ పోవును. ఎట్టి వృత్తులు వచ్చిననూ నేనెవరను ప్రశ్న వేసుకొన్న అన్ని వృత్తులు బుడగలవలె నలిగి పోవును. ఇట్టి సాధన రమణ మహర్షి సాధించెను. అదే మార్గమును తన శిష్యబృందమునకు బోధించెను. ఆదియే సులభమార్గము, అనగా సర్వమును బ్రహ్మమే, దానికి వ్యతిరేకమైన దేదియు లేదు అని అర్థము. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును జపించిననూ ఆజ్ఞానము పటాపంచలగును.
(జ్ఞావా.పు. 18/19)
నే వరు? ఈ కర్తృత్వ మేమిటి? ఈ భోక్తృత్వ మెందులకు? జనన మరణాదు లెందుకు కలుగుచున్నవి? నాకీ సంసార మెట్లు ప్రాప్తించినది? ఇందుండి ముక్తి కలదా? ఇత్యాది విషయ విచారణయే మహాతపస్సని ఋషులు చెప్పెడివారు.
"నేను యెవరు? అని ప్రశ్న జనించుటకు మృత్యు విషయమే మూలకారణము. కావున మృత్యువిషయమును విస్మరించరాదు. అలక్ష్యము చేయరాదు, భయపడి పారిపోరాదు, అజ్ఞాన ప్రప్రథమ సోపానము. అమాయకపు జీవితానికి అంకురార్పణము. మాయకు మహాబలము, మానవత్వము యొక్క పరమరహస్య మంతయూ మృత్యువిచారముతోనే ముడిపడి యున్నది. దైవ చిద్విలాస మంతయూ మృత్యువు యొక్క పరిశీలనలోనే ప్రకాశించు చున్నది.
(ఆ.శా..పు.11/12)
"చూడండి. మీరు ఎదుటి వ్యక్తిని "నీవెవరు? అని ప్రశ్నిస్తున్నారేగాని. నేనెవరు? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం లేదు. "నేను" ఎవరో తెలిస్తే మీకంతా తెలిసిపోతుంది. "నీవెవరు?" అని అడిగినప్పుడు "నేను అనిల్ కుమార్‌ను, గుంటూరు వాడిని, ప్రొఫెసరు" అని నీ పేరును, నీ ప్రాంతమును, నీ వృత్తిని గురించి చెబుతావు. ఇది సరియైన జవాబు కాదు. " నేనునేనే” అన్నదే సరియైనసమాధానం. ఈ నేను ’అనేదానివినీవు తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలో ఉన్న నేను’ వీకు తెలిసిపోతుంది. ఒకటి ప్రక్కన సున్నలు పెట్టేకొలదీ ఆ సున్నలకు కూడా విలువ పెరుగుతుంది. ఆ ఒకటియే నేను దానిని తెలుసుకోవాలి. నీవు ఎంత తెలుసుకున్నప్పటికీ నీవెవరో నీకు తెలియక పోతే ఏమి ప్రయోజనం?"
(స.సా.మే 2002 పు. 158)
(చూ|| ప్రవృత్తి)