కేవలం శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ప్రధానం కాదు. నేటి పుస్తక పరిజ్ఞానం, రేపు విజ్ఞానం, మరునాడు అజ్ఞానం. పుస్తకాన్ని మస్తకాన్ని ఏకం చేయరాదు. మస్తకంలో పెట్టుకున్న పవిత్ర భావాలను ఆచరణలో పెట్టాలి. అయితే ఈనాడు చాలమంది పుస్తకంలోని విషయాలను మస్తకంలో పెట్టుకొని గడగడా వల్లె వేస్తున్నారు. కంఠస్తం చేయడమే పండిత లక్షణ మనుకుంటున్నారు. అర్థంలేని చదువు వ్యర్థం. ఆచరణలో పెట్టని విజ్ఞానం ఉన్నా ప్రయోజనం లేదు.భజించిన అన్నం జీర్ణమై సర్వాంగములకు చేరినప్పుడే దేహం పుష్టిగా ఉంటుంది. ఎవరో వ్రాసిన దానిని కంఠస్తం చేసి, జీర్ణం చేసుకోవటానికి ప్రయత్నించడం మననం చేసిన దానిని భుజించడం వంటిది. అది శునక లక్షణం, మానవ లక్షణం కాదు. కనుక పుస్తకాలలోని విషయాలను కేవలం గ్రుడ్డిగా కంఠస్తం మాత్రమే చేయక, మొదట చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకొనిన దానిని కొంతవరకైనా అనుభవానికి తెచ్చుకోవాలి. అదే సరియైన చదువు నదులకు ఆనకట్టలు కట్టి. నిలువచేసిన నీటిని కాలువల ద్వారా ప్రవహింపజేసి పంటలు పండిస్తున్నట్లుగా, గ్రంథాలలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకొని చేతులద్వారా సమాజానికి పంచటం నేర్చుకోవాలి.
(శ్రీజూ.97వు.28)