దేహాభిమానం ఉండినంతవరకు భిన్న అభిమానములు ఆవిర్భవిస్తుంటాయి. శంకరులవారు కాశీక్షేత్రాన్ని చేరారు. విశ్వనాథుని దర్శించారు. స్వామీ! నేను ఎందుకోసం ఇక్కడకు చేరాను? నేను మూడు విధములైన పాపములు చేశాను. ఆ మూడు పాపముల పరిహార నిమిత్తమై నిన్ను దర్శించవలసి వచ్చింది" అన్నాడు. ఏ పాపం చేశాడు? ఎవరిని చంపాడు? ఎవరిని నొప్పించాడు? ఏమి దొంగిలించాడు? ఎవరి సొత్తు అపహరించాడు? ఏమీ చేయలేదే! మరి పాపినని అని ఎట్లా అన్నాడు? మొదటి పాపము చెబుతున్నాను వినండి. “యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ" - అని నేనే వ్రాశాను. భగవంతుని వాక్కు చేతగాని, మనస్సు చేతగాని వర్ణించుటకు సాధ్యం కాదు అని నేనే తెల్పాను. అట్టి నేను ఇక్కడకు వచ్చి నిన్నువర్ణిస్తున్నాను. నేను చెప్పినది ఒకటి, చేసినది మరొకటి. ఇది పాపం కాదా! ఈ పాపాన్ని క్షమించమ”ని ప్రార్థించాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరో ముఖమ్
సర్వతః శృతిమల్లోకే సర్వమా వృత్యతిష్ఠతి.
"ఈశ్వరా! సర్వభూతములందు నీవే ఉంటున్నావని వర్ణించాను. భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడని వర్ణించాను. భగవంతుడు హృదయవాసీ అని చెప్పాను. కానీ నిన్ను దర్శించటానికి కాశీ క్షేత్రము వచ్చాను. నేను బోధించుట ఒకటి, ఆచరించుట మరొకటి. ఇది పాపం కాదా!" అన్నాడు ఇంక మూడవ పాపమేమిటి? "పాపమే లేదు మానవునికి అని నేను వర్ణించాను. "న పుణ్యం, న పాపం, న సౌఖ్యం నదుఃఖం...." అన్నాను. అలాంటి నేనే ఈ శరీరంతో పాప పరిహారము చేయమని కోరటం పాపం కాదా! నేనే భగవంతుడనైతే యింక పాపము ఎక్కడ చేశాను? ఇన్ని చెప్పిన నేనే తిరిగి పాప పరిహారం కోసం ప్రార్థించటానికి వచ్చానంటే, యిదే ఒక పెద్ద పాపం" అన్నాడు.
(ద. స.98పు.21/22)