క్రోధము మానవునకున్న జ్ఞానమును నాశనము చేయును. కామము కర్మనాశము, లోభము భక్తి వినాశమును గావించును. కామ, క్రోధ, లోభములు వరుసగా కర్మ, జ్ఞాన, భక్తిహీనుని గావించును. అనగా మూర్ఖుని గావించును. క్రోధమునకు కామమే కారణము, కామము అజ్ఞానము వలన కలుగును. కాన త్యాగమనగా అజ్ఞానమును త్యాగము చేయుట (వదలుట) మోక్షము.
(వి.వా.పు. 18/19)
శరీరాకారమువలన సుఖదుఃఖములు కలుగును. సుఖదుఃఖముల నుండి విముక్తి కలుగ వలెనన్నచో శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలెను. శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలెనన్నచో స్వార్థపూరితములైన కార్యములను చేయరాదు. అట్లు స్వార్థమును విడనాడుటకు రాగద్వేషములు విడనాడవలెను. ఇట్టి కోర్కె మోక్షమునకు పరమశత్రువు. ఈ కోర్కెలో జనన మరణములను చక్రమునకు మానవుని బంధించు చున్నవి. మానవుల బాధలకు ఇవియే మూలకారణము ఇట్టి విచారణ వలన జ్ఞానమును ప్రకాశింపజేసినప్పుడు మోక్షము సిద్ధించును. మోక్షమనునది స్వతంత్రము. అట్టి బాటలనుండి దూరమై ఏ సుఖదు:ఖ సంతోషములకూ చేరక స్వతంత్రమైన ఆనందమును అనుభవించునదే మోక్షమని అందురు.
(జ్ఞా.వాపు. 6)
"కర్మ ద్వారానే మోక్షసిద్ధి. భక్తితో కర్మచేస్తే సంసారభక్తి. జ్ఞానం కూడా కొంచెం వికసిస్తే వానప్రస్థ భక్తి. జ్ఞానరూపాన భక్తి పర్యవసించినప్పుడు చేసే కర్మ సన్యాస భక్తి. అదిమోక్షమే. కర్మ చేయకపోతే పురోగతే కష్టం.
జ్ఞానులు కూడా కర్మ చేయక తప్పదు. కాని ఈ కర్మ వారిని అంటదు. హంసలు పొడి రెక్కల తో నీళ్ళలో దిగి విహరించి ఒడ్డుకు చేరుకున్నాక రెక్కలు విదిలించి కొంచెమైనా తడిలేకుండా చేసుకోగలవు. అటువంటిదే జ్ఞానుల కర్మాచరణ, అహంభావం లేకుండా, ప్రతిఫలా పేక్ష లేకుండా పనులు చేస్తారు. లోకక్షేమం కోరుతూజగత్కళ్యాణ సంధాయక కార్యకలాపాలు సాగించటం వారి స్వభావం."
(ఉదయం ప్రత్యేక అనుబంధం పు.4)
శ్లో: సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
అన్ని ధర్మాలు నీవు అనే తత్వాన్ని విసర్జించమన్నాయి. అన్ని ధర్మాలు అంటే ఏమిటి? అసలు ధర్మమంటే తెలిస్తే గదా! అన్ని ధర్మాలు వదలి పెట్టేది. ఇక్కడ ధర్మమనగా ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ప్రాణ సమానమైన ధర్మగుణం ఉంటున్నది. అదే ఆ వస్తువు యొక్క సహజ ధర్మం . అగ్నికి వేడి ధర్మం . వేడి లేకపోతే అది బొగ్గుగా మారిపోతుంది. అది అగ్ని అనిపించుకోదు. చక్కెరకు తీపి ధర్మం . తీపిలేకపోతే అది కేవలం ఇసుక అవుతుంది. కాని చక్కెర మాత్రం కాదు. అదే విధంగా మానవుని ధర్మం ఏమిటనగా, వాంఛలు కలిగియుండుటయే! నిరంతరం వాంఛలు పెంచుకోవటమే మానవుని ధర్మం. కనుక వాంఛలు త్యజించుటయే సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పబడుతుంది. ఈ విధానమే వైరాగ్యమని పిలువబడుతుంది.
మోక్షమంటే విడుదల. ఉపాధిని ధరించిన జీవులంతా ఏదో ఒక అవస్థనుండి విడుదల కోరుదురు. కనుక ప్రతిజీవుడూ ముముక్షుడే! ప్రతి మానవుడు త్యాగి అయే తీరాలి. "నకర్మణా, నప్రజయా, ధనేన త్యాగేనైక అమృతత్వ మానశుః" ఇది చివరి సత్యం. దేహమును విడిచి పోయే వాడెవడూ పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్ళడు.
నిగముల్ హరించి నిండు దూషణ చేసి
సోమకాసురుడేమి సుఖమునొందె?
పరసతి నాశించి పదితలల వాడేమి
పట్టుకుపోయెను గట్టిగాను?
ఇల సూదిమొన మోప ఇయ్యజాలనటన్న
దుర్యోధనుడేమి దోచుకొనిపోయె?
పసిపాపలను కూడ కసిపట్టి చంపిన
కంసుడేపాటి కాచుకొనియె?
నేటి దుర్మార్గులకు కూడ నిదియె గతియు
సత్యమును దెల్పుమాట ఈసాయి మాట.
త్యాగము చేయని వానికి ప్రకృతి నిర్బంధముగా త్యాగము నేర్పుతుంది. అట్లుకాక మునుపే త్యాగమును నేర్చుకొనుట మంచిది. ముఖ్యముగా వాంఛలను త్యాగము చేయుట, తదుపరి సంపూర్ణ శరణాగతి తత్వముతో, అనన్యభక్తితో చిత్తమును భగవంతుడి కర్పించితివా ఆయనే నీయోగక్షేమాలను చూసుకొంటాడు. యోగము వద్దు. తపస్సు వద్దు. శక్తిలేక ఏ ఇతర సాధనలు చెయ్యలేక పోయిననూ సరే! అన్ని ప్రాపంచిక ధర్మములను విడిచి పెట్టు; చిత్తమును నాకర్పించి శరణుజొచ్చితివా, నిన్ను సమస్త పాపములనుండి విముక్తిని చేస్తానంటున్నాడు భగవంతుడు. అట్టివానికి వర్ణాశ్రమ అవస్థలతో గాని, అర్హతలతోగాని సంబంధం లేదు. వంశమనే దానిని విచారించినప్పుడు
వాల్మీకి ఎవ్వరి వంశమువాడు?
కులమా ప్రధానమనుకుంటే
నందనుడు ఏకులమున పుట్టె?
వయస్సు అనుకుంటే
వసుధ ధృవుడెంత వయస్సు కలిగి యుండె
మతిని చద్దామా అంటే
విదురున కెంత వితరణ మతియుండె
తెలివి చూద్దామా అంటే
తిమ్మన కెంత తెలివియుండె
ఇవేవి ప్రధానం కాదు. శరణు జొచ్చిన చాలు. మనస్సును స్థిరముగా ఒక్క భగవంతుని పై మాత్రమే నిలిపి ప్రపంచ ధర్మానికి వస్తు ప్రపంచానికి దూరముగా నుండిన చాలు. అలాగని ప్రపంచము నుండి పారిపోయి అడవుల చేరుట భక్తికానేరదు. సంపూర్ణ శరణాగతి నొందినవానికి ఇతరమైన సంబంధము లేవియు ఉండవు. బాధ, సుఖము, అను ద్వైత భావముండదు. నిరంతరము దైవ భావలో ఉన్నవాడికి ద్వైతభావము ఎలా ఉంటుంది? చిత్తము భగవంతుడి కర్పితము చేయకుండా ఎన్ని ప్రాపంచిక ధర్మాలనుపాటించినా ప్రయోజనం ఉండదని భక్తులు తెలుసుకోవడం ఎంతైనా అవసరము.
(శ్రీభ.ఉ.పు.35/36)
మంచిగావుండు, మంచి చెయ్యి మంచి చూడు, మంచిది విను. ఇదే మోక్షానికి దారి.
(సా.పు.91)
మోహము పోతే మోక్షమే (సా.పు. 104)
దేహంబు క్షీణించు దిన మెవ్వరెరుగరు
కష్టంబు లొచ్చుట కాంచ లేరు
జగతి పై యెవరైన జన్మించు టెరుగరు
దివి భువి సుఖముల్ తెలియలేరు
మాయ లోపల బుట్టి మమత వీడగలేరు
ఇంచుక నా మాయ లెరుగ లేరు
శాశ్వతము కాదు యివి అన్ని సత్యముగను
మోహ జాలంబులో పడి మునగకుండ
పరబ్రహ్మ నెప్పుడూ చిత్తమందు
తలచు వారికి మోక్షంబు తథ్యమప్పా||
(మధుర భక్తి పు201-202)