పూర్వం తమిళ దేశంలో మాణిక్యవాచికర్ అనే సాధకుడుండేవాడు. ఒకనాడు అతడు ఎక్కడికో ప్రయాణమై వెళుతుండగా ఉన్నట్లుండి కుంభవృష్టి ప్రారంభమైంది. సమీపంలో అతనికొక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు వరండాలో ఎవ్వరూ లేరు. అతడు ఆ వరండాలోకి ప్రవేశించాడు. అందులో ఒక్క మనిషి పడుకోవడానికి తగినంత స్థలం మాత్రమే ఉన్నది. కొంత సేపటికి మరొక వ్యక్తి ఆ కుంభవృష్టిలో నడుచుకుంటూ పోతున్నాడు. వెంటనే మాణిక్యవాచికర్ "సోదరా! రండి, లోపలికి వచ్చి తలదాచుకోండి" అని ఆహ్వానించాడు. అతడు "అయ్యా! ఈ వరండాలోకి నీవు పడుకోవడానికి తగినంత స్థలం మాత్రమే ఉన్నది కదా! నేను కూడా రావటంవల్ల నీకు ఇబ్బంది కల్గుతుందేమో!" అన్నాడు. "సోదరా! నీవు కూడా వస్తే మనిద్దరము కూర్చోవచ్చును" అన్నాడు మాణిక్య వాచికర్. మరి కొంత సేపటికి ఇంకొకడు వర్షంలో తడుసుకుంటూ పోతున్నాడు. "సోదరా"సోదరా! మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి" అన్నాడు. ఆ వ్యక్తి "అయ్యా! మీరిద్దరు కూర్చోవడానికి తగినంత స్థలం మాత్రమే ఉన్నది కదా! నేను కూడా వస్తే మీకు ఇబ్బంది కలుగుతుందేమో!" అన్నాడు. "సోదరా! మాకేమీ ఇబ్బంది కలుగదు. నీవు వస్తే మనం ముగ్గురం నిలబడుదాం" అన్నాడు. మాణిక్యవాచకర్. ఈ విధమైన త్యాగభావం మీయందు అభివృద్ధి కావాలి. ఒక్కడు పడుకొనే బదులు ఇద్దరు కూర్చున్నారు. తరువాత ఇద్దరు కూర్చునే బదులుముగ్గురు నిల్చున్నారు. ఈ విధంగా, ఒక్క మనిషి తన ఆనందాన్ని మరో ఇద్దరికి పంచి పెట్టాడు. మీరు కూడా మీ ఆనందాన్ని పదిమందికి పంచటానికి ప్రయత్నించాలి. అప్పుడు మీలో ఆనందము పది రెట్లు పెరిగిపోతుంది. మీ చేతిలో ఒక నీటి బిందువు ఉన్నదనుకోండి. అది అట్లానే ఉంటే గాలికి ఆవిరైపోతుంది. ఆ ఒక్క బిందువును సముద్రంలో చేర్చితే అది సముద్ర స్వరూపాన్నే ధరిస్తుంది. అదేవిధంగా మీ ఆనందాన్ని అందరికీ పంచినప్పుడుమీలో నఖశిఖ పర్యంతం ఉన్న కాన్షియన్స్ సర్వత్ర ఉన్న కాన్షియస్ నెస్ లో లీనమై పోతుంది. అదియే నిర్యాణము, ఆదియే సా.యుజ్యము.
(స. సా..పి.99పు.39/40)