భగవంతుని ప్రేమను సంపాదించుకొనుటకు మొట్టమొదట దేవా!నేను నీవాడను" అనుట నీవు యలవాటు చేసికొనవలెను. ఈ మొదటిమెట్టు పైకి కనబడునం త తేలికైనది కాదు. ఆ మెట్టుకెక్కుటకు ముందు, నీవొక మహాసముద్రములోని చిన్న అలనన్న సంగతి చక్కగా తెలసికొనవలెను. అది తెలిసికొనుటకు చాలాకాలము పట్టును. ఎట్లో తెలిసికొన్నను. దేవుని మ్రోల నమ్రతతో తలవంచి నిలబడి, "నేను నీవాడను, నీవునాకు ప్రభువు నేను నీకు దాసుడను" అనుభావమును స్థిరపరచు కొందువేని అది నీ అహమునణచివేయును. అప్పుడు నీవు చేయు ప్రతి పనియు అమోఘమును అర్థవంతమును అగును. ఇది శాస్త్ర సమ్మతమైన ప్రపత్తి మార్గము.ఈ విధమైన ప్రపత్తికి మార్జాలకిశోరయ మని పేరు. పిల్లికూనకును దాని తల్లికిని గల సంబంధము వంటి సంబంధమని యర్థము. పిల్లిపిల్ల అహము లవలేశమైనను పెట్టుకొనక సహాయము కొరకును, జీవనము కొరకును - దీనముగా తల్లినే యర్ధించుచుండును.
రెండవ మెట్టు: “నీవు నావాడవు" అని విశ్వసించి, వర్తించు. ప్రతివ్యక్తి యొక్క యోగక్షేమములను విచారింపవలసిన బాధ్యత భగవంతునిదే. అయినను తన కృపకు పాత్రుడును, తనకు ముఖ్యుడునూ అయిన భక్తునియక్కరను తీర్చుట భగవంతుని ప్రథమకర్తవ్యము. ఆయన అందుకు బద్దుడైయున్నాడు. సూరదాసు "నీవు నావాడవు, నేనునిన్ను విడవను, నిన్ను నా హృదయమున బందీ చేసితివి, ఇక తప్పించుకొని పోజాల" వన్నాడు.
మూడవమెట్టు: "నీవే నేను". " నీవు ప్రధానబింబమువు. నేను ప్రతిబింమును. నాకు ప్రత్యేక వ్యక్తిత్వము లేదు." అని తెలుపుకొనుట. బింబ ప్రతిబింబములలో ద్వంద్వత్వము లేదు. ఆరెండును. ఒక్కటే, రెండు అనుకొనుట భ్రాంతి.
నీవు నీయిష్ట దేవతకు నివేదన చేయవలసినది - అల్పవ్యయముతో అంగడిలో కొని తెచ్చు వస్తువులతో తయారుచేసిన పనికిమాలిన పదార్థములు కాదు. అహింసయను గోధుమరవ్వ - సమర్పణ మను మినపపిండి -ప్రాయశ్చిత్త మను పప్పు - పశ్చాత్తాపమను బెల్లముచేర్చి - సౌశీల్యమము నేతితో పాకము చేసిన కజ్ఞాయము - అదే దేవునికి ప్రియమైన వివేదనము.
(త.శ.మ.పు.249)