మీ రందరు ఒక్క సాయి కుటుంబమని కాదు. దివ్యమైన భవ్యమైన భగవత్కుటుంబం. భగవంతుడు అన్ని దేశాల వారికి అన్ని తెగలవారికి అన్ని కులాల వారికి అన్ని కాలాల్లోనూ ఒక్కడే. ఒక్క పేరు ఒక్క రూపం సంకుచితమైనది. అన్ని రూపాలు, అన్ని నామాలు ఒక్కటేనన్న విశాల భావాన్ని మనం పెంచుకోవాలి. ఈనాడు ముఖ్యంగా మీకు పది సూత్రాలు నేను చెప్పదలచుకున్నాను...
మొట్టమొదటిది
జననీ జన్మభూమిశ్చ. జన్మభూమి కన్న తల్లివంటిది. ప్రతిమానవుడు దేశాభిమానం కలిగి ఉండాలి. ఏయే దేశాలవారు ఆయా దేశాలపట్ల అభిమానం కలిగి వుండడంలో దోషంలేదు. తన దేశాన్ని అభిమానించినంత మాత్రాన పరదేశాన్ని విమర్శించాలని లేదు. ఒక దేశాన్ని విశ్వసించినంతమాత్రంచేత మరొక దేశాన్ని ద్వేషించడం తగదు. కలలో, ఊహల్లో కూడా దేశద్రోహాని కేమాత్రం అవకాశాన్ని అందించరాదు. ప్రతి వ్యక్తికి దేశాభిమానం చాలా ముఖ్యమైనది.
రెండవది:
ఏ మతాన్నీ ద్వేషించక సర్వమతాలను గౌరవించాలి. దేశాభిమానంతోపాటు అన్ని మతాలను గౌరవించటం రెండవది.
ఇంక మూడవది:
ప్రతి మానవుని సోదరునిగా భావించిప్రేమించాలి. మనందరి జాతి ఒక్కటే. అది మానవజాతి. మానవజాతిలో పుట్టినవారము గనుక మానవులందరూ ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి సర్వమానవులను ప్రేమించాలి.
నాలుగవది.
ప్రతిగృహమును, గృహ పరిసరాలను పరిశుద్ధంగా ఉంచుకోవటం.
తన గృహాన్నేకాక పరిసర ప్రాంతాలను కూడా పరిశుద్ధపరచుకోవటంచేత ఆరోగ్య ఆనందములు చేకూరుతాయి.
ఇది ఐదవది.
భారతదేశంలో దానం పేరదేశానికి ద్రోహం జరుగుతున్నది. దానమనగా దేశమంతటా భిక్షగాళ్లమ తయారుచేయటం కాదు. భిక్షగాళ్ళకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని దానం, అలవాటు చేయకూడదు. వీరికి ఉపాధి కల్పించి, ఏదైనా ప్రదేశంలో ఏర్పాట్లు గావించి, కాలకాలానికి ఆహారము. వస్త్రము ఇస్తూ అనుకూలమైన వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డమొచ్చిన వారికంతా డబ్బులిచ్చి భారతదేశమంతా భిక్షగాళ్ళే అని చెడ్డ పేరు తేరాదు. మనం భిక్ష మివ్వడం చేతనే పట్టణాలలో పల్లెలలో సోమరత్వాన్ని పెంచుకొని భిక్షగాళ్ళుగా తయారవు లున్నారు. ఇది ఐదవది.
ఇంక ఆరవది:
లంచమిచ్చి పని చేయించుకోవటం గాని, లంచం పుచ్చుకొని పనిచేయటంకాని సత్యసాయి సంస్థలలో ఏమాత్రం జరగకూడదు. లంచం పుచ్చుకోవటం వల్ల కాని, లంచం ఇచ్చుకోవటం వల్ల కాని సత్యసాయి సంస్థలకు తీరని ద్రోహం పెరుగుతుంది. కనుక సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ లక్ష్యాన్ని దృష్టి యందుంచుకొని జాగ్రత్తగా మెలగాలి.
ఏడవది:
మానవు లీనాడు అనేక విధములైన సమస్యల నెదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కారము గావించుకొనే నిమిత్తమై మనం కొన్ని సూత్రాలను ఆదర్శంగా పెట్టుకోవాలి. పరస్పరం ద్వేషాలు అసూయలు పెరుగుతుంటాయి. వీటిని అరికట్టుకోవటానికి విశాల భావాన్ని పెంచుకోవలసి వస్తుంది. విశాల భావం కలగాలంటేజాతి మత భేదాలకు అవకాశ మివ్వకూడదు. జాతి మతాలను పాటించరాదు. మీ పద్ధతులు మీ గృహాలలో ఆచరించుకోవచ్చు కాని సమాజంలో వీటిని పాటించటంచేత ప్రమాదాలు సంభవిస్తాయి. ఒకరిని వంచించటం మరొకరిని అభివృద్దిగావించటం జరుగుతూ వుంటుంది. అట్లుకాక సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదరభావంతో ప్రేమించాలి. జాతి మత భేదభావాలు ఏమాత్రం పెంచుకోరాదు.
ఇంక ఎనిమిదవది:
ముందు స్వయం సేవ. తమ పనులు తాము చేసుకోలేనివారు సమాజ సేవలు ఏరీతిగా చేయగలరు? సత్యసాయి సంస్థలకు చెందిన ప్రతి సభ్యుడు కూడా తనపని తానే చేసుకోవాలిగాని ఇంకొకరితో చేయించు కోరాదు. కొందరు శ్రీమంతులై ఉండవచ్చును. వారు సేవక పరివారాన్ని పెట్టుకోవచ్చును. కొన్ని పనులకు వారిని ఉపయోగించవచ్చును. కాని తమ స్వంత పనులను కూడా ఆ పని వారితోనే చేయించుకోవటం కేవలం సోమరత్వం, ఇట్టి సోమరత్వానికి మరిగిన వ్యక్తి సమాజసేవ చేయలేడు. సమాజ సేవ చేయనివాడు సాయి సంస్థలో ఉండటానికి అర్హుడుకాడు. సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తమ సేవ తాము చేసుకోవాలి.
ఇక తొమ్మిదవది:
పాపభీతి దైవప్రీతి ప్రతి ఒక్కరికీ ఉండాలి. నిరంతరం భగవంతుని ప్రేమించాలి. పాపాన్ని ద్వేషించాలి. పాపాలు చేస్తున్నంతకాలం దైవం చిక్కడు.
పదవది:
ఇది సర్వసామాన్యమైన విషయం. ప్రభుత్వ చట్ట నిబంధనలను మనము ఏమాత్రం అతిక్రమించరాదు. ప్రభుత్వ శాసనాలను, చట్టాలను తూ.చ తప్పకుండా అనుసరించాలి. సత్యసాయి సంస్థల సభ్యుల నియమ నిబంధనలను చక్కగా పాటించి ప్రభుత్వానికి కూడా ఆదర్శాన్ని నిరూపించాలి. చట్టవిరుద్ధమైన కర్మలు మన సంస్థల సభ్యులు ఎంతమాత్రం చేయరాదు.
ఈ పది సూత్రాలను మీ హృదయంలో ప్రతిష్టించుకొని సంస్థకు సరైన ఆదర్శాన్ని నెలకొల్పాలి. మన ఆచరణ, మన పనులు సరైనవని ప్రజలకు ప్రభుత్వానికి సంపూర్ణవిశ్వాసం కలిగించాలి. ఇది మన కర్తవ్యం, మానవధర్మం , సమాజనీతి సంస్థ నిబంధనలను చక్కగా పాటించినప్పుడు సంస్థను మనం పెంచుకోనక్కరలేదు. అదే పెరిగిపోతుంది. ఈ క్రమశిక్షణను పాటించుకొంటూపోతే సంస్థ అభివృద్ధిని మనం కోరనక్కరలేదు. ఎవరియందు ఎట్టి దోషాలున్నా మనమా దోషాలనెంచక వారిని ప్రేమించి వారితో సహకరించి ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి.
(స.సా..డి.85 పు.322/323)