“ఏకం సత్ విప్రా: బహుధా వదంతి", దేవుడు ఒక్కడే, కనుక, నీ దేవుడు, నా దేవుడు అనే భేద భావములకు చోటివ్వకండి. కొందరు తమకు రాముడంటేనే ఇష్టమంటారు. కొందరు కృష్ణుడంటేనే ఇష్టమంటారు, కొందరు శివుడంటేనే ఇష్టమంటారు. కొందరు సాయిబాబా అంటేనే ఇష్టమంటారు. ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క లక్షణాలు. దైవం ఒక్కడే, అతడు సర్వాంతర్యామి. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించండి. మీరు క్రిస్టియన్లు అయితే నిజమైన క్రిష్టియన్లుగా తయారు కండి: హిందువులైతే నిజమైన హిందువులుగా తయారు కండి; ముస్లింలైతే నిజమైన ముస్లింలుగా తయారు కండి. మీ ప్రవర్తన మానవుడనే పేరుకు తగినట్లుగా ఉండాలి.
కాడు మానవుండు ప్రేమయే లేకున్న
కాడు క్రైస్తవుడు, కాడు సిక్కు
కాడు హైందవుండు, కాడు ముస్లిమ్
వాడె రాక్షసుండు వసుధ పైన!
ప్రేమస్వరూపులారా! రాముడు "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్నాడు. దేశము తల్లి, సంస్కృతి తండ్రి, కనుకనే, జన్మభూమిని Mother land అంటారుగాని, Father land అనరు. భారతీయ సంస్కృతి తల్లికి ఇంత ప్రాధాన్యత ఇచ్చింది. తల్లి ప్రేమతత్త్వానికి అనుక్షణమూ జ్ఞప్తియందుంచుకొని ఎలాంటి పరిస్థితి యందైనా తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. తల్లి సంతోషపడక నేను సంతోషపడను. తల్లిని సంతృప్తి పరచితే నాకు కూడా సంతృప్తి!
(స.సా.డి.99పు.364/365)