నేటి విద్యా విధానము ఈ వికృతి మార్గము పొందటానికి కారణమేమిటి? ఇంటిలో తల్లిదండ్రులు, విద్యా సంస్థల యందు అధ్యాపకులు, సమాజమునందు నాయకులు సరియైన ఆదర్శమును నిరూపించలేకపోవడం చేతనే విద్యార్థుల మార్గం పెడమార్గంగా మారింది. ఇంటిలో తల్లిదండ్రులు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి. విద్యార్థులు అత్యంత తెలివితేటలు గలవారు కనుకనే, అన్నింటిని గమనిస్తూ వస్తున్నారు. "ఆవు పంటలో చేరి మేస్తుంటే, దూడ గట్టుపై ఉంటుందా?" కనుక, దీనికి పెద్దలే మూలకారణం. మొట్టమొదట ఇంటియందు తల్లిదండ్రులు సరియైన ఆదర్శాన్ని నిరూపించలేక పోతున్నారు. తమ కుమారుడు కేవలం విద్య నభ్యసించి ఉద్యోగంలో చేరి చక్కగా ధనము నార్జించాలనే లక్ష్యము తప్ప వాడు సద్గుణవంతుడు, సదాచార సంపన్నుడు కావాలనేది తల్లిదండ్రులలో లేకపోతున్నది. అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించవలసిందే. కాని, అది ధృతరాష్ట్ర ప్రేమగా ఉండకూడదు. పిల్లలు ఏమి చేసినా దానిని సమర్ధించుకుంటూ పోకూడదు. తప్పుకు తగిన శిక్ష ఒప్పుకు తగిన సత్ఫలితము అందిస్తూ రావాలి.
(శ్రీ భ.ఉ.పు. 143)