భగవంతుడు పరిపూర్ణమైన ప్రేమస్వరూపుడు. అట్టి పరిపూర్ణమైన ప్రేమస్వరూపుణ్ణి తృప్తి పర్చాలంటే పరిపూర్ణమైన ప్రేమతో ఆరాధించాలి. "కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయనమః..." అని ఊరికే నిమిషానికి పది నామాలు ఉచ్చరించినంత మాత్రాన సరిపోదు. హృదయ పూర్వకంగా పరిపూర్ణమైన ప్రేమచేత ఒక్క నామము చెప్పినా చాలు. భగవంతుడు మీ భావమునే చూస్తాడుగాని, మీరెన్ని నామాలు చెప్పారనేది చూడడు. మీరు ఏది చేసినా భగవంతునికి పరిపూర్ణమైన అర్పితం చేయాలి. అంతో ఇంతో పార్ట్ టైం అర్పితం చేయకూడదు. పరిపూర్ణమైన హృదయంతో చేయాలి, పరిపూర్ణమైన ప్రేమతో చేయాలి. పరిపూర్ణమైన కర్మల నాచరించాలి. ఇటలీ దేశంలో ఆంథోనీ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు వయోలిన్ లను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అయితే, ఒక్క వయోలిన్ను తయారు చేయడానికి అతనికి ఒక సంవత్సరం పట్టేది. ఒకనాడు అతని మిత్రులు " పిచ్చివాడా! ఎందుకీ విధంగా కాలమునంతా వ్యర్థం చేసుకుంటున్నావు? ఒక్క వయోలిన్ తయారు చేయడానికి నీవు ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం గడిచేదెలా?" అని మందలించారు. ఆంథోనీ "మిత్రులారా! దైవము పరిపూర్ణ స్వరూపుడు. అట్టి పరిపూర్ణుడైన పరమాత్మునికి పరిపూర్ణమైన తృప్తి కలిగేటట్లు నేను పని చేయాలి. లేకపోతే నా పని పూర్తిగా వ్యర్థమే" అన్నాడు. పరిపూర్ణుడైన దైవానికి చేసే అర్పితం కూడా పరిపూర్ణ మైనదిగానే ఉండాలి. ఈ సత్యాన్ని ఆంథోనీ గుర్తించాడు. కనుకనే, అతడు కాలమున వ్యర్థం చేస్తున్నానని భావించలేదు. కాలమును సార్థకం చేస్తున్నానని ఆనందించేవాడు. మీరు ఆంథోని వయోలిన్లను గురించి వినే ఉంటారు. అవి చాల ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే, అతడు పవిత్ర హృదయంలో, పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వాటిని తయారు చేసేవాడు.
(స.సా..న.99పు.301/302)