తైత్తిరియోపనిషత్తు “పంచాగ్నుల" ను గూర్చి కూడా ప్రబోధిస్తున్నది. ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని-ఇవే పంచాగ్నులు. ఉదరాగ్ని -అనగా ఆకలిచేత మానవుని తపింప చేయునది. మందాగ్ని - అనగా అమితంగా భజించుట వలన కలిగే అజీర్ణము చేతతపింపజేయునది. ‘కామాగ్ని - అనగా చిత్తమును అనేక విధములైన వాంఛల చేత తపింపజేయునది.
ఇంక నాల్గవది శోకాగ్ని. ఇది లౌకికమైన చింతల వలన, వాంఛల వలన కలిగే శోకము కాదు. దైవదర్శనం పొందుటకై, దైవానందం నిమిత్తమై మానవుని తపింపజేయునదే-శోకాగ్ని.భగవద్గీత యందుమొట్టమొదటి అధ్యాయం - "విషాదయోగం" ఇక్కడ "విషాద" మనగా ఏమిటి?అర్జునుడికి విషాదము ఎందుకు కలిగినది? కేవలం లౌకిక సంబంధమైన విషయవాంఛలలో బంధు మిత్రుల నిమిత్తమై తాను విచారమునకు గురియైనాడా? ఈ విధంగా ఏర్పడే విషాదమునకు "యోగము అనే సార్దకనామం కలుగదు. కనుక లౌకిక సుఖదుఃఖముల నిమిత్తమై, ధన కనక వస్తు వాహనాదుల నిమిత్తమై అర్జునుడు శోకించలేదు. యుద్ధం వలన అనేకప్రాణులు నశిస్తాయి. వర్ణసంకరము ఏర్పడుతుంది. ధర్మగ్గాని కలుగుతుంది - ఈ విధమైన ధర్మమును లక్ష్మమందుంచుకొని, దైవమును దృష్టియందుంచుకొని అర్జునుడు విషాదమునకు గురియగుట చేత అది “విషాదయోగము"గా రూపొందినది. ఇట్టి దైవ సంబంధమైన, ధర్మ సంబంధమైన తపనకే "శోకాగ్ని" అని పేరు.
ఐదవదైన‘బడబాగ్ని’ భయంకరమైన రోగముల చేత, బాధల చేత మరణము చేత మానవుని తపింప చేస్తుంది. ఈ పంచాగ్నులు కేవలం భౌతికమైన శరీరమునకు సంబంధించినవి మాత్రమే. తద్భిన్నమైన ఆత్మకు సంబంధించినవి కావు. ఈ పంచాగ్నులకు ఆత్మ సాక్షీభూతుడై ఉంటున్నాడు. ఇట్టి క్షీభూతుని తత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై తైత్తరియోపనిషత్తు పంచాగ్నులయొక్క ప్రమాణములను ఆధారముగా చేసికొని ప్రజలకు బోధిస్తున్నది.
(స.సా.న.91.పు.298)
పంచాగ్నులు : కాలాగ్ని. క్షుదాగ్ని, శీతాగ్ని, కోపాగ్ని, జ్ఞానాగ్ని. కాలాగ్ని పాదములందును, క్షుదాగ్ని నాభియందునూ, శీతాగ్ని హృదయమందును, కోపాగ్ని నేత్రమందును, జ్ఞానాగ్ని ఆత్మయందును వుండును.
(ప్రశ్నవా. పు. 7)
(చూ ప్రేయోమార్గం)