అనిత్యము అశాశ్వతము, అసత్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి విషయములకు మనము ఎన్నియో Tax (పన్నులు) లు కట్టివేస్తున్నాము. ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము నిత్యమైన, సత్యమైన శాశ్వతమైన జీవితమునకు అవసరమైన సమస్త శక్తులను మనం అనుభవించుటకు అందిస్తున్న భగవంతునికి మనం ఏమి Tax యిస్తున్నాం? మనం ఏమి Thanks (కృతజ్ఞతలు) చెబుతున్నాం? ఇంకా భగవంతుడు అది యివ్వలేదే? ఇది యివ్వలేదే? అని దూషిస్తుంటాం. Tank లో ఉన్న నీరు పంపుల ద్వారా మన ఇంటికి సప్లయి చేసినందులకు మున్సిపాలిటీవారికి Water Tax కడుతున్నాం. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకొని, మున్సిపాలిటీవారికి House Tax కడుతున్నాం. కరెంటు Fan ను మన ఇంట్లో ఉపయోగించుకుంటే Electricity Tax కడుతున్నాం . ఎవరైనా చిన్న సహాయం చేస్తే Thanks చెబుతాం. మన కర్చిఫ్ క్రిందపడితే, దానిని ఎవరైనా తీసియిస్తే వారికి Thanks చెబుతాం. అయితే భగవంతుడు మలయ మారుతంగా గాలిని అందిస్తుంటే ఈ గాలిని అందిస్తున్న భగవంతునికి మనం ఏమి Thanks చెబుతున్నాం? ఏమి Tax ను భగవంతునికి కడుతున్నాం? దేదీప్యమానంగా ప్రకాశిస్తూ జగత్తునంతా వెలుగునిస్తున్న ఈ సూర్యునికి ఏమి Thanks చెబుతున్నాం? ఏమి Tax కడుతున్నాం ? కుంభ వర్షం కురిపించి, చెరువులను, వాగులను, నదులను నింపి జలమయం గావిస్తున్న భగవంతునికి ఏమి Thanks చెబుతున్నాం? ఏమి Tax కడుతున్నాం. ఎన్ని పంపుసెట్లు పెట్టుకుంటే ఇంత నీరు మనకు లభ్యమవుతుంది? అల్పమైన, స్వల్పమైన వాటికి మనం ఎంతో Tax కడుతున్నాం. అయితే భగవంతుడు అనుగ్రహించేవన్నీ Free (ఉచితం) భగవంతుడు అందించే గాలి Free నీరు Free లైట్ Free ధ్వని Free ఆంతా Freeగా అందిస్తున్నాడు భగవంతుడు. అట్టి భగవంతునికి మాత్రం మనం ఏమి Tax కడుతున్నాం? కనీసం Thanks (కృతజ్ఞం) కూడా చెప్పటం లేదే?
(శ్రీ. ఆ. 1996 పు. 2/3)
కృతఘ్నత అన్నదే ఒక పెద్ద పాపం. ఈ పాపమే మానవుని తలవంచి అనేక విధములైన బాధలకు గురిచేస్తుంది. ఎవరివలన నేను ఈ స్థాయికి రాగలిగితిని ఎవరి వలన నేను ఈ కీర్తిని అనుభవించగలిగితిని. ఇంతటి అభివృద్ధికి ఎవరు కారణం? అనే ఉపకారమును మరచిపోతున్నారు. ఈ ఉపకారమును మరచినాడు దైవదృష్టిలో చచ్చినవానితో సమానము. కనుక, కృతజ్ఞతలేని వాని జీవితము చావుతో సమానము. ఎవరి వల్ల నీవు ఈ ఉపకారమును పొందావో, వారికి నీవు కృతజ్ఞతను చూపించాలి. ఈనాడు నీవు పెద్దవాడు కావచ్చును. విద్యావంతుడు కావచ్చును, నీవు ధనవంతుడు కావచ్చును, అధికారివి కావచ్చును – కాని ఈ స్థాయి ఎవరి వలన వచ్చింది? అనే విషయం మరచి పోతున్నాడు. కనుకనే, మానవుడు తన విలువలనన్నింటిని నిర్మూలనం చేసుకుంటున్నాడు. ఈ అహంకారము, ఆడంబరము, ఆత్యాశ, మానవత్వాన్ని పూర్తిగా భస్మం చేస్తోంది.
(శ్రీ .భ. ఉ. పు. 109/110)
ఒక రైతు ఒక ముసలి ఆవును అంగట్లో కసాయి వానికి ఆమ్మి తిరిగి తన పొలానికి వచ్చాడు. అక్కడ అతనికి ఒక పాము ఎదురయింది. అప్పుడతడు "విషపు ప్రాణిని చంపండి" అని అరిచాడు. అప్పుడు పాము అతనిలో "నేను విషపు ప్రాణిని కాదు, నీవే విషపు ప్రాణివి" అన్నది. "కాదు" అన్నాడతడు. అప్పుడు పాము నీవు వెళ్ళి దూడను అడుగు" అన్నది. ఆ దూడ అతని ద్వేషము, క్రూరత్వములకు సంబంధించి విషాదకరమైన విషయాలు చెప్పింది.
తనను తల్లి దగ్గర పాలు త్రాగనియకుండగా బలవంతంగా లాగి త్రాటితో కట్టటము, తనచేత బరువులు లాగిస్తూ తనను దెబ్బలు కొట్టటము, తన తోకను అతడు గట్టిగా మెలి పెట్టటము వివరించి చెప్పి మానవుడు కృతజ్ఞత లేని జంతువు, అతడు ఎంతో హీనముగా ఉంటూ ఇతరులను పశువు అంటాడు అని అన్నది.
నిజానికి మనిషిని కాని, జంతువును కాని చెడుమాట అనకండి, కారణం అన్ని జీవులలోను భగవంతుడున్నాడు. మీరు పలికే కఠినమైన మాట లోపల ఉన్న భగవంతునికి తగులుతుంది.
(వ. 61-62 పు.163/164)
పట్టాభిషేక సమయంలో ప్రప్రధమంగా రాముడు హనుమంతునికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. "ఈనాడు ఇట్టి కళ్యాణకరమైన పట్టాభిషేకము జరుగుతున్నదంటే దీనికి కారణం ఎవరు? సీత జాడను తెలిపి అనేక విధములుగా తోడ్పడిన హనుమంతుడే. కనుక మొట్టమొదట అతనికి నా కృతజ్ఞతాభినందనల నర్పిస్తున్నాను" అన్నాడు. సీతను రావణుని బారి నుండి రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన జటాయువును జ్ఞాపకం చేసుకున్నాడు. సీతాన్వేషణలో సహాయం చేసిన సుగ్రీవునికి, యుద్ధంలో రాక్షసమాయలను కనిపెట్టి తోడ్పడిన విభీషణునికి కృతజ్ఞతలు చెప్పాడు. అంతేగాక సీతారాములతో తనుకెట్టి సంబంధమూ లేకపోయినప్పటికీ యుద్ధంలో అమితోత్సాహంతో పాల్గొని ప్రాణత్యాగం చేసిన వానర వీరులందరిని గుర్తుచేసుకున్నాడు. ఈ విధంగా ఎవరెవరు తనకు సహాయం చేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సీత కూడా హనుమంతునికి కృతజ్ఞతలు తెల్పుతూ. "నీకు ముల్లోకములను పట్టం కట్టినప్పటికీ నీఋణమును నేను తీర్చుకోలేను. ఇంతటి భక్తి, త్యాగము నీలో ఉండటం చేత నీవు ముల్లోకములలోను సంచరించగలవు. నీ సంచారముచేత ముల్లోకములు సుభిక్షంగా ఉంటాయి." అని ఆశీర్వదించింది. అనగా ఉపకారం చేసినవారికి తగిన కృతజ్ఞత చూపించాలని రామాయణం బోధిస్తున్నది. కృతజ్ఞత చూపేవాడు మానవుడు. కృతఘ్నుడైనవాడు దానవుడు. మానవత్వమునకు, దానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు. ప్రవర్తనము పురస్కరించుకొనియే వీడు మానవుడు, వాడు దానవుడు, ఇతడు దేవుడని నిర్ణయించవచ్చును.
(శ్రీభ...పు.94)
(చూ: ఉపకారము,దేశసేవ)