ఒకసారి రాముని దగ్గరకు ఒక కుక్క ఏడుస్తూ వచ్చింది. దాని ఒంటి నిండా దెబ్బలున్నాయి. వాటివల్ల దానికి రక్తం కారుతున్నది. రాముడు లక్ష్మణుని పంపి అది ఆవిధంగా ఎందుకున్నదో విచారణ చెయ్యమన్నాడు. ఒక బ్రాహ్మణుడు కర్రతో దానిని ఆవిధంగా కొట్టాడని తెలిసింది. అతనిని పిలిచి అడిగితే ఆకుక్క తనదారికి అడ్డంగా వచ్చినందువల్ల కొట్టానని చెప్పాడు. అప్పుడు రాముడు "ఆ బ్రాహ్మణుణ్ణి ఏవిధంగా శిక్షించమంటావు?" అని ఆ కుక్కను అడిగాడు. అప్పుడా కుక్క అతనిని ఒక దేవాలయం మేనేజరుగా నియమించమని అన్నది.“ అది బహుమానము కాని శిక్ష ఎలా అవుతుంది?" అన్నాడు రాముడు. అప్పుడా కుక్క రామునితో "నే నిదివరకు ఒక దేవాలయం మేనేజరునే. ఆ దేవుని డబ్బు తినటం వల్ల కుక్కగా పుట్టాను. కుక్కగా పుట్టటం వల్ల అందరూ కొడుతున్నారు. అతనిని కూడా దేవాలయం మేనేజరుని చేస్తే ఆతడు దేవుని డబ్బు తిని తరువాత కుక్క జన్మ ఎత్తుతాడు. అప్పుడు అందరూ దానిని కొడతారు" అని చెప్పింది.
కేవలం ఆ కుక్క, బ్రాహ్మణుడే కాదు, ప్రతివ్యక్తి దేవుని డబ్బు తింటున్నవారే. లోకంలోని సమస్తము భగవంతునికి చెందినదే కదా! భగవంతుని డబ్బువాడుకొని మీరు లాభం పొందుతున్నందుకు ప్రతిగా మీరు భగవంతునికి ఏమిస్తున్నారు? ఊరకనే కూర్చొని తినకూడదు. కనీసం కొంత శారీరకంగానైనా భగవంతునికి సేవ చేయవద్దా? పనిచేయకుండా తినేవాడు మోసగాడు. భగవంతునికి మీరుచేసే సేవ ఎంతమాత్రమూ అక్కరలేదు. కాని అది మీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది. అందువల్ల ఊరకనే దేనిని తీసికొనవద్దని బోధించండి. వారికి కావలసినది కష్టపడి సంపాదించుకోనివ్వండి.
(స.వ. 61-62 పు.188/189)
తెలుగులో ఒక సామెత ఉన్నది! దుష్టుడు తప్పులు వెకుతుతాడు, కుక్క చెప్పులు వెతుకుతుంది అని. కుక్క ఎల్లప్పుడూ చెప్పులనే వెతుకుతుంది. దుష్టుడు ఎల్లప్పుడూ పరుల తప్పులనే వెతుకుతుంటాడు. కనుక దుష్టునికి, కుక్కకు ఎట్టి వ్యత్యాసములేదు. అలాంటి వారు కుక్కలతో సమానం. "మనం డాగ్ కాకూడదు గాడ్కావాలి"
(శ్రీసా.గీ.పు.241)
(చూ॥ ఆలర్కుడు, దుష్టులు, శ్రీమంతులు)