గోకులంలో కృష్ణుడు జన్మించాడు. బృందావనంలో పెరిగి పెద్ద వాడైనాడు. తరువాత ద్వారకా నగరంలో పరిపాలన చేశాడు. అంటే ఈ మాటలకు అర్థం? మనస్సు అనే గోకులంలో పుట్టాడు. ఆధ్యాత్మిక మార్గం అనుసరించిన మనస్సులో ఇప్పుడు కూడా కృష్ణుడు జన్మిస్తాడు. ప్రేమకు నెలవైన హృదయమే బృందావనం. అక్కడ ఆయన పెరుగతూ ప్రేమను పెంపుచేస్తాడు. చిత్తమనే మధురాపురిని పరిపాలిస్తాడు. నిర్వికల్పస్థితి అనే ద్వారకలో చక్రవర్తిగా స్థిరనివాసం ఏర్పరచుకుంటాడు. ఈ వివిధదశలలో కృష్ణతృష్ణను పెంచుకుంటే మీరు తరించ గలరు. రాధ, మీరాబాయి, సక్కుబాయి ప్రభృతుల శ్రేణిలో చేరి పోగలరు.
(శ్రీ.స.వి. 1963 పు73)