నేను సాయిబాబాను! (23.5.1940 ప్రకటించారు) అపస్తంబ సూత్రుడను! భారద్వాజ గోత్రుడను! నేను మీ కష్టాలన్నీ తొలగించడానికి వచ్చాను. మీరంతా గురువుగా గుర్తించి ఆరాధిస్తున్న మీ పూర్వపురుషుడు, మహాజ్ఞాని అయిన వెంకావధూత నన్ను ప్రార్థించారు. హృదయ పూర్వకమైన ఆయన కోరికను మన్నించి నేను మీ కుటుంబంలో జన్మించాను. ప్రతి గురువారం నన్ను పూజించండి. మీ గృహాలు. మనసులు నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోండి"
(లోపు.7)
నేనింక మీ సత్యాన్ని కాను. సాయిబాబా’ను మాయ తొలగిపోయింది. నేను వెళుతున్నాను. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నేను చేయవలసిన పని వేచి ఉంది. నేనింక ఎంతమాత్రం ఉండలేను.
(లో.పు.7)
నాలుగు ముఖ్యమైన అంశములను మీరు తత్వ విచారణలో గ్రహించవలెను. దేహం ఏమిటి? నేను ఈ దేహమా? నాహం కాదు. మరి నెనెవరు? కోహం? (తత్వమసి) నేను అదేనా? లేక ఇది వేరు అది వేరునా? వీటన్నిటికీ ఒక్కటే సమాధానము- సోహం అదే నేను - అంటే ఆ పరమాత్మ నేనేను. నశ్వరమైన శరీరముతో అస్థిరమైన మనస్సుతో తదాత్మ్య భావము విడచి ఈ క్షణికమైన నాటకమునకు నేను సాక్షిని మాత్రమే అని గ్రహింపుము.
(స.శి.సు.తృపు.132)
అందరి కష్టసుఖములు నాకు తెలుసు. దానికి కారణము నేను అందరిలోను వుండటయే. ఈసాయి అను కరెంటు ప్రతివ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తున్నది. ప్రతి హృదయములోను నేను ప్రకాశిస్తున్నాను. మీ అందరి హృదయములలోనూ వున్న చైతన్య శక్తిని నేనే.
(స. శి.సు.పు.166/167)
నేను అను పదములు రెండు కలవు. 1. అహంకారము, దీనినే దేహాత్మ, ఇది బైటగల నేను. 2 అంతరాత్మ, లేక ప్రత్యగాత్మ. ఇదిలోపలగల నేను. ఈ రెండింటికీ భేదము తెలియనివాడు అహంకారమే. అనగా దేహాత్మనే నేను అని అనుకొనుచున్నారు. కానీ అది సత్యము కాదు. అది ఆత్మకాదు. దేహము పనిముట్టు, అయినందున, పదార్థమెట్లు దృశ్యమో, దేహాత్మ అయిన అహంకారము కూడా దృశ్యము. ఈ అహంకారము స్వప్నమున వుండదు, నిద్రలో వుండదు. త్రికాలభాద్యం సత్యం. రెండు కాలములలో లేనిది సత్యమెట్లగును. ఈ విధముగ విచారము సలిపి, ఇంద్రియములు, మనస్సు బుద్ధి ప్రాణము యేది తాను కానియెడల ఇక ఆత్మ ఏది అని, ఆత్మ ఎవరని, మీలో సందేహము కలుగవచ్చును.
రాకపోకలు లేని, కరచరణ అవయవములు కాని, మాలిన్యము చేరని, అణువున అణువుగను, ఘనమున ఘనముగను, ఆకాశమువలే అంతటానున్నను. నేను, నాది అను భావములేక, అగ్నికి వేడిమివలె సూర్యమునకు ప్రకాశమువలె, ఎరుకయే స్వభావముగాగలది ఆత్మ. శోక కోప పంచేంద్రియాది సంబంధములేక పరమానందమైనది ఆత్మ, సర్వజీవుల యందు, హృదయముగా ప్రజ్ఞగా వున్నదే ఆత్మ, దృశ్యములందు దృక్కుగా చూడబడేవస్తు జాలమును చూచువాడే ఆత్మ. కరణాదుల సహాయము లతో చూచి విని, తిని, చెప్పు వాడెవడైననూసరే వాడు కేవలము దీపమువంటి వాడే కానీ ఆత్మస్వరూపుడు కాడు. ఆత్మ అల్పద్రష్టకానీ, క్రమద్ర ష్టకానీ, అద్రష్టకానీ, అన్యథాద్రష్టకానీ కాదు. బుద్ధి చంద్రుని వంటిదయి నప్పటికినీ స్వప్రకాశము కాదు. దానికి సూర్యుని వంటి ఆత్మకు అతి సమీపముననున్నందున ఆది ఆత్మతో కలియవీలున్నది లక్కా, చెక్కా చక్కగా అంటుకొనును. బుద్ధి, ఆత్మ అట్టివికావు. అభ్యాసముచే మాత్రము కలియును. సూర్యుడును ఇతరవస్తుసాన్నిధ్యమును బట్టే సూర్యుడు జగచ్ఛక్షువు అని చెప్పబడుచున్నాడు. సూర్యునకు నేను అని కాని, నాది అనికానీ, ఒక కోరిక కానీ లేదు. అతని సాన్నిధ్య మాత్రమున చీకటి పోయి వెలుతురు, వెలుగు వచ్చి సర్వము ప్రకాశించుట వలన అతడు ప్రకాశకుడయినాడు. కానీ అతనికి కర్తృత్వ రూపమును ప్రకాశత్వము లేదు. అటులనే ఆత్మకు, మార్పులు కానీ కూర్పులు కానీ లేని, ఆత్మ కర్త యెటులగు నని అడిగినచో, సూదంటురాయికి కర్తృత్వమెటుల తనదాపున చేరిన సూదిని కదుల్చును?
ఆత్మవున్నదా? ఉన్నయెడల ఏ ప్రమాణముచే సాధింపబడును? ఆత్మ వున్నదనుటకు ప్రమాణముతో పనిలేదు. ఆత్మయే ప్రమాణాధీనుడై ప్రమాణములచే సాధింపబడవలసిన యెడల. ఆ ప్రమాణము వుపయోగించి పరీక్షించువాడు మరొకడుండవలెను. కదా అతనెవరు? పోనీ అతనే ఆత్మ. ఆత్మకలదని చెప్పుటకు వేదమే ప్రమాణమని కొందరు చెప్పవచ్చు. కొందరు వేదముచే కూడా ఆత్మ సాధింపబడదని చెప్పవచ్చు. ఆత్మ అన్నను ఒకటే అని తెలుపుటలో వేదము ప్రమాణము కావచ్చును. కాని స్వయంసాక్షి అయిన ఆత్మకు వేద ప్రమాణములు లేవు.
(స.వా.పు.161/163)
"నేను మానవుడినో, భగవంతుడినో, దేవతనో, ఆత్మనో కాను. నేను నాలుగు వర్ణాలలో ఏదో ఒక వర్గానికి చెందిన వాడినని కాని, జీవితంలోని నాలుగు దశలలో ఏదో ఒక దశకు చెందిన వాడినని కాని ముద్ర వేయటానికి వీలు లేదు. సత్యాన్ని బోధించే గురువుగా, సత్యం శివం సుందరంగా మీరు తెలుసుకోండి".
(శ్రీ.. స. ప్రే స్ర.పు.242)
నన్ను నేను ప్రేమిస్తున్నప్పుడు వేమ మిమ్మల్నే ప్రేమిస్తున్నా. మిమ్మల్ని మీరు ప్రేమించేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు. మనం ఇరువురం ఒక్కటే. నన్ను నేను ప్రేమించుకోగలగటం కోసమే నా నుండి నన్ను వేరుచేశాను.
when I love my self I love you, when you love your selves you love Me. We are one, I only separated My self from My self so that I can love Myself
(శ్రీ.. స. ప్రే స్ర..పు.392/393)
సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. భూమిపరి భ్రమిస్తోంది. నదులు ప్రవహిస్తున్నాయి. గాలి వీస్తోంది అంటే కారణం ఆవిధంగా నేను సంకల్పించటమే. మానవులంతా వివిధమైన భిన్నాభిప్రాయాలు కలవారు, వివిధమైన అదృష్టాన్ని కలిగి ఉన్నవారు. వివిధవర్గాలలో ఉన్నవారు అందరూకూడా నేను ఆడించేనాటకంలో భిన్నభిన్నమైన మనస్తత్వాలు కలపాత్రలే.
స్వర్గలోకవాసుల ప్రయాణంకోసం ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పరచింది. నేనే
(శ్రీ స. ప్రే..స.పు.408)
సకల భూతముల యొక్క హృదయ కమలములందుండు ప్రత్యగాత్మను నేనే, దీనినే ఆత్మ అని అందురు. దానిని ధ్యానించిన చాలును. అనగా సర్వ భూతముల యొక్క ప్రత్యగాత్మ అని విశ్వసించిన చాలును, అదే ధ్యా నము, అట్టి విశ్వాసమునకు ప్రతిబంధకములు కలుగక దృఢవ్రతుడవై ఆచరణలయందు నిరూపణ సలిపినపుడు నీవే నేను, నేనే నీవను అనుభవము పొందుదువు. అదే ఏకత్వము.
లోకమున భూతములుకాక మిగిలిన సృష్టికాలమున యేయే రూపముననున్నానో ఆదియును తెలిసికొమ్ము, పంచభూతముల స్వరూపమైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు నా రూపములే, సూర్య చంద్ర నక్షత్రముల యందలి చైతన్యమును నేనే. ప్రళవ కాలమున సమస్తమునూ తనలో లయ పరచెడు మృత్యుదేవతయు, ఉత్పత్తి కాలమున పుట్టుకయూ నేనే అణువు మొదలు అఖండము వరకూ, త్రికాల, త్రిలోక, త్రిగుణములందు అంతయు నేనే వ్యాపించి యున్నాను...
నేను వస్తువు కానీ, నాదికాని పేరుగానీ లోకమున లేదు. దేహమునందలి రక్తము, యే భాగమున చూచిననూ వక్కటిగానే యెట్లుండునో, దేశమునందు యే భూతమును చూచిననూ అందులో సర్వ వ్యాపియైన నేనే రక్తమువలె ప్రవహించుచుండును"అని కృష్ణ పరమాత్మ బోధించెను.
(గీ.పు.180/181)
ఈ సృష్టికి భగవత్సంకల్పమే మూలాధారం. మానవుడు భగవత్సంకల్పము నుండియే ఆవిర్భవించాడు. కాబట్టి, తాను భగవద్భావములనే కలిగి యుండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది దుర్గుణాలు ఆహార విహారముల నుండి ఆవిర్భవించినవేగాని, మానవునికి సహజమైనవి కావు. మీరు నేను అనే పదాన్ని ఉచ్చరిస్తున్నారు కదా! ఈ నేను అనేదే మూలాధారమైన మంత్రము. నేను అనే మంత్రము పుట్టిన తరువాతనే మిగిలిన మంత్రములన్నీ ఆవిర్భవించాయి. వేదము "అహం బ్రహ్మాస్మి" అన్నది. అనగా, నేను అనేదే బ్రహ్మ, బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను అనేదే బ్రహ్మ. కాని, ఈ పదము యొక్క సరియైన అర్థాన్ని మీరు గుర్తించుకోలేక దీనిని దేహభావంతో ఉచ్చరించి దుర్వినియోగ పర్చుతున్నారు. ప్రేమస్వరూపులారా! నిత్యజీవితంలో మీరు సత్యమైన మార్గాన్ని అనుసరించాలి. అట్లు చేయకుండా
జపము, ధ్యానము మున్నగు సాధనల నెన్ని చేసినా ప్రయోజనం లేదు. ఈ సాధనలతో పాటు మీ మనస్సును పరిశుద్ధపర్చుకోవాలి. హృదయంలో నున్నది మాటలో చెప్పాలి: మాటలో చెప్పింది. ఆచరణలో చూపించాలి. ఇదియే నిజమైన మానవత్వం. ఇట్టి త్రికరణ శుద్ధి కల్గిన మానవుని కోసమే భగవంతుడు అన్వేషణ సల్పుతున్నాడు?
(స.పా.మే.2000పు. 150)
కొలతకు అలవికాని అగాధమైన లోతుగల బ్రహ్మను స్వల్పమైన మనస్సుతో ఎట్లు కొలువగలడు? అప్రమేయమనగా వెడల్పు, పాడవు కొలతను, తీసికొనుటకు అలవికానిది. అపరిచ్ఛిన్న మనగా అంతేలేనిది. అవ్యవదేశ్యమనగా వర్ణింప నలవికానిది అని అర్థము. ఇట్టి పరమాత్మను సామాన్య భౌతిక ఇంద్రియము లచే చూచుటకానీ తెలిసికొనుటకానీ దుర్లభము. వేదాంతమందు చెప్పబడిన భోగత్యాగ లక్షణమైన బ్రహ్మను నేతి, నేతి యనబడు వ్యతిరేక భావ సిద్ధాంతము సూచించిన బ్రహ్మము నేనే, హృదయ గుహయందుండెడి బ్రహ్మను నేనే. సాథకులు, శమము, దమము, తపస్సు సత్యము, బ్రహ్మచర్యము మొదలైనవాని అభ్యాసము వలన కనుగొనగోరెడి బ్రహ్మము నేనే, దేహము, మనసు, ప్రాణము, మేధకాక మిగిలినది పరబ్రహ్మము, ఇదియే నేతి, నేతి అనెడి సిద్ధాంతము. ఇది వ్యతిరేక సిద్ధాంతము యొక్క తపస్సు, భోగ త్యాగ లక్షణములకే జాగ్రతా జాగ్రత లక్షణమని పేరు. జీవ బ్రహ్మ ఏకత్వమును చూపెడి లక్షణము ఇదియే. "తత్త్వమసి" మహా వాక్యము యొక్క అర్థమును "సోయం దేవదత్త" (ఇతడే దేవదత్తుడు) అని చూపించినట్లు పై చెప్పిన సిద్ధాంతము చూపగలుగు చున్నది. జీవునికి కప్పిన ఆవరణము తొలగింపగనే జీవుడే పరమాత్మగా, పరబ్రహ్మముగా చూపబడు చున్నాడు. బ్రహ్మ యొక్క స్థానమే జీవాత్మ, (దహరాకాశ మనగా హృదయమందుండు ప్రాణవాయువు; తపస్సు అనగా ఇంద్రియ నిగ్రహముచే చేయబడు ఆరాధన, దమమనగా మనోనిగ్రహము)..
నేను అను పదము సత్తు చిత్తానందములను అన్వయించునపుడు భౌతిక శరీరము "నేను" ఎట్లు కాగలదు? అజ్ఞానమువల్లనే భౌతిక శరీరము మహత్తరమనే నేననెడి పరమాత్మగా నెంచుచున్నాము ఈ అజ్ఞానమే అనేక జన్మలకు సుఖదుఃఖములకు హేతువగుచున్నది. కావున నేను అనే పదమును వివేకముతో పరబ్రహ్మ కన్వయింపగల్గినచో వెంటనే ఆత్మజ్ఞానము పొందుదురు. ఆత్మసాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము, దేహవాసనా నిర్మూలనము, సత్యము, చాల అవసరము. శాశ్వత బ్రహ్మయే బుద్ధికి బృహస్పతి, మనస్సునకు మనస్సు, చెవికి చెవి, కన్నుకు కన్ను, సర్వము పైన స్వయం ప్రకాశకుడు. అతని తేజస్సు వలన ఇతరములన్నియు ప్రకాశించుచున్నవి. సంపూర్ణుడయిన పరమాత్మయే అన్నింటికి ఆధారము. బ్రహ్మము మనస్సునందు జ్ఞాన స్వరూపుడుగా నున్నాడు. మనస్సు బుద్ధి అనెడి ఇంద్రియముల నావరించియుండును. అతడు లేనిది మనోబుద్దు లాలోచింపజాలవు. మరల అందులోనే లయమగుచున్నది. గడ్డి, భూమిలో పుట్టి భూమిలోనే నశించునట్లు, బ్రహ్మయందు, బుద్ధి జనించి, అందులోనే నశించుచున్నది. ఎట్లు ఇనుము నిప్పులో పెట్టగానే యెఱ్ఱరంగు పొందువో, నీరు పాల సాంగత్యము వలన ఎట్లు తెల్లబడునో, అట్లే జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మ సాంగత్యమువలన బుద్ధికూడ జ్ఞానము పొందుచున్నది.
(ఉ.వా.పు.84/86)
సర్వవేదాంత గ్రంథాల సారమెల్ల
ఒక్క వాక్యాన చెప్పుడు నొక్కసారి
అఖిల భూతంబులందున్న ఆత్మయు
నేనొక్కటేయని మనసున నుండవలయు
.
ఆత్మమే "ఎరుక అని పిలువబడుతుంది. ఈ ఎరుకయే సర్వులయందూ " నేను . నేను అనే స్పురణను కలిగిస్తుంది. ఆ స్ఫురణ శక్తి దేహముతో తాదాత్మ్యం పొందటంవల్లనే అహంకారంగా రూపొందుతుంది. తత్ఫలితంగా తన శరీరమే తాను అనే భ్రమకు గురి అవుతాడు మానవుడు. ఇదే మిథ్య నేను .
ఈ నేను ఆత్మ పరమాత్మ బ్రహ్మము. దేహి “క్షేత్రజ్ఞుడు దైవము మొదలైన పదములన్నీ ఆధ్యాత్మిక పరిభాషలో సందర్భోచితంగా ఉపయోగ పెట్టే పర్యాయ పదములే.
(శ్రీస.పు.39)||
"నేను ఆధునికుణ్ణి. మరెల్లపుడూ కూడ సనాతునుణే. నే నెప్పుడూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరిరక్షించడానికి సజ్జనుల్ని సంరక్షించడానికి వారి అభ్యుదయానికి కావలసిన నిశ్చయ పరిస్థితుల కల్పనకూ అజ్ఞానంతో దారీ తెన్నూ లేక తిరుగాడుచున్న వారికి ఆత్మ విజ్ఞానం ప్రబోధించడానికి వస్తూంటారు. కొంతమంది సంశయాళువులు పరమాత్మ మానవశరీరము ధరిస్తారా" అని అడుగవచ్చును. "మంచిది, మనిషికి ఆనందం మానవరూపంద్వారానే లభిస్తుంది. అతడు ఆత్మ ప్రబోధాన్ని ఉత్తేజాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని మానవ భాషలోనూ మానవ సంభాషణల్లోనూ మాత్రమే పొందగలడు."
(సా.ఆ.పు.108)
విశ్వాసమూ, భగవదేచ్ఛకు శరణాగతి చెప్పుకోవడమూను, భారాలన్నీ విసరి పారవేసి తేలిగ్గా ఉండు. అపుడొక అడుగు ఒక తరంగ మూర్ధంమీదా వేరొక అడుగు మరొక తరంగమూర్ధంమీదా ఉంచి ముందుకు పోగలవు. భగవంతుడు, కూడా ఉండి తీసుకు పోగలడు - నీ మనస్సు నిన్ను విచారంలోనికో గర్వానికి అసూయకో లాక్కుని పోతుంటే నాదిక్కు తిరుగు. నీ మనస్సు యొక్క లోతులను, అవెంత పరిహాసాస్పదాలుగా ఉన్నా సంశయాలతోగాని ఆశాభంగాలతోగాని ఎంత క్రూరంగా చిందవందరై యున్నా నాకు చూపించు. నాకు తెలుసు వాటి నెట్లా సరిచేయాలో. నేను నిన్ను త్యజించును. నీ అమ్మను నేను.
(సా.ఆ. పు. 187)
నేను ప్రతివారికీ సేవకుణ్ణి
నన్నే పేరున పిలిచినా పలుకుతాను.
ఏమంటే పేర్లన్నీ నావేగనుక.
నాకు ప్రత్యేకమైన పేరంటూ ఏమీ లేదు.
ఒకరు కృష్ణుడంటే యిష్ట పడతారు.
వేరొకరి మనస్సుకు శివుడంటే ప్రీతి;
మరొకరు నిరాకారుడైన అల్లా అంటే అభిమానిస్తారు.
వారంతకు ముందునుండీ పూజించే మూర్తులను
విడచివేసి నేనెప్పుడూ ప్రజల్ని నన్నారాధించమని కోరను.
నేను ధర్మాన్ని ప్రతిష్టించడం కొరకు వచ్చాను.
అందుచేత నాకు ఏవిధేయతలవసరం లేదు.
కోరనుకూడ. వారెవరైనప్పటికీ వాటిని మీ
ప్రభువుకుగాని గురువుకుగాని సమర్పించండి.
నేను మీ దృష్టుల్ని సరిదిద్దుటకు వచ్చిన మహాసాక్షిని.
(సా.ఆ.పు.243)
నపుణ్యం నపాపం నసౌఖ్యం దుఃఖం
నమంత్రో నతీర్ధం నవేదా నయాజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
సచ్చిదానంద రూపం సత్యం శివం సుందరమ్.
నేను పుణ్యముకాదు, పాపముకాదు. నేను సౌఖ్యం కాదు, దుఃఖముకాదు. నేను మంత్రము కాదు. తీర్థము కాదు. నాకు వేదయజ్ఞములు లేవు.నేను భోక్తను కాదు. భోజనము కాదు. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం. శివం సుందరం. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి సంబంధించినది మానవుడు సుఖాభిలాషి ఆనందపిపాసి..
(బృత్ర.పు.103/104)
నేను పోతే అనగా నేను అనే ఆహం పోతే పోవచ్చును. అనేదే దీని భావము. అహం. అహం. నేను అనేది ఒక అహం. ఈ అహం ఆకారముతో కూడటంచేత అహంకారముగా మారిపోయినది. దేహాత్మ భావము పోయినపుడే మోక్షమునకు అర్హుడవుతాడు. అనే దీని అంతరార్థము. ప్రతి మానవుని యందు ఈ దేహాత్మ భావము దేహతాదాత్మ్యమును పొందినప్పుడే అహంకారంగా రూపొందుతుంది. ఈ అహంకారముండి నంతవరకు, బుద్ధి ప్రకాశించదు. కనుక మొదట బుద్ధిని ఆవరించిన అహంకారాన్ని నిర్మూలించటానికి తగిన కృషి చేయాలి.
(బృత్ర.పు.94/95)
(చూ|| అవతారము, ఆత్మజ్ఞానము, ఎరుక, దివ్యప్రకటనలు, దైవశక్తి, ధర్మము. నటరాజు, పేరు, బ్రహ్మము, విశ్వాసము, సత్యము, సర్వాంతర్యామి)