మాఘమాసం ప్రారంభమైంది. నేను పిల్లలతో "మాఘ స్నానం చాల పవిత్రమైనది. అయితే, కేవలం స్నానం చేసినంత మాత్రాన చాలదు. దైవప్రదక్షిణ కూడా మీరు చేయాలి" అని చెప్పాను. తెల్లవారు ఝామున నాల్గు గంటలకే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారము. చిన్న చిన్న పిల్లలు లేపినా లేవలేకపోయేవారు పాపం! ఒక్కొక్క పిల్లవానిని నేనే ఎత్తుకొనిపోయి స్నానం చేయించేవాడిని. అందరం కలసి గుడికి వెళ్ళాము. "ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణలు చేసుకొని రండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను" అని చెప్పాను. వారు ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారు. కాని, వారిలో వారు "మనం మాత్రమే ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? రాజు కూడా మనతో ఎందుకు రాకూడదు? రాజు మనకు ఎన్నో పనులు నేర్పించాడు. అతను లేకుండా మనం ఏ పనిచేయలేము. కాబట్టి. అతను ముందు నడవాలి, మనం వెనుక నడవాలి అనుకున్నారు. వెంటనే అందరూ పరిగెత్తికొని నా దగ్గరకు వచ్చారు. "రాజూ! నీవు కూడా మాతో రావాలి" అన్నారు. నాకు అక్కర్లేదు. మీరే చేయండి" అన్నాను. "ఆయితే, మాకూ అక్కర్లేదు నీవు మాతో వచ్చే తిరాలి" అని బలవంతం చేశారు. వారి బలవంతం మీద నేను కూడా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి ఉపక్రమించాను. మీరు నమ్మవచ్చు. నమ్మకపోవచ్చుగాని, హనుమంతుడు అడ్డం వచ్చాడు. ఈ పిల్లలందరూ కోతి వచ్చిందనుకున్నారు. వారికి తెలియదు, హనుమంతుడే వచ్చాడు. "స్వామీ! నేను మీకు ప్రదక్షిణ చేయవలసినవాడిని. మీరు నాకు ప్రదక్షిణ చేయకూడదు" అన్నాడు. సరే, నేను పిల్లలకు చెప్పాను - మీరు వింటున్నారు కదా! నేను ప్రదక్షిణలు చేయడం హనుమంతునికి ఇష్టం లేదు. కాబట్టి, నేను మానేస్తాను" అన్నాను. ఆనాటి నుండి పిల్లలలో చాల పరివర్తన కల్గింది. వారిలో దివ్యమైన భావాలు కలిగాయి. వాళ్ళు ఇళ్ళకు తిరిగి వెళ్ళేటప్పుడు “రాజు మాతో కలిసి హనుమంతుని గుడికి ప్రదక్షిణ చేస్తుంటే ఒక పెద్ద కోతి అతనికి అడ్డుగా వచ్చి మీ ప్రదక్షిణ నేను చేయాలిగాని, నా ప్రదక్షిణ మీరు చేయకూడదు అని రాజును ప్రదక్షిణ చేయనివ్వలేదు" అని బజారులో అందరికీ చెప్పారు. ఈ వార్త సుబ్బమ్మ దగ్గరకు కూడా ప్రాకిపోయింది..
(స.పా.మా 2000 పు.85)
కాళ్ళరిగి పోయేలా భగవంతుని ప్రతిమ చుట్టుగాని లేక, మందిరం చుట్టూగాని తిరగటం ఎందుకు? అర్థం చేసుకుని చేయాలి. ప్రతి పనినీ. మన ప్రాచీనులు అర్థం లేని క్రియలు చేయలేదు. చేయమన లేదు. చక్రానికి ఇరుసు మధ్యలో ఉంటుంది. చక్రం ఎంతదూరం ప్రయాణించినా ఇరుసునే ఆధారం చేసుకొని ఉంటుంది. అదేవిధంగా, భగవంతుణ్ణి ఆధారంగా చేసుకొని మన పనులను నెరవేర్చుకోవాలని మనల్ని మనం గుర్తు చేసుకోవడానికే మందిరం చుట్టూ గాని లేక, విగ్రహం చుట్టూగాని ప్రదక్షిణ చేయమంటారు.
(స. సా.జూన్.96 పు. 153)