ప్రేమలేని జీవితం జీవితము కానేరదు. ప్రేమలేనటు వంటి హృదయము హృదయము కానేరదు. ప్రేమగలవాడేమానవుడు. అయితే ఇట్టి ప్రేమను ప్రవేశింప జేయకుండా మూడు మృగములు సింహద్వారమునందు అడ్డుగా నిలిచియున్నవి. 1. క్రోధము అనే కుక్క దీనిని అడ్డగిస్తున్నది. 2. అభిమానములనే పంది అటకాయిస్తున్నది. 3. అహంకారము అనే దున్నపోతు అడ్డముగా పరుండి యున్నది. వీటిని సంహరించి విశాలమైన ప్రేమతత్త్వలో మనం ప్రవేశించాలి. అహంకారము మృగలక్షణం. అహంకారమునుండినంతవరకు వాడు మానవుడు కానేరడు, క్రోధము మహా ప్రమాదకరమైనది. మానవత్వాన్ని కూడా సంహరించడానికి ప్రయత్నిస్తుంది. మనిషికి మనిషికి మధ్యమన్న సంబంధ బాంధవ్యాన్ని దూరంగా విస్తుంది. ఈ క్రోధమే పాపమునకు ధూపముగా ఏర్పడుతున్నది. క్రోధం వల్లనే మానవుడు గౌరవ మర్యాదలను కూడా కోల్పోతున్నాడు. అభిమానం చాలా సంకుచితమైనది. ఐతే ఆత్మాభిమానం వుండాలిగాని, దేహాభిమానం మాత్రం వుండకూడదు. దేహాభిమానాన్ని త్యజించడమే త్యాగం, ఆత్మాభిమానాన్ని అభివృద్ధి పరచుకోవడమే యోగం.
(శ్రీన.2000పు.35)