పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు
ప్రవహింపజేయుటే పరమ భక్తి ప్రతి
మానవుండును బ్రతికి తా నుండుట
స్వార్థంబునకు కాదు సంఘ సేవ
చేయుటకే యన్న శ్రేష్ఠ భావంబుతో
మెలగుచుండిన మేలు కలుగు
మరచియు తను దాను మానవ సేవకు
అంకిత మొసగుటే ఆత్మ తృప్తి
నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని
సకల జీవుల కువకృతి సలుపకున్న
పుట్టి ఫల మేమి నరుడుగా పుడమి యందు
ఇంతకన్నను వేరెద్ది యెరుక పరతు.
(ఆ.ప్ర.వ.1992 పు.22)
“భగవంతుడా! నీ కంటే అన్యముగా జీవించుటకు వీలుకాదు. నేను నీలోనే కూడి ఉండాలి. నీతోనే ఆడాలి, నీలోనే జీవితాన్ని అంతము చేసుకోవాలి”. ఇవి పరమ భక్తికి చెందిన గుర్తులు, ఇలాంటి పరమభక్తికి సంబంధించిన సాధనలను మనము అభివృద్ధి చేయుటకు ప్రయత్నము చేయ్యాలి. సుఖము నందు - భగవంతుని - వర్ణించడము. కష్టమునందు భగవంతుని -- దూషించడము ఈ విధమైన భేద - భావములను మనము ప్రదర్శించరాదు. (శ్రీవాణి09- పు5)
రెండవ జాతీయ సేవా ఒక యథార్థ సంఘటనను వివరించి, దానిద్వారా ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రబోధించారు. పాగినీనీ ప్రసిద్ధ ఇటాలియన్ వయోలిన్ విద్వాంసుడు. ఒకసారి పారిలో జరిగిన ప్రపంచ సంగీత సమ్మేళనానికి అతను ఆహ్వానించబడ్డాడు. పారిస్ లో ఈ సమ్మేళనం రాయల్ పారిస్ హౌస్ లో నిర్వహించబడింది. ఈ సమ్మేళనానికి ఐరోపాకు చెందిన రాజకుటుంబాలవారు, ఉసింత ప్రపంచ ప్రసిద్ధులైన సంగీత కళాకారులు ఎంతోమంది వచ్చారు. పాగినీనీ తన వయోలిన్ తీసుకుని వేదిక పైకి వెళ్ళాడు. అతడు తన వయోలినను శ్రుతి చేస్తూ ఉండగా టంగ్ అన్న ధ్వనితో వయోలిన్ తీగ ఒకటి తెగిపోయింది. పాగినీనీ ఇదేమీ పట్టించుకోకుండా వయోలినను శ్రుతి చేస్తూనే ఉన్నాడు. వరుసగా రెండవ, మూడవ తీగలు కూడా తెగిపోయాయి. ఇక ఒకే ఒక్క తీగ మిగిలింది. ఇప్పుడేం జరుగుతుందా అని అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూడసాగారు. పాగినీనీ ప్రేక్షకులవైపు ఒకసారి భావగర్భితంగా చూసి వయోలిన కున్న ఆ ఒక్క తీగతోనే కచేరీ చేశాడు. ప్రపంచంలో ఎవరూ అంతవరకు వినని, ఊహించని రీతిలో పరమాద్భుతంగా ఆ కచేరీ జరిగింది.
ఈ సంఘటన వివరించి స్వామివారు, “ఈ సంఘటన వల్ల మీకు తెలిసినదేమిటి?” అని ప్రశ్నించి తామే ఇలా సమాధానం చెప్పారు, "కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోవడంవల్ల నేను ఏ పనీ సాధించలేకపోతున్నాను, మిత్రుల సహాయ సహకారాలు లేకపోవడంవల్ల నేను నా పనిలో సాఫల్యం సాధించలేకపోతున్నాను, సహోద్యోగుల ప్రేరణ లేకపోవడంచేత నేను వెనుకబడిపోతున్నాను, అంటూ మీలో చాలామంది నిరాశపడుతూ ఉంటారు. పాగినీనీ వయోలిన్లో తెగిపోయిన మూడు తీగలూ ఇవే. మిగిలిన ఆ ఒక్క తీగతోనే అతడు ఆనాడు ప్రపంచ ఖ్యాతిని పొందగలిగాడు. ఆ ఒక్క తీగ ఏమిటో తెలుసునా, అదే ఆత్మవిశ్వాసం. అదొక్కటి మీలో ఉంటే ఎంతటి విజయాలనైనా సాధించగలుగుతారు” (సనాతన సారథి, 09 2021 పు31)
మానవ జీవిత లక్ష్యం
నూలు లేని బట్ట, బంగారము లేని నగ, జలము లేని తరంగము, మన్ను లేని కుండ, ఎట్లనో అట్లే, పరమాత్మ లేని ప్రకృతి లేదు. పరమాత్ముని వెతికేదానికి వేరెక్కడికీ పోనవసరము లేదు. ఎక్కడ చూచినా కనిపించేవన్నియు పరమాత్ముని స్వరూపమే. ఏవి విన్నా, అన్నియూ పరమాత్ముని నామమే. ఏది అనుభవించినా, అన్నియూ పరమాత్ముని శక్తులే. మానవ జీవిత లక్ష్యమే దీనిని తెలిసికోవటము. లక్ష్యాన్ని చేరేది కూడ చాలా సులభమే. వివేక విచక్షణ వైరాగ్యములతో దానిని సులభముగా సాధించవలయును. ఆ గురియే మీకు గురువు. ఆ గమ్యమే మీయొక్క స్వస్థానము.
కాలాన్ని అపవిత్రముచేయక సద్వినియోగము చేస్తే పామరుడు పరమహంస అవుతాడు, పరమహంస పరమాత్ముడుగా మారుతాడు,కాయ పక్వమై పండుగా మారినట్టు! ప్రతి ఒక్క మానవుడూ పండు అయ్యే తీరాలి, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే తీరాలి. కాబట్టి మీలో నిరాశకాని, నిరుత్సాహంకాని, సందేహంకాని పెంచుకొనక, ఈ క్షణము నుండియే సాధన చేయండి. – బాబా (సనాతన సారథి, సెప్టెంబరు 2021 పు26)