కృష్ణ తత్త్వము నందు వివిధ విషయాలు అనేక అంతరార్థములతో కూడి ఉంటున్నాయి. ప్రజలు తమతమ భావములను పురస్కరించుకొని యదార్థమును విస్మరించి, అనర్థాలను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణునికి అష్టభార్యలుండి రనియు, అంతేగాక అతడు 16 వేలమంది గోపికలను కూడా కలిగియుండెనని చాలమంది భావిస్తున్నారు. దీనియందున్న ఆంతరార్థము ఏమిటి? ఈ ఎనిమిది మంది కృష్ణునికి ప్రాపంచిక సంబంధమైన భార్యలు కారు. మన దేహానికి హృదయమే అత్యంత ప్రధానమైనది. మన దేహము నందు గల షట్చక్రములలో రెండు ప్రధానమైనవి. ఒకటి సహస్రార చక్రం, రెండవది హృదయ చక్రం. ఈ హృదయ చక్రం అష్టదళములు గల పుష్పముతో కూడినది. ఇదే హృదయపుష్పం. దీనియందలి అష్టదళములకు “అష్టభూములు అని మరొక పేరు. భూమికి నాథుడు. భగవంతుడు. అనగా, ఈ ప్రకృతికి పరమాత్మయే నాథుడు. కనుక అష్టదళములతో కూడిన హృదయ పుష్పానికి నాథుడు భగవంతుడే; అతడే శ్రీకృష్ణుడు. ఇతనినే మాధవ’ అన్నారు. మ - అనగా మాయ, లక్ష్మి, ప్రకృతి; ధవ - అనగా నాథుడు. కనుక, మాధవ అనగా హృదయానికి నాథుడు, ప్రకృతికి నాధుడు అని అర్థం శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్య లుండిరన్న మాటలో గల అంతరార్థం ఇదే.
మనదేహములో నుండిన మరియొక ప్రధానమైన చక్రం - సహస్రారం, ఇది వేయి దళములతో కూడినది. ఒక్కొక్క దళము నందు భగవంతుడు షోడశ కళాపరిపూర్ణుడై ప్రకాశిస్తుంటాడు. కనుక, వేయి దళములకు మొత్తం 16000 కళలుంటున్నాయి. దీనిని పురస్కరించుకొనియే కృష్ణునికి పదహారువేల మంది గోపికలుండిరని భావిస్తున్నాము. కనుక గోపికలనగా కళలే. ఈ పదహారు కళలు మన లోపల పరిపూర్ణం కావాలి. భగవదాజ్ఞను శిరసావహించినప్పుడే, ఈ షోడశకళలు మన యందు రాణిస్తాయి. కాబట్టి, కృష్ణునికి 16 వేలమంది గోపికలు, ఎనిమిది మంది రాణులు అనెడి పిచ్చిపిచ్చి భావాలకు చోటివ్వరాదు. "ఆనాడు కృష్ణునికే 16 వేలమంది ఉన్నప్పుడు, నాకు పదహారు మందైనా ఎందుకుండ కూడదు" అనెడి భావము నేటి పిల్లలలో ప్రారంభమౌతుంది. కనుక భాగవతము నందుండిన మహాపవిత్రమైన సూక్ష్మార్థములను గుర్తించడానికి ప్రయత్నించాలి.
(స.సా.ఆ. 91 పు.260)