భీష్మ ద్రోణాదులు మరణింతురనియా? నీ యేడ్పు కేవలము భీష్మద్రోణాదులు మరణింతురని కాదు. వారలు నావారే అను మమకారమే నిన్ను యేడ్పించుచున్నది. లోకములో యేడ్చువారందరూ ఇదే విధముగా మరణములకు యేడ్చుట లేదు. మరణించువారు నావారలను మమకారముతో యేడ్చుచుందురు. బావా! నీవారు కానివారం నెందరిని నీవు దీనికి పూర్వము చంపలేదు. ఆనాడు ఈ యేడుపు యెక్కడకు పోయినది?
ఈ కనుపించువారలు నా వారలను మమకారమే నిన్నింత దుఃఖమునకు కూలద్రోసినది. ఆ మమకారమునకు అహంకారము కారణము. నిద్రలో అహంకారము లేదు. అందుకే పరుండిన తన దేహము తనవారల దేహములు, కూడబెట్టిన ధన, కనక, వస్తువాహనములు యేమై పోవుచున్నవో యేమియు తెలియకుండును. "అహం" ప్రథమా విభక్తి”, మొదట వుండే "మమ" షష్ఠీ విభక్తి తరువాత వస్తుంది. ఇది సహజమే కదా? పిచ్చివాడా తాము కాని దేహాన్ని తానుగా అనుకొనుటే అజ్ఞానము. అనాత్మనాత్మగా తలంచటము విపరీత జ్ఞానము. అది జ్ఞానము కానేరదు. దేహాత్మబుద్థే జ్ఞానము. కాని అర్జునా, నీ అజ్ఞానము మరేమి చేసినా తీరదు. దీనికి జ్ఞానమే దివ్యాషధము" అని ప్రథమములోనే ఆత్మజ్ఞానబోధ కుపక్రమించెను. అదియే రెండవ అధ్యాయమునపదకొండవ శ్లోకము. ఈ శ్లోకము గీతాపారాయణములో బీజశ్లోకముగా భావించవలెను.
శ్లో|| అశోచ్యాన న్యశోచ స్త్యం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః!
ఇందులో అర్జునునిలో నున్న రెండు అక్షేపణలను ఖండిచు చున్నాడు కృష్ణుడు. మొదటిది దేహములకు సంభవించు నాశము ఆత్మకేననియు, శోకింపదగని వారికి శోకించుట, ఇది "ప్రజ్ఞావాదాంశ్చభాషసే" స్వధర్మాన్ని అధర్మమని పండిత వాదాన్ని చెండి వేస్తున్నానని అన్నాడు. ఇక్కడ పాఠకులు గమనించవలసిన విషయమున్నది. యేమన అర్జునునకు రెండు విధములైన మోహములు ఆవేశించినవి. ఒకటి సామాన్య మోహము. రెండవది అసాధారణ మోహము. దేహమే ఆత్మ అనుకొని దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించుట సాధారణ మోహము. స్వధర్మమైన యుద్ధము అధర్మమని తలంచుట. ఇది అసాధారణమైన మోహము. ఇదే అర్జునుని యందు ప్రత్యేకించిన మోహము. అందువలననే కృష్ణ పరమాత్మ మొదటిదైన సాధారణ మోహమును నిరసిస్తూ, రెండవదైన అసాధారణ మోహమును నివారిస్తున్నాడు. సాధారణ మెహమును రెండవ అధ్యాయములో పండ్రెండవ శ్లోకము నుండి ముప్పదవ శ్లోకము వరకూ ఆత్మబోధన చేసి, రెండవదయిన అసాధరణ మోహమునకు ప్రత్యుత్తరంగా విశేషమోహాన్ని నివారిస్తు స్వధర్మ ప్రతిపాదికమైన యెనిమిది "శ్లోకాలు చెప్పెను. వాటినే ధర్మాష్టకమని అందురు. ఆ - స్వధర్మము యేరీతిగ చేస్తే అది జన్మహేతువుకాకమోక్ష హేతువు కాగలదో అట్టి నిష్కామకర్మ యోగాన్ని అనంతరం బోధించెను. ఈ రెండవ అధ్యాయములో చివరలో సాకారమూర్తి అయిన స్థిత ప్రజ్ఞుని వర్ణన జరిగింది గమనించుడు.
(గీ.పు.22/24)
దుఃఖము భగవంతుడు అందించేది కాదు. అది మీ అభిమాన మమకారములచేత కలిగేది. పోస్ట్మేన్ ఒక యింట్లో ఒక ఉత్తరం యిస్తాడు. మరొక యింట్లో మరొకఉత్తరం ఇస్తాడు. మొదటి ఇంట్లోని వారు ఘెల్లున ఏడుస్తారు. రెండవ యింటిలోనివారు ఆనందాన్ని పొందుతారు. వారి దు:ఖానికిగాని, వీరి ఆనందానికి గాని పోస్ట్మేన్ కారణమా? కాదు, కాదు; వారికి వచ్చిన ఉత్తరాలే కారణం. మొదటి ఇంటివారికి కుమారుడు మరణించాడని ఉత్తరం వచ్చింది. రెండవ ఇంటివారికి కుమారుడు పుట్టాడని జాబు వచ్చింది. ఈ లోకంలో పుట్టేవారు, చచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కాని, పుట్టిన వారందరి కోసం మీరు నవ్వుతున్నారా? పోనీ, చచ్చినవారందరికోసం ఏడుస్తున్నారా? లేదే! కనుక, చావు కాదు దుఃఖమును అందించేది, వచ్చిన దేహంపై గల మమకారమే దుఃఖమును అందిస్తున్నది. మమకారంచేతనే మానవుడు ఏడుస్తున్నాడు. అదే విధంగా పుట్టుక ఆనందమును అందించడం లేదు. పుట్టిన దేహంతో గల దేహసంబంధం చేతనే మానవునికి సంతోషం కల్గుతున్నది. కనుక, సమస్త సుఖదుఃఖములకు అభిమాన మమకారములే మూలకారణం. ఈ అభిమాన మమకారములు రెండూ నీవు పెంచుకున్నవే. పెళ్ళికి పూర్వం నీకు రెండు కాళ్ళున్నాయి. అప్పుడు నీవు చాల స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నావు బాధ్యతలు లేవు. ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతావు. వస్తావు. కానీ, పెళ్ళి అయిన తరువాత నీకు ఇంకో రెండు కాళ్ళు చేరినాయి. నాలుగు కాళ్ళు అయ్యేటప్పటికి కొంచెం బంధన ఏర్పడిపోయింది. ఎక్కడికి పోవాలన్నా యింటి దగ్గర భార్యకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసిపోవాలి. క్రమక్రమేణ చింతలు పెరుగుతూ వస్తాయి. తరువాత కుమారుడు పుట్టాడు. అప్పుడు ఆరుకాళ్ళు అయినాయి, నడవడం మిరంత నిదానమైపోయింది. నాలుగు కాళ్ళున్నప్పుడు జంతువుగా మారిపోయావు? నీకు అనేక బాధ్యతలు ఏర్పడుతూ వచ్చాయి. ఆరు కాళ్ళు ఏర్పడేటప్పటికి Scorpian (తేలు) గా తయారైనావు. ఎనిమిది కాళ్ళు వచ్చేటప్పటికి Crockroach (బొద్దింక)గా మారి పోయావు. ఈ విధంగా కాళ్ళు పెంచుకుంటూ అల్ప జీవితానికి పోతున్నావే గాని, అధిక జీవితానికి పోవటం లేదు.కోరికలను ఎంత తగ్గించుకుంటే జీవిత ప్రయాణం అంత సులువుగా సాగుతుంది. కనుక, కోరికలను ఒక పరిమితిలో పెట్టుకోవాలి. పరిమితి లేకుండా పెంచుకుంటే ప్రమాదమైపోతుంది.
(స.సా.3.99పు.273/274)