ఈ బదరీ యాత్రకు వచ్చిన వారు ప్రతిక్షణము భగవంతుని అనుగ్రహం పొందుతూనే ఉన్నారు. వీరిలో ఒక నూటయాభైమంది మరీ వృద్ధాప్యంలో ఉన్నారు. వారి ఆరోగ్యం బాగాలేదు. అటువంటివారు ఈ యాత్రలో ఒకక్షణకాలం కూడా తలనొప్పి కూడా ఎరుగకుండా వచ్చారు. దానికి కారణం స్వామి! స్వామి కూడా బదరీకి వెళ్ళిన కారణం బదరీలో పవిత్రతకు మూలకారణమైన నేత్రలింగాన్ని తిరిగి శక్తిమంతం చేయవలసి ఉండటమే. శంకరాచార్యులు కైలాసం నుండి ఐదు లింగములను తెచ్చి ద్వారక, శృంగేరి, బదరీ, పూరీ, చిదంబరములలో ప్రతిష్టించారు. వాటిల్లో బదరీలోనిది నారాయణ అంశము. దానిని శక్తిమంతం చేయటం నాకర్తవ్యం. ఆ సన్నివేశాన్ని మీరంతా దర్శించారు.
నేత్రలింగాన్ని శక్తిమంతం చేయటం నేను ఈ సంవత్సరమే (1961) చేయవలసి ఉంది. కారణం నేను ఈ అవతారము ధరించి ఇది 35 వ సంవత్సరము. మరొకటి శృంగేరీలో శంకరాచార్య పీఠం ఈ సంవత్సరం అధిష్టించిన వారు 35వ వారు. అందువల్ల బదరికాశ్రమంలో ఆధ్యాత్మిక సంపద వెల్లివిరియటానికి, ఆ బ్యాటరీ చార్జి చేయటానికి ఇది ముఖ్యమైన సమయంగా నేను భావించాను. శంకరాచార్యులు నారాయణుని విగ్రహం క్రింద నిక్షిప్తం చేసిన నేత్ర లింగాన్ని నేను హస్తచాలనంతో బయటకు తీసి మరల హస్తచాలనంతో గంగోత్రి జలము తెప్పించి దానికి అభిషేకం చేశారు. తరువాత బంగారు బిల్వపత్రాలను, తుమ్మిపూలను అప్పటికప్పుడు సృష్టించి ఆ లింగమునకు పూజ చేసి తిరిగి దానిని స్వస్థానమునకు పంపించాను. ఆ లింగమును ఒక బంగారు పద్మంలో ఉంచాను. ఈ పద్మం రేకులు మూడు వరుసలుగా ఉన్నాయి. ప్రతి వరుసలోను మరల 16 రేకులు చిన్న వరసలు ఉన్నాయి. ఆ బంగారు కమలము హృదయ కమలమును తెలియజేస్తుంది.
(వ.61-62 పు.41/42)