ధర్మము కొరకు గీత కానీ ధనము కొరకు కాదు. కృష్ణమందిరాలనియూ, రామ మందిరాలనియూ ఏవో కొన్ని కొన్ని పేర్లు పెట్టుకొని మందిర నిర్మాణమును పేరుతో, ఆశ్రమముల నిర్మాణమను పేరుతో గీతా ప్రచార నిర్వహణ పేరుతో, ధనమును ప్రోగుచేయుట కూడా భగవత్ విశ్వాసము కోల్పోవుటకు ఒక మార్గము. సర్వ వ్యాపియైన పరమాత్మకు కేవలము మందిర నిర్మాణము హస్యాస్పదము. భగవత్ ప్రతిష్ఠకు హృదయ మందిరము ప్రధాన స్థానము.
అట్టి మందిరమును నిర్మించుటకు ప్రయత్నించక, మానవ కల్పిత మందిరములు మాత్రము నిర్మించిన, స్థిరమా! నిత్యసత్యమైన పరమాత్మకు శాశ్వత మందిరమే సార్థకము కానీ శిధిలమగు మందిరములు కావు.
అయితే ఒక స్థితికి వచ్చు వంతవరకూ బాహ్యనిర్మాణ మందిరములు అవసరమే కానీ, అనాదిగా మందిరములు అనేకములున్నవి కదా! వాటిని భద్రపరచుకొని, సద్వినియోగము చేసుకొన్న చాలదా? సనాతన మందిరములు కొట్టడమూ, నూతనమందిరములు కట్టడమూ గోవును చంపి చెప్పులు దానము చేసినట్లున్నది! ప్రత్యేకించి నూతన మందిరములు కట్టక, శిధిలమైన సనాతన మందిరములను పునరుద్ధరణ చేయుట యెంతయో లోక క్షేమము. ఆనాటి శాస్త్రోక్తమైన ధర్మ ప్రతిష్ఠలు మహా పవిత్రములు అట్టి ధర్మమందిరముల శక్తియే మన భారతదేశము నేడు ఈ మాత్రమైననూ క్షేమముగా ఉండుటకు మూలకారణము.
(గీ.పు.172/173)