పురాణం పంచ లక్షణమ్ అందురు. అనగా అందు చారిత్రక సంబంధములైనవి. సృష్టి క్రమ సంబంధములైనవి. తాత్విక సిద్ధాంతములను విశదీకరించు సాంకేతికోదాహరణ రూపమైనవి యెన్నెన్నియో విషయము లుండును. వేదవిషయమును సామాన్య మానవులకు అర్థమగు రూపమున ప్రదర్శించుటకై ఇవి రచించబడెను. వేదభాష అత్యంత ప్రాచీన రూపమైనది. మహా మహా విద్వాంసులలో కూడా ఏ కొలదిమందియో మాత్రము వీని రచనా కాలమును కనుగొనగలరు. పురాణములు ఆ కాలపు జన సామాన్యము వాడుచుండిన భాషలో వ్రాయబడినవి. మనమిప్పుడు ఆధునిక సంస్కృతమను పేర వ్యవహరించు భాషయే అది. అప్పటి విద్యాంసులకే కాక ఆ భాష సామాన్య ప్రజలకై ఉద్దేశింపబడినది. కనుక ఆ భావమునకు ఆ భాషలోనే రూపకల్పన మొనర్చిరి. మహాపురుషుల యొక్కయు, రాజన్యుల యొక్కయు, సుప్రసిద్ధ పురుషుల యొక్కయు, జీవితరూపమునకు, జాతి జీవితములో కలిగిన చారిత్రాత్మక సంఘటనల రూపమునను ఇట్టి యితర స్థూల రూపమునను అందు ప్రదర్శింపబడెను, హిందూమత సనాతన ధర్మముల ఉదాహరణ రూపముగా వర్తించుటకై మహాఋషులు ఈ విధముగ పురాణములు నిర్మించిరి.
(స.వా.పు.69)
వేదములోని సంక్షిప్తవచనములకు వ్యాఖ్యానము చేయబడిన వాటిని పురాణము అని అందురు. పురాణములు అసంఖ్యాకములు కానీ, ఈ సమయమున పదునెనిమిది పురాణములు, పదునెనిమిది ఉప పురాణములు, పదెనెనిమిది ఉపాప పురాణములు మాత్రము ప్రసిద్ధము లగుచున్నవి. వీటన్నింటినీ వ్యాసుల వారే సంగ్రహించిరి.
"ఈ పురాణములకు దశ లక్షణము లుండును. ఉప పురాణములకు పంచ లక్షణము లుండును, ఆ దశ లక్షణము లేవని తిరిగి నీవు ప్రశ్నించ వచ్చును. దీనికి పూర్వమే నేనేతెలుపుదును, వినుము. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను చరితము, విరోధము, ముక్తి, ఆశ్రమము అని, ఈ పది యందూ ఆశ్రమము ప్రధానము.
ఈ పది లక్షణములు సంక్షిప్తముగా తెలుపలెనన్న, పాలు పితుకుట మొదలుకొని, వెన్నముద్ద చేయువరకు చేయవలసిన పనులన్నియు అవసరమే. ఆయా పనుల స్థితికి తగిన గతికే ఆనామములు కానీ, అన్నింటిలో ప్రధానము వెన్నముద్దయే! దాని కొరకే ఈ పై విధముల లక్షణములు చేయవలసివచ్చును. అటులనే ఆశ్రమ తత్త్వసిద్ధి కొరకే సర్వ విసర్గాది వర్ణనము. దీనినే శృతిచే ఒక్కొక్కచోట ఒక్కొక్క వాక్యము చేతను, తాత్పర్యము చేతను, సాక్షాద్రూపము వర్ణింపబడినది. పురాణములో నుండవలసిన దశ లక్షణములను తెలిపి సన్నానంద పరుచు, మని ప్రార్ధింప, శుకుడు తిరిగి వివరించుటకు ఉద్యుక్తుడై, సత్వ, రజస్తమోగుణములు సమానముగ నున్న దానిని ప్రకృతి యందురు, మూల ప్రకృతి వలన, పృధివి, జలము, తేజస్సు, వాయు, ఆకాశము పంచ భూతములును శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులును పంచ తన్మాత్రలును వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలను పంచ కర్మేంద్రియములును, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కులను పంచ జ్ఞానంద్రియములున్నూ మనస్సును మహదహంకారములు రెండును మూడు తత్త్వము ఎప్పుడుద్భవించునో, అప్పుడు దానిని సర్గమని అందురు.
ఒక రెండవ దయిన విసర్గమవగా విశేష రూపమగు సర్గమునకే విసర్గమని అందురు. చిత్ర విచిత్ర కర్మలొనర్చు అసంఖ్యాకజీవుల నుత్పత్తి చేయుటే విసర్గమని అందురు. ఇది విరాట్పురుష సంబంధము.
స్థానమనగా, లోకమున యే వస్తువు పుట్టినను వాటికి కొన్ని హద్దులు ఏర్పరచుకున్న, ఆ వస్తువులు వృధా అయిపోవును. అందుకై ఉత్పన్నమయిన వస్తువులకు హద్దులు ఏర్పరచి ఆ వస్తువులు ఆయాహద్దులు మీరకుండునట్లు చేయుటకే స్థానమని అందురు.
ఉదాహరణమున కొకటి తీసుకొందుము. ఒక యంత్రము కలదు. దానికి తాళము త్రిప్పిన నడువగలదు. కాని దానిని హద్దులో నడిపిననే అది అదుపులో నడువ గలదు. లేకున్న యిష్టమొచ్చినట్లు పోయి ప్రమాదమునకు గురి యగును. ఇట్టి ఆదుపునే స్థానమని అందురు.
పోషణ మనగా సులభముగా తెలుపవలెనన్న దైవానుగ్రహమునే పోషణ మనవచ్చును. సృష్టి కార్యము లన్నియు పోషణ చేతనే జరుగు చున్నవి. చెట్టును నాటి దానికి తగిన పోషణ జరుపకున్న అది వృద్ధి కాదుకదా? తదుపరి మన్వంతర మునగా, యెనిమిది జాముల గల రాత్రింబగలునకు దినమని పేరు. ముప్పది దినము లోకమాసము, పండ్రెండు నెలలు ఒక సంవత్సరము, ఈ లోక సంవత్సరము దేవరకొక దినము. ఇట్టి దినములు మూడు వందల అరువది దినములైన దేవతల కొక సంవత్సరము. ఇట్టివి వేయి దివ్య సంవత్సరములు కలియుగము. రెండు వేలయిన, ద్వాపర యుగము, మూడువేలయిన త్రేతాయుగము నాలుగు వేలయిన, కృత యుగము. ఈ యుగములకు రెండువందలు సంధి, సంధ్యాంశలుగ నుండును. ఇట్టి పండ్రెండు వేల దివ్య వర్షములు ఒక మహాయుగ మనబడును. అట్టి మహాయుగములు వేయి గడచిన బ్రహ్మ కొక దినము, బ్రహ్మదినములో పదునలుగురు మనువులు మారుదురు. ఒక్కొక్క మనువు డెబ్బది మహా యుగముల కంటే ఆధికముగానే యుండును. ఇట్టి దానినే మన్వంతరమని అందురు.
ఊతి అనగా, కర్మవాసననే ఊతి అని అందురు. అనగా పూర్వ కర్మ వాసనల ననుసరించి ఆయా జన్మములు ఎత్తవలసి యుండును. అంతేకాని, భగవంతుడు ఈజన్మమెత్తు ఆజన్మమెత్తు అని ఆజ్ఞాపించడు. అతనికి అందరూ సమానులే. భేదము లన్నియు వారి వారి కర్మల ననుసరించి కలుగుచుండును. దీనినే ఊతి అని అందురు. ఈశాను కథ అనగా ఈశ్వరుని గుణలీలలను అతని భక్తులైన వారల యొక్క అనుభవ కధలను ఈశాను కథలని అందురు. విరోధ లక్షణమన, భగవంతుడు తన సమస్త శక్తులను ఉపసంహరించుకొని, తనలో లీనము చేసుకొన్నప్పుడు అతను యోగ నిద్రను గ్రహించును. దానినే నిరోధమని అందురు.
ముక్తి అనగా, అజ్ఞానముచే బంధింపబడిన జీవుని బంధవిమోచనము గావించుటే ముక్తి అని అందురు. అనగా అనాత్మ భావమును వీడి ఆత్మ భావమునందు నిలుచుటే ముక్తి.
ఆశ్రమమన, ముక్తి కూడా ఒకా నొకని ఆశ్రయించి యుండవలెను కదా? ఆశ్రయము లేక యేదియు నిలువ జాలదు. విశ్వమున కంతటికిని పరమాత్మయే ఆశ్రయము, చరాచర ప్రపంచ మెవరి వలన పుట్టి పెరిగి నశించు చున్నదో అట్టి పరమాత్మయే ముక్తికి ఆశ్రయము కాన ఆశ్రయమన పరమాత్మయే. ఆధి భౌతిక, ఆధి దైవిక ఆధ్యాత్మికముల నెవడు తెలుసుకొనుచున్నాడో అట్టి ఆత్మను సమస్తమునకు ఆశ్రయమని తెలియవలెను.
(భా.వా.పు.185/189)
పురాణాలు మానవత్వాన్ని ఆదర్శాన్ని దివ్యత్వాన్ని జీవన విధానాన్ని గమ్యాన్ని భారతీయ సంస్కృతిని నిరూపించునట్టివి. మానవతా విలువల ప్రమాణాన్ని, వాటి లోపం వల్ల కలిగే నష్టాన్ని వివరించునట్టివి: ఆత్మతత్త్వమును నిరూపించునట్టివి. కానీ ఈనాటి పండితులు వాటి యొక్క విపరీతార్థాలు తెలిపి అనర్ధాలు కలిగిస్తున్నారేగాని యథార్థాన్ని అంతరార్థాన్ని తెలిపేవారు లేరు. అందుచేత వాటిని సరిగా గ్రహించేవారు లేరు. నాటి పురాణ కథలు. భారతీయ చరిత్రలు ఆధ్యాత్మిక జ్యోతులు, మానవుణ్ణి దైవానికి చేర్చే సనాతన సారథులు, వారధులు, ఈ పురాణాలు. భగవంతుడు జగన్నాటక సూత్రధారి. తానే ఈ జగన్నాటకమును రచించి, దర్శకుడైయుండి, పాత్రధారియై తన పాత్రను ఔచిత్యముగా పోషించిన విధానమును ఈ పురాణాలు చక్కగా వెల్లడిస్తాయి. ఉదాహరణకు, రామాయణంలో శ్రీరామునికి తాము అవతారమూర్తి అని తెలుసు. కాని సామాన్య మానవునివలె నటించి, సీతావియోగమునకు దు:ఖించినట్లు కనబడి సహజ మానవ ప్రకృతిని, సతిపట్ల పతి ధర్మమును నిరూపించాడు. కుమారునిగా, సోదరునిగా, పతిగా, రాజ్యపాలకునిగా, ఒక స్నేహితునిగా వివిధ రీతుల ధర్మాలను ప్రబోధించినదే రామతత్వం. సత్య వాక్యరిపాలన, పితృవాక్యపరిపాలన, ఏకపత్నీ వ్రతము మున్నగు ధర్మాలను లోకానికి చాటే నిమిత్తము అవతరించినవాడు రాముడు. ఈ ప్రకారం ప్రాచీన భారతీయ ఇతిహాసములన్నియు మానవతా విలువలను చాటునట్టివే.
కామంవల్ల పతనం తప్పదని నిరూపించింది రామాయణం. రామునికంటే అధిక విద్యలందు ఆరితేరి, శివభక్తుడై, మహాబలశాలియై, సువర్ణమయమైన లంకకు అధిపతియైన రావణుడు కామంచేత ఏరీతిగా తన ప్రాణాన్ని రాజ్యాన్ని వంశాన్ని కోల్పోయింది చక్కగా వర్ణిస్తుంది. రామాయణం. ఇక క్రోధము మానవుణ్ణి ఏ రీతిగా పతనం గావిస్తుందో తెలుపుతుంది. భాగవతము. కంస, శిశుపాల, దంతవక్ర, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అస్త్రశస్త్ర పారంగతులై, తపోధనులై, మహాశక్తి సంపన్నులైనప్పటికీ భగవంతునిపై ప్రేమకు బదులు క్రోధాన్ని ద్వేషాన్ని పెంచుకోవడంచేత దుర్మరణం పాలయ్యారు. మూడవది మహాభారతం. ధనబలం, జనబలం, భుజబలం. బుద్ధిబలం ఎంతగా ఉన్నప్పటికీ కౌరవులు నూరుమంది నామరూపాలు లేకుండా హతులైవారు. నూర్గురు పుత్రులు కల్గిన ధృతరాష్ట్రునకు చివరికి పిండం విడిచేవారు కూడా లేకుండాపోయారు. దీనికి కారణం? లోభం. రాజ్యం పాండురాజుది. కాని కౌరవులు లోభంచేత పాండవులకు అర్ధరాజ్యం కూడా ఇవ్వ నిరాకరించారు. ఐదూళ్ళు కాదు సరికదా, కనీసం సూదిమొనమోపుటంత భూమిని కూడా ఇవ్వమన్నారు. అంతేకాదు ధర్మపరులైన, మహాభక్తులైన పాండవులను వధించడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికంతటికీ లోభమే కారణం. ఈ ప్రకారం కామక్రోథ లోభములు మానవుణ్ణి ఎన్ని ఉన్ననూ ఏరీతిగా పతనం గావించునో రామాయణ భాగవత భారతాలు ప్రకటించుచున్నవి.
(స..సా.జూలై.98.పు.191/192)
పురాణములు కొన్ని మంచి ప్రబోధలు చేస్తూ వచ్చాయి. మరికొన్ని హాస్యాస్పదమైన విషయాలను కూడా ప్రబోధించాయి. ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదము ఆడుచూ, తీర్పు చెప్పటానికి నందిని మధ్యవర్తిగా పెట్టుకున్నారట. నంది ఈశ్వరుని యొక్క అభిమాని గదా! అందులో ఈశ్వరుని వాహనము గదా నంది. అందువలన పక్షపాత బుద్ధిలో ఈశ్వరుడు ఓడినప్పటికినీ, గెలిచినట్లు ప్రకటించింది నంది. పార్వతికి కోపం వచ్చి "నయముకాని వ్యాధితో నీవు నశించు పోవుదువుగాక" అని పార్వతి నందిని శపించిందట. అప్పుడు నంది వచ్చి పార్వతి కాళ్ళపై పడి క్షమించమని వేడుకుంది. నా నాయకుని ఓటమి నాకు కూడా ఓటమే గదా! కనుక అతనిని గౌరవించే నిమిత్తం నేను అసత్యమాడిన మాట నిజమే. దీనికి ఇంత పెద్ద శిక్షా. నన్ను క్షమించు తల్లి" అని నంది ప్రార్థించిందిట. అప్పుడు పార్వతి క్షమించి, పాప పరిహారమును కూడా చెప్పింది. నా కుమారుడైన గణపతి పుట్టిన పండుగ భాద్రపద చతుర్ధశి దినము. ఆ దినమున నీవు తినేటటువంటిది, నీకు అత్యంత ప్రీతికరమైనటువంటి గరిక (గడ్డి) ను గణపతికి ఆర్పితం చేయమని చెప్పందట. అనగా ఏది ఎవరికి ఏది ప్రీతికరమైనదో, ఆ ప్రీతికరమైనది అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు విమోచనమవుతాయి. కనుక తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి గరికను తీసుకొని వచ్చి వినాయకుని పూజించింది. నంది. గణపతి అనుగ్రహంతో నంది యొక్క అనారోగ్యము నిర్మూలన మైంది. దేవీ కటాక్షంతో శాపవిమోచనమైంది.
(శ్రీ ఆ.95 పు7)
(చూ|| ఆశలు, పండితుడు)