ఒకనాటి రాత్రి పానీయమున గ్రోలగోరి నిద్రించు రాణులను నిద్రాభంగముచేయ మనసొప్పక కూజాలోని నీరును ఒక చిన్న గిన్నెలో పోసుకొని త్రాగు సమయమున తన చేతి వేళ్ళు పట్టుతప్పుట, హస్తము కొంత అదురుట గమనించి దశరథుడు తనకు వార్డ్యక్యము వచ్చిన దనియును, నరముల పటుత్వము తప్పినమీదట రాజ్యపాలన చేయకూడదనియు, ఇంద్రియ నిగ్రహములేని పరిపాలన ప్రజాక్షేమమునకు విరుద్దము కాగలదనియు, అట్టి పరిపాలనచే రాజ్యము అస్తవ్యస్తమై కడకు పతనమునకు దారితీయుననియు నిర్ణయము చేసికొనెను. అంగపటుత్వము తప్పినరాజు పరిపాలనకు అర్హుడు కాడు. వార్ధక్యము ప్రవేశించిన ప్రభువునకు పరిపాలనా కాంక్ష ఉండుట మహా ప్రమాదము. అది దురాశ కాగలదు. ఇన్ని తెలిసియుండియు నేను తిరిగి అందులో ప్రవేశించుటచే నా కర్తవ్యమును తప్పినవాడ నగుదును. అని దశరధుడు వసిష్టులవారితో అనెను.
(రా.వా.మొ.పు.163/165)