రెండు రకములైన కుటుంబాలుంటున్నాయి. న్యూక్లియర్ కుటుంబమని ఒకటి, సమూహమనే కుటుంబ మొకటి ఉంటుండాది. ఈ న్యూక్లియర్ కుటుంబములో అమ్మ, నాన్న, బిడ్డ, కొడుకు అంతే. ఈ న్యూక్లియర్ కుటుంబము చాలా నారో, (Narrow). సామూహిక కుటుంబము తల్లి తండ్రి బిడ్డ కొడుకు తాత అవ్వ ముత్తాత వీరంరదరు చేరినటువంటిది. ఈనాడు ఏమైపోతుండాది? న్యూక్లియర్ కుటుంబము లోపల అమ్మ నాన్నలు ఆఫీసుకు పోతారు. బిడ్డలను ఆయా దగ్గరో డ్రైవరు దగ్గర్నో ప్యూన్ దగ్గర్నో విడిచిపెడ్తారు. ఈ పిల్లలకంతా ఆయా బుద్ధులు డ్రైవర్ బుద్ధులు ఫ్యూన్ బుద్ధులు వస్తుంటాయి. వీళ్ళు దమ్మిడీకి పనికిరాకుండా పోతున్నారు. ఏదో డబ్బులిచ్చేసి చదివిస్తుంటారు. వీడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోతున్నాడు? ఎట్ల పెరుగుతున్నాడు? అనే విచారం తల్లిదండ్రుల కేమాత్రం పట్టటం లేదు. ఈ సామూహిక కుటుంబము లోపల ఎట్ల ఉంటాదంటే అమ్మానాన్నలు ఆఫీసుకు పోయినాగాని అవ్వాతాతలు ఇంటిలో ఉంటారు. ఈ తాతలు అవ్వలు వాళ్ళకు మంచినంతా బోధిస్తూ ఏవో కథలు చెప్పుకుంటూ సరైన అభివృద్ధికి తగిన ఉపదేశాలు చేస్తుంటారు. ఒకవేళ అమ్మానాన్నలు పోట్లాడితే న్యూక్లియర్ కుటంబములో వాళ్ళకు దిక్కు లేరు. ఎవరు చెప్పేవారు కూడా ఉండరు. ఈ సామూహిక కుటుంబములో ఏమౌతుంది? వాళ్ళ అత్తమామలుంటారు. లేక తల్లిదండ్రులుంటారు. వాళ్ళు వస్తారు. ఏమిట్రా నాయనా ఇట్ల చేస్తున్నావు? ఇది మంచిది కాదు. ఇట్ల చెయ్యకూడదు. అని బుద్ధులు చెప్తుంటారు. ఈనాడు జాయింటు ఫామిలీ పూర్తి పతనమైపోయింది. తమ ఫామిలీనే పతనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇంక ప్రపంచం యొక్క విశాలమైన బుద్ధి వాళ్ళకెక్కడనుండి వస్తుంది? తల్లిదండ్రులనే లెక్క చెయ్యటం లేదు. ఇంక లోకాస్సమస్తా స్సుఖినో భవంతు కేవలం గాలివార్తలు. మొట్టమొదట మనము ఈ న్యూక్లియర్ కుటుంబమును విశాలం చెయ్యాలి, జాయింట్ ఫామిలీగా ఉండాలి. ఈ జాయింట్ ఫామిలీ లోపల ఎంతనో మనకు అభివృద్ధి ఉంటుండాది. ఎంతనో ఉత్తమమైన మార్గాలున్నాయి. ఎంతనో ఉత్తమమైన బుద్ధులు అభివృద్ధి ఔతాయి. ఈ జాయింట్ ఫామిలీ గౌరవమర్యాదలకు పాటుపడుతూ వచ్చింది ఆనాడు. ఈనాడు న్యూక్లియర్ ఫామిలీ ఏమీ ప్రయోజనం లేదు. కేవలము ఆడంబరాలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్యూ ఆర్" ఇది మనం చూపిస్తుండేది. ఈ వేషాలచేత జగత్తునంతా మోసం చేస్తున్నారు. ఇది కాదు. మనం నేర్చవలసినది. మన సమాజమును మనం చక్కబరచుకోవాలి. మనదేశాన్ని మనం చక్కబరచుకోవాలి. మన కుటుంబాన్ని మనం చక్క బరచుకోవాలి. ఎవరికి వారు వారి వారి కుటుంబాలను సమాజాన్ని చక్కబరచుకుంటే దేశమెంత సులభంగా చక్కబడుతుంది? ఈనాడు. కుటుంబ విషయమై వీరికే మాత్రము బాధ్యత లేదు. విద్యార్థులారా! మొట్టమొదట మీ కుటుంబాన్ని మీరు పోషించుకోండి. మీకుటుంబాన్ని మీరు గౌరవంగా నిలబెట్టుకోండి. మొట్టమొదట మీ తల్లిదండ్రులను సంతృప్తి పరచండి. ఆ శక్తియే మీలో లేనప్పుడు ఎన్ని విద్యలు చదివి ఏమి ప్రయోజనము?
(శ్రీ స. వి. వా, పు. 91/92)