చర్మచక్షువులు మానవులకు మాత్రమేకాదు. పశుపక్షి మృగాదులకు, క్రిమికీటకాదులకు ఉంటున్నది. మానవుని విశిష్టత ఏమిటి? జ్ఞానచక్షువులను తాను అభివృద్ధి పరచుకొనకుండిన ఈ చర్యచక్షువులు ఉండి పశు పక్షిమృగాదులతో సమానమనే అనిపిస్తుంది. మానవ జీవితము అమూల్యమైనది. అర్థవంతమైనది.అనుభవించదగినది. ఇట్టి పవిత్ర మానవజీవితమును సార్థకము గావించుకొనవలెనన్న ఆత్మ జ్ఞానము అవసరము.‘జంతూనాం నరజన్మదుర్లభం కాని ‘జ్ఞానేన శూన్యః పశుభిస్సమాన్యః జ్ఞానమే లేకుండిన పశువుతో సమానమే. ఈ చర్మచక్షువులు బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగు తున్నవే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించుటకు సాధ్యం కాదు. ఎవరి నేత్రములు వారే చూడలేరు. ఎవరి నేత్రములు వారినే చూడలేదు....కనుక చర్మచక్షువులు సహజమైన జీవితానికి దృశ్య కల్పిత జగత్తును చూపించునవి మాత్రమే. జ్ఞాననేత్రము ప్రతి మానవునకు అత్యవసరము. జ్ఞాననేత్రమన్నా, దివ్యనేత్రమన్నా ఆత్మనేత్రమన్నా, బ్రహ్మనేత్రమన్నా ఒకదానికొకటి పర్యాయపదములు. సర్వం బ్రహ్మమ్ అనే భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్తంతయు బ్రహ్మభావంలో రూపొందుతుంది. ఎట్టిభావమో అట్టి దృశ్యము ఎట్టిరంగో అట్టి ప్రకృతి, దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
(బృత్ర.పు.158/159)