మనుష్యత్వము

మనుష్యత్వమనేది దైవత్వముతో సమానమైనది. కనుకనే "దైవం మానుషరూపేణ" Men are more valuable than all the wealth of the world.మనకుండిన ధనకనక వస్తు వాహనాదు లన్నియు మానవునికంటె మించినవి కాదు. అటువంటి నిత్యసత్యమైన ఆత్మతత్వమును ఒక్క క్షణము చింతించి దర్శిస్తే సర్వము మనము సాధించినవార మవుతాము. కాని మానవుడు దాని నిమిత్తమై తగిన కృషి చేయటం లేదు. భౌతికమైన సుఖసంతోషభోగభాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా శ్రమలు పడుతున్నాడు. ఆశ్రమలలో వెయ్యింట ఒక భాగమో, కోటింట ఒకభాగమో భగవంతుని చింతిస్తే దివ్యత్వమును ఎంత ఆనందముగా అనుభవించవచ్చు!

 

యా చింతా భువి పుత్రమిత్రభరణవ్యాపార సంభాషణే

యా చింతా ధనధాన్యభోగయశసే లాభే సదా జాయతే

సా చింతా భువి నందనందనపదద్వంద్వారవిందేక్షణే

కా చింతా యమరాజభీమసదనద్వారప్రయాణే ప్రభో.

 

ధనధాన్యభోగయశస్సుల నిమిత్తమై మనము ఎంత కాలమును వినియోగిస్తున్నామో పుత్ర మిత్రభరణ వ్యాపారములకై ఎంతకాలమును దుర్వినియోగపరచు కుంటున్నామో కాలములో క్షణకాలము భగవంతుని పాదారవిందములపై పెట్టటానికి మనము కృషి చేస్తేభీమసదనద్వార ప్రయాణే ప్రభోభీమసదనం- భయంకరమైన యమరాజ భవనం ద్వారాలు దాటి పోతాము. మనము ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలెనంటే దీనికి ఒక్కటే ఆధారము. అదే భక్తి,. స్వస్వరూపానుసంధానమే నిజమైన భక్తి. ఇదే నిజమైన ఆత్మ నిష్ఠ జ్ఞానమన్నా భక్తి అన్నా వేరుకాదు. భక్తేజ్ఞానము జ్ఞానమే భక్తి. రెండు అన్యోన్యాశ్రయములు. రెండిటిని కట్టివేసే ప్రధానమైన సూత్రము ప్రేమ. ప్రేమసూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చును. ప్రేమ ప్రత్యేకము కాదు. ప్రేమనేదైవము, దైవమే ప్రేమ దేహములో ఏర్పడే ప్రేమ, వాంఛలతో ఏర్పడిన ప్రేమ, క్షణభంగురమైనది. దైవ ప్రేమ శాశ్వతమైనది. ఎన్నియో బాధలు చిక్కులు సంభవించ వచ్చును. ఇవన్నీ కదలిపోయే మేఘములే. వీని నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు. సత్యనిత్యమైన ఆత్మతత్త్వాన్ని పొందే నిమిత్తమై మనము తగిన విచారణ చెయ్యాలి. తమను తాము వుద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానామ్ అన్నారు.

(బృ.త్ర. పు. 138/139)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage