గాఢమైన నిశ్శబ్దమునందే భగవద్వాణి వినిపించును.
(ఆ. శా. పు.2)
చేతితో సత్కర్మల నాచరించాలి, నోటితో దైవ చింతన చేయాలి. ఈ రెండింటి ఏకత్వమే బ్రహ్మతత్వంగా మనకు ప్రాప్తిస్తుంది. కేవలము నోటితో భగవశ్చింతన చేసినంత మాత్రాన చాలదు. గ్రామ ఫోను రికార్డు పాడుతుంది, టేపురి కార్డు పాడుతుంది. మీరు కూడా పోడుతున్నారు. కాని, ఈ పాటలు సరియైనవి కావు. ఆ నాదం హృదయం నుండి రావాలి. మీకందరికీ తెలుసు. నేను మాట్లాడినవి, పాడినవి, అన్ని రికార్డు చేస్తున్నారు. అయితే, టేపు తీసి చూస్తే అవన్నీ కనిపిస్తాయా? టేపును ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తే, అవి మనకు వినిపిస్తాయా? అంతమాత్రము చేత ఆ టేపులో మాటలు లేవని భావించడానికి వీలు లేదు. గదా! ఆ టేపులో మాటలు వినాలంటే టేపుకు, కరెంటు కనెక్షన్ చేయాలి. అప్పుడే టేపులో ఉన్న శబ్దాలన్నీ నీకు వినిపిస్తాయి. అదే విధంగా హృదయమనే టేపుకు, ఆత్మతత్వంతో కనెక్షన్ చెయ్యాలి. అప్పుడే "ఓం, ఓం" అనే ప్రతి ధ్వనిని నీవు నిరంతరం ఆనందంగా వినవచ్చును. అదే “శబ్ద బ్రహ్మము". అంతేగాని, మనం చేసే శబ్దాలన్నీ బ్రహ్మము కాదు. నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మము. నీవు ఏకాంతమైన స్థానంలో కూర్చొన్నప్పుడు, అక్కడ ఒక విధమైన శబ్దం ప్రారంభమవుతుంది. అదే నిశ్శబ్దములోని శబ్దము.
(శ్రీ భ ఉపు.136)