మన్సూర్

ఉత్తర దేశంలో మన్సూర్ అనే మహమ్మదీయ విద్యార్థి ఉండేవాడు. అతడు నిరంతరము దైవచింతనలో మునిగి ఉండేవాడు. వారిది చాల బీద కుంటుంబము. ఎంత బీదకుటుంబమైనప్పటికీ పిల్లవానిని చదివించాలనే ఆశ తల్లిదండ్రులకు సహజము కదా! కనుక, మన్సూర్ను స్కూల్లో చేర్పించాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు. కాని, చదువు దేనికోసమని మన్సూర్ ప్రశ్నించాడు. "నాయనా! చదువుకుంటేనే కదా తిండికి, గుడ్డకు కొదువ లేకుండా జీవిస్తావు" అన్నది తల్లి "అమ్మా! నన్ను క్షమించు. కుక్కలు, కోతులు, పక్షులు కూడా పొట్ట నింపుకుంటున్నాయి. అవి చదువులు చదివాయి? పొట్ట నింపుకోవడం కోసం చదువు చదవాలా? అట్టి చదువు నాకక్కర లేదు. దాని కోసమని నాశక్తిని, నా దివ్యత్వాన్ని వృధా చేసుకోలేదు" అన్నాడు. పిల్లవాని హృదయం పరిశుద్ధమైన అద్దము వంటిది. పరిశుద్ధమైన అద్దములోనే మన ప్రతిబింబము చక్కగా కనిపిస్తుంది. వట్టి అద్దములో అవతల ఉన్న రూపము మాత్రమే కనిపిస్తుంది కాని, ప్రతిబింబము కనిపించదు. అద్దమునకు అటువైపున మెర్క్యూరీ రసాయనమును పూసినప్పుడే ప్రతిబింబమును చూసుకోవచ్చు. అదేవిధంగా మన్సూర్ తన హృదయమనే అద్దమునకు ప్రేమ అనేరసాయనమును చేర్చాడు. "ఇంక లోకంలో నాకు అవసరం లేదు. నన్ను నేను చూసుకుంటున్నాను. నా తత్వాన్ని నేను గుర్తించడమే నా జీవిత లక్ష్యము" అని మనస్సులో దృఢం చేసుకున్నాడు.

 

అతడు ఇంటి నుండి బయలుదేరాడు. ఎక్కడికో వెళ్ళుతున్నాడు. అతని హృదయం పరిశుద్ధంగా, పరిపూర్ణంగా ఉండటంచేత అతని ముఖం బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నది. అతడు ఎవ్వరినీ ఏమీ అడగటం లేదు. అతని తేజస్సే అన్నింటిని అతనికి అందించింది. ఎవరో ఒక తల్లి, "నాయనా! భోజనం పెడతాను రా" అని పిలిచేది. ఎవరు పెట్టిస్తున్నారు. భోజనం? అతని పరిశుద్ధమైన హృదయమే పెట్టిస్తున్నది; పవిత్రమైన ప్రేమయే పెట్టిస్తున్నది. అతడు ఎక్కడికి పోయినా, అనల్ హక్, అనల్ హక్ (నేనే దైవము, నేనేదైవము) అంటున్నాడు. మాటలు హాస్యాస్పదంగా కనిపించాయి. పెద్దలందరూ అతనిని నిందించారు. "పిల్లవాడా! నేనే దైవమంటున్నావు. నీవెట్లా దేవుడవౌతావు ? అని ప్రశ్నిస్తూ వచ్చారు. మూర్ఖులు కలియుగంలో అధికమైపోతున్నారు. "నేనే దైవమనే విశ్వాసం నాకు ఉంది. మీకు లేకపోతే పోండి. నా విశ్వాసాన్ని మీరెందుకు పాడు చేస్తారు?" అన్నాడు మన్సూర్.

 

"అనేక వేదశాస్త్రాలను చదివాము. ఆయినా మేమే దైవమని చెప్పలేక పోతున్నామే!" అని పండితులకు కోపం వచ్చింది. మన్సూరకు నేనే దైవమని చెప్పే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?దీనికి హృదయ విశ్వాసమే ప్రధానం కాని, పాండిత్యం కాదు. ఎవరెన్ని చెప్పినా అతని విశ్వాసం చలించలేదు. పండితులందరూ రాజు వద్దకు వెళ్ళారు. "రాజా పిల్లవాడు మా పాండిత్యమునకు చాల అవమానం చేస్తున్నాడు. మేము ఎన్ని విద్యలు నేర్చినా మేమే దైవమని చెప్పుకోలేక పోతున్నాము. కాని, అక్షర జ్ఞానమూ లేని మూర్ఖుడు నేనే దైవమంటున్నాడు. ఇది ఎట్లా చెప్పగలడు? అతడు పిచ్చివాడైనా కావాలి. లేక అహంకారియైనా కావాలి" అన్నారు. అతనిని ఎట్లాగైనాఅణగదొక్కాలని పండితులు ప్రయత్నం చేశారు.

 

"ఊరక సజ్జనుండు ఒదిగి ఉండిననైన దురాత్మకుండుని

ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా

చీరల నూరు టంకములు చేసెడివైనను పెట్టె నుండగా

చేరి చినింగిపో గొఱుకు చిమ్మటకేమి ఫలంబు........ ?

 

పెట్టెలో నీవు నూరు రూపాయల బెనారస్ చీర పెట్టుకో, లేక బాత్రూమ్ తుడిచే గుడ్డ పెట్టుకో, దానిని కొరికి వేయడం చిమ్మట స్వభావం. దాని విలువ ఎంత, అంత అని విచారణ చేయదు. అదే విధంగా, ఎట్టివారినైనా విమర్శించడానికి పూనుకునే వారందరూ చిమ్మట జాతికి సంబంధించినవారు.

 

రాజు మన్సూర్ ను దగ్గరకు పిల్చి మంచి మాటలతో చెప్పడానికి ప్రయత్నించాడు. "నాయవా! నీవు సామాన్య బాలుడవు,అక్షర జ్ఞానం లేని అవివేకివి. కనుక, ఇంత అహంకారంగా నేనే దైవమని నీవు చెప్పకూడదు" అన్నాడు. "నేనే సత్యమే పలుకుతున్నాను. నేను దైవమే, నీవు దైవమే అందరూ దైవమే. జపమాలతో దారమువలె భగవంతుడు అందరియందు వ్యాపించియున్నాడు" అని వాదిస్తూ వచ్చాడు మన్సూర్. మంచి మాటలు రాజు తలలో మాత్రము చేరలేదు. పైగా తన మాటలను ధిక్కరిస్తున్నాడని మన్సూర్ పై అతనికి కోపం వచ్చింది. వెంటనే ఒక డాక్టర్ను పిలిచి, "ఏయ్ డాక్టర్! ఇతని కన్నులు పీకివేయ్! ఎక్కడికీ పోకుండా ఒక చోట పడి ఉంటాడు" అని ఆదేశించాడు. డాక్టర్ వచ్చి మన్సూర్ కన్నులు పీకివేసాడు. అప్పుడు కూడా మన్సూర్ నవ్వుతూ, నవ్వుతూ, అనల్ హక్  అనల్ హక్ అంటూ వచ్చాడు. ఎందుకంటే అతనికి దేహాభిమానం పోయింది తరువాత రాజు కిరాతకులను పిలిపించి అతని రెండు చేతులూ నరికివేయించాడు. అప్పుడు కూడా మన్సూర్ ముఖంలో మాత్రము విచారము లేదు. నవ్వుతూ, నవ్వుతూ, అనల్ హక్  అనల్ హక్ అంటున్నాడు. అంత దృఢమైన విశ్వాసం పిల్లవానికి కట్టకడపటికి అతని కాళ్ళు కూడా కొట్టించాడు. దాంతో దేహధర్మాన్ని అనుసరించి అతని ప్రాణంపోయింది, రక్తము కాలువలై ప్రవహించసాగింది. అది కూడా "నేనే దైవం, నేనే దైవం" అని గాలికి ఎగురుతూ ఉండినది. ఇది మూడువందల సంవత్సరములకు పూర్వం ఉత్తర దేశంలో జరిగినది. అక్కడి ప్రజలందరూ చాల ఆశ్చర్యపడ్డారు. కాని, అన్ని జరిగిపోయిన తరువాత పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం వలన ప్రయోజన మేమిటి? సత్యాన్ని గుర్తించి వర్తించాలి. ఎవ్వరు మాట చెప్పినప్పటికీ సత్యాన్ని విచారించకుండా ఊరికే వినకూడదు.

(.పా.మే.96 పు. 124/125)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage