నిజముగా శరీర మనో బుద్ధి అంతఃకరణం తత్త్వాన్ని ఛేదించి గమ్యం చేరవలెనన్న మానసిక తత్త్వాన్ని, బుద్ధియొక్క విచారణను, అంతఃకరణ తత్త్వాన్ని, జాగ్రత్ స్వప్న సుషుప్తులను చాటాలి. అప్పుడే "నేను" అనే ప్రజ్ఞాతత్త్వాన్ని అర్థము చేసుకోవచ్చును. దేహం, మనస్సు బుద్ది, అంతఃకరణ ఇవన్ని ప్రాకృతమైన భావములతో కూడినవే. ఇవి మనస్సు యొక్క వికార స్వరూపములే. ఈ మనస్సు ఉండినంత వరకు దివ్యత్వాన్ని అర్థము చేసుకోలేము. కనుక, మానసిక తత్త్వాన్ని నిగ్రహించు కోవడానికి తగిన కృషి చేయాలి. దీని ఆంతరార్థమును పురస్కరించుకొనియే వేదము నాలుగు విధములైన మహా వాక్యములను ప్రబోధిస్తూ వచ్చింది.
మొదటిది "ప్రజ్ఞానం బ్రహ్మ”, ప్రజ్ఞానము అనగా చైతన్యము. ఈ ప్రజ్ఞానము సర్వేంద్రియములందు, మానవ దానవ దివ్యత్వములందు, పశుపక్షి మృగాదుల యందు కూడా వ్యాపించియున్నది. కనుక సర్వజీవుల యందు, సర్వత్రా వ్యాపించినట్టి ఈ చైతన్యము బ్రహ్మతత్వముగా రూపొందుతూ వచ్చింది. బ్రహ్మ అనగా ఏమిటి? ఇది వ్యాపకత్వముతో కూడినది. శరీర మనో బుద్ధి అంత:కరణ తత్వములకు, జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కూడా ఆతీతమైనది. ఇదే “ప్రజ్ఞానం బ్రహ్మ" ప్రజ్ఞానము చైతన్యంతో కూడినది. కనుక, చైతన్యం బ్రహ్మ రెండూ సమాన పదాలే. అనగా దైవత్వము చైతన్యము వ్యాపకత్వము మొదలైనవన్నీ ప్రత్యేక మైన రూప నామములు కావు. ఇవన్నీ బ్రహ్మతత్వము యొక్క వివిధ అంగములే. మన దేహానికి “మానవ దేహము " అని ఒక పేరున్నది. కాని, ఇది కాళ్ళు, చేతులు, నోరు, ముక్కుమొదలైన అంగములతో కూడినది. అదే విధముగా, ఈ బ్రహ్మతత్వమనేది ప్రజ్ఞతో, వ్యాపకత్వములో, చైతన్యముతో, పరిపూర్ణత్వముతో కూడినది. ఇవన్నీ దాని అంగములే. ఈ అంగములన్నింటి యొక్క సమ్మిళిత స్వరూపమే దివ్యత్వము. "ప్రజ్ఞానం బ్రహ్మ" అనగా, చైతన్యమే బ్రహ్మ. ఈ చైతన్యము సర్వత్రా ఉంటున్నది. ఈ చైతన్యము లేని స్థానమే లేదు. కనుక, ఈ “ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహా వాక్యాన్ని పురస్కరించుకొనియే దైవం సర్వవ్యాపకుడనియు, సర్వశక్తి మయుడనియు వేదం ప్రబోధిస్తూ వచ్చింది.
ఇంక రెండవది "అహం బ్రహ్మస్మి" ఇక్కడ అహం, బ్రహ్మ, అస్మి అనే మూడు పదములున్నవి. హం అనగా ఏమిటి? ఇది పరిపూర్ణత్వం. దేశ కాల పరిస్థితులలో ఏమాత్రము మార్పుచెందనిది. దీనికి సాక్షి అని మరొక అర్థము కూడా ఉన్నది. అనగా, అన్నింటికీ తానే సాక్షీభూతుడు. జరిగినదానికి జరుగుతున్నదానికి, జరుగబోయేదానికి తాను సాక్షిగా ఉంటాడేగాని దేనితోను అతనికి సంబంధం లేదు. ఇంక బ్రహ్మ అనగా, ఆకాశాదిపంచభూతములకు ఆధారమైన తత్త్వము. అహంనకు, బ్రహ్మకు మధ్యలో ఎట్టి భేదమూ లేదు. ఇవి రెండూ అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు. అహంతత్త్వమునకు కూడా వ్యాపించే శక్తి ఉన్నది. వ్యాపించే పంచభూతములందు అహం తత్త్వమున్నది. ఈ రెండింటిని ఏకం చేయునదే - అస్మి. ఇవి రెండూ భిన్నంకాదు, ఒక్కటే అదే “అహం బ్రహ్మస్మి"
మూడవది "తత్త్వమసి" తత్ - అనగా ఏమిటి? ఇది సృష్టి పుట్టుకకు పూర్వము, పుట్టిన తరువాత సృష్టి యందు నిరంతరము మార్పు చెందకుండా ఉండేది. దీనికి రూపనామములే లేవు. అందుచేతనే దీనిని తత్’అని పిలిచారు. ఇది నిరంతరం మార్పు చెందినది కనుకనే దీనిని being (ఉన్నది) అని చెపుతూ వచ్చారు. ఇది త్రికాలములకు అతీత మైనది. ఇంక త్వం" అనేది రూప నామములతో కూడినది. ఇది శరీర మనో బుద్ధి అంత:కరణేంద్రియాలతో కూడినది. ప్రాకృతమైన స్వరూపాన్ని ధరించినటువంటిది. ప్రాకృత మునకు అప్రాకృతమునకు ఉన్న సంబంధము ఒక్కటే. అన్నింటియందు "నేను" అనే ప్రజ్ఞాశక్తి ఏకంగానే ఉంటున్నది. దీనికొక ఉదాహరణ. ఒక శిల్పి పెద్ద రాతి గుండు నొక దానిని తీసుకొని చక్కని కృష్ణ విగ్రహంగా మలిచాడు. ఆవిధంగా మలిచేటప్పుడు తన లక్ష్యాన్ని కృష్ణుని పైననే ఉంచుకొని మిగిలిన పనికిరాని రాతి ముక్కలను పారవేస్తూ వచ్చాడు. ఆ విగ్రహాన్ని పూర్తిచేసిన తరువాత దానిని మందిరంలో ప్రతిష్టించాడు. అప్పటి నుండి దానికి షోడశోపచారాలతో పూజలు జరుగుతూ వచ్చాయి. కాని, ఆ కృష్ణ విగ్రహాన్ని మలిచిన తరువార మిగిలిన రాతి ముక్కల న్నీ కొండలోనే నిలిచి పోయాయి. ఐతే, పూర్వ ఇవన్నీ ఒక్క రాతి గుండులో ఉండినవే. కాని అక్కడ మందిరంలో రూపనామములు చేరాయి. ఇక్కడ రూపనామములు చేరలేదు. రూప నామములు లేని ఈరాతి ముక్కలు ఏమి చెపుతున్నాయి? "తత్ త్వం ఆసి అంటున్నాయి. "అది మేమే. పూర్వము మేమంతాఒక్కటిగానే ఉన్నాము. కాని, దానికొక రూపము ఏర్పడటం చేత మేము వేరైపోయాము. కాని,అన్నింటియందున్న దివ్యత్వము ఒక్కటే" అని తెలుపుతున్నాయి.
అదేవిధంగా, "తత్" అనే శుద్ధసాత్వికమైన తత్త్వము నుండి ఆవిర్భవించినదే ఈ శరీర అంత:కరణములు, ఐతే ఆశుద్ధసత్వమును మాత్రము ప్రత్యేకంగా ఉంచి మిగిలినవాటిని పనికిమాలినవిగా ప్రవేశ పెట్టారు. ఇవి ప్రాకృతమైన జీవితానికి చాలా అవసరమైనవే. ఏ సాధనలనైనా ఈ శరీరమునాధారముగా చేసుకొనియే చెయ్యాలి. దేనినైనా మనస్సును ఆధారముగా చేసుకొనియే చింతించాలి. బుద్ధినాధారముగా చేసుకొనియే విచారించాలి. కనుక, ప్రాకృతమైన ఈ జగత్తునందు శరీరము మనస్సు బుద్ధి ప్రభావమైన పనిముట్లుగా తయారైనవి. అయితే, ఇవి పనిముట్లు మాత్రమే. వీటి ద్వారా పని చేయించేది వేరే ఒకటి ఉన్నది. అదే తత్. ఈ తత్’ అనేది మనశరీరమునందు, అంతఃకరణ యందు ప్రవేశించి అన్నింటి ద్వారా వాటి వాటి కర్తవ్య కర్మలను ఆచరింప చేస్తున్నది. ఈ రెండింటికి ఏ మాత్రం భేధము లేదు.
ఇంకొక చిన్న ఉదాహరణ: అగాధమైన సముద్రములో అసంఖ్యాకములైన అలలు ఆవిర్భవిస్తుంటాయి. అనేక తరంగాలు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తుంటాయి. ఒక తరంగము ఉన్నట్లుగా వేరొక తరంగము ఉండదు. ఐతే, ఈ తరంగములు వేరు కాదు. వాటియందున్నది కూడా సముద్రము యొక్క జలమే కాని, ఆకారములు వేరు వేరుగా వస్తున్నాయి. ఈ తరంగముల యందే నురుగు, సముద్రాన్ని విడిచి తరంగాలు ఉండలేవు. తరంగాల యందు, నురుగు నందు సముద్రమే ఉంటున్నది. మూడింటి యొక్క ఏకత్వాన్నే “కూటస్థుడు" అని వేదాంతములో చెపుతారు. కూటస్తుడనగా నురుగు నందు, అలల యందు, సముద్రము నందు ఉన్న Quality అదే తత్.
ఇంక నాలుగవది "అయమాత్మ బ్రహ్మ". అయమనగా స్వప్రకాశమైనది, స్వస్వరూపమైనది. అనగా, పరోక్షమైనతత్వము. సర్వజీవుల యందు చైతన్యరూపముతో కూడినదే ఆత్మ. అన్ని దేహములందు, అన్ని రూపముల యందు అంతర్భావమై ఉన్న ఆత్మ "సత్యం" అని చెప్పబడుతోంది. దీని అంతరార్థమేమిటి? ఆత్మ నిత్యమైనది కనుకనే దానికి సత్యం అని పేరు వచ్చింది. అంతేకాకుండా, సద్భావమునకు ఆదర్శమైనది కనుకనే తైత్తిరియోపనిషత్తు నందు దీనికి సత్ అని పేరు పెట్టారు. కనుక "ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మ బ్రహ్మ" ఈ నాలుగు మహా వాక్యములందూ ఉన్నది ఒక్కటే. అదే "నేను" అనే ప్రజ్ఞ.
(స. సా.పి.93 పు.37/39)
(చూ|| భగవచ్చింతన)