మీ ప్రేమను కేవలం మీ కుటుంబమునకు, బంధు మిత్రలకు మాత్రమే పరిమితం చేయక సర్వుల పట్ల ప్రసరింపజేయండి. ఎల్లప్పుడూ సహాయమే చేయండి. ఎవ్వరికి అపకారం చేయకండి. సకల వేదాంత సారము ఇదే, బైబిల్, ఖురాన్ మున్నగు గ్రంథరాజముల సారము కూడా ఇదే. మతభేదములను విడనాడండి. ఉన్నది ఒకే మతము, అదే ప్రేమమతము. ఉన్నది ఒకే భాష అదే హృదయభాష, ఈ సత్యాన్ని గుర్తించండి. సేవలో ప్రవేశించి నేను అనే స్థాయి నుండి మనము అనే స్థాయికి చేరుకోండి. ... నేను మనం వరకు) - ఇదే మానవుడు చేయవలసిన ప్రయాణము. నేను అనే స్థాయి నుండి మనం అనే స్థాయికి చేరటమే మానవుని జీవిత గమ్యము. ఈ ప్రయాణము అతి సూక్ష్మమైనది, గమ్యము కూడా అత్యంత సమీపమైనది కాని, ఇట్టి సమీపమైన గమ్యమును చేరుకోవడానికి మీరు అనేక జన్మల కాలం తీసుకుంటున్నారు. అనేక శ్రమలకు గురి అవుతున్నారు. యువతీ యువకులారా! మొదట మానవత్వమంటే ఏమిటో అర్థం చేసుకోండి. మానవత్వ మనగా పవిత్రమైన దివ్యత్వమే. భగవంతుడు వేరు, మానవుడు వేరు కాదు. ప్రతి మానవుడు దైవస్వరూపుడే!కాని, తన సత్యాన్ని తాను గుర్తించనంత వరకు తాను మానవునిగానే ఉంటాడు. తన సత్యాన్ని తాను గుర్తిస్తే తానే దేవుడై పోతాడు. మానవత్వంలో ఉన్నదైవ త్వాన్ని గుర్తించాలంటే మొట్టమమొదటసేవాకార్య క్రమాలలో ప్రవేశించాలి. ఏదో పేరుప్రతిష్టల నిమిత్తమై చేయకూడదు. హృదయ తృప్తి కోసం సేవలు చేయాలి. అందులో ఆనందమును అనుభవించాలి. ఆ ఆనందమును పదిమందికి పంచాలి. చాలమంది. గ్రామసేవ చేస్తున్నామంటున్నారు. సేవ చేయటానికి వెళ్ళే ముందు మొట్టమొదట మీ మనస్సులను సరిదిద్దుకోవాలి. విశాలమైన భావములను పెంచుకోవాలి. "నేను, నాది అనే సంకుచిత భావంతో జీవితాన్ని గడిపితే ఇంక మనము అనే స్థాయికి ఎప్పుడు చేరుకుంటారు!
ప్రేమను పెంచుకున్నప్పుడే మనము అనే స్థాయిని సులభంగా చేరుకోవచ్చును. అప్పుడు జగత్తంతా ఒక కుటుంబంగా ఏర్పడుతుంది. అదే నాకు కావలిసింది.
(స.సా.డి..3.2.99 పు. 368/369)