మూడుసూత్రాల ప్రకారం నడుచుకుంటే అన్ని రంగాల్లోను ప్రగతి సాధించవచ్చు. మొదటిది దైవ ప్రీతి, రెండవది పాపభీతి, మూడవది సంఘనీతి. దైవ ప్రీతి ఉన్నప్పుడే పాపభీతి ఉంటుంది. పాపభీతవల్లనే సంఘనీతి ఏర్పడుతుంది. అన్నింటికీ మూలం దైవ ప్రీతి. నేను మా పిల్లలకు చెబుతుంటాను. నువ్వేదనా చేయదల్చుకున్నప్పుడు, ఈ పని స్వామి అంగీకారాన్ని పొందుతుందా? ఈ పనిని స్వామి హరిస్తారా?అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నీకు స్వామి పై నుండేప్రేమ నీచేత ఏ చెడునూ చేయించదు. అంటే, దైవప్రీతి పాపభీతికి దారితీస్తుంది. సమద్రంలో ఎన్ని అలలు చెలరేగినప్పటికీ సముద్రంలోని గండశిలలు మాత్రంకదలక చెదరక నిర్భీతితో నిలుస్తాయి. అట్లే జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనప్పటికీ నీ విశ్వాసం దృఢంగా నిలచియుండాలి. ఎవడైనా వచ్చి దేవుడు లేడన్నాడనుకో, అప్పుడు నీవేం చేయాలి? "నీ దేవుడు నీకు లేకుండా పోవచ్చుగాని, నాదేవుడు లేడనడానికి నీకు అధికార మేముంది?" అని ప్రశ్నించాలి. "దేవుడున్నాడు" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలని లోగడ చెప్పాను. ఆ సమయంలో సందేహం కలుగకుండా, "సంశయాత్మా వినశ్యతి" అనేఅషాక్టరీ మంత్రాన్ని కూడా జపించు.God is no-where అన్న మాటలో మొదట God is అంటున్నావు. అంటే దేవుడున్నాడు. కానీ no-where అన్నప్పుడు నీకు లేకుండా పోయాడు. ఇపుడు " అక్షరాన్ని "no"కీ జతజేర్చి చదువు. ఏమౌతుంది? God is now-here అవుతుంది. కనుక దేవుడు లేడని అంటున్నావంటే - నీకు నీవు లేకుండా పోయా వన్న మాట. అది ఇంపాసిబుల్!. ఈనాడు మనిషి పాపకార్యలు చేస్తున్నాడు. కానీ పాపఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేడు. పుణ్యకార్యాలు చేయడం లేదు. కానీ పుణ్యఫలితాన్ని మాత్రం ఆశిస్తున్నాడు. పాపకార్యాలను చేస్తూ ఉంటే పుణ్యఫలాలెలా వస్తాయి? నీవు చేసే పాపకార్యాల రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్లు రేపు నీకే ఎదురౌతాయి. ఈ విషయాన్ని గుర్తిస్తే పాపకార్యాలు చేయడానికి ముందంజ వేయవు. కనుక దైవమంటే ప్రీతి. పాపమంటే భీతి ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడే సంఘంలో నీతి నిలుస్తుంది.
(స.పా.ఫి.98పు 54)