హరిగోవిందా హరి గోవిందా
హరిగోవిందా అనరామందా
మృత్యువు దాపున మసలేటప్పుడు
వ్యాకరణము కాపాడదురా!
తామరాకు పై తళ తళలాడే
నీటి బొట్టువలె నిలకడ లేనిది
బ్రతుకభిమానపు తెగులు పుట్టురా
దిగులు దుఃఖముల తెరరా లోకము
ఆటల పాటల బాల్యంబాయెను
ప్రాయములో ప్రేమాయణమాయెను
ముదిమిని చింతలు ముదిరేపోయెను
పరబ్రహ్మ కాబట్టక పోయెను
ఎవతెభార్య, ఇంకెవరో బిడ్డడు?
ఎంత విచిత్రమో యీ సంసారము
ఎవరివాడ? వెవ్వర? వేటు వచ్చి ఆ
తత్త్వమిక్కడే తమ్ముడ తెలియర
సత్సంగముచే సహజ విరక్తీ
ఆవిరక్తి చే విగత భ్రాంతి
భ్రాంతి తీరితే కాంతి స్థిమితము
స్తిమిత కాంతిచే జీవన్ముక్తి
రేయి పవళ్ళు సాయం ప్రొద్దులు
చలి వేసవులూ సారెకు మారును
కాలక్రీడల గడచే నాయువు
ఐనా వదలదు ఆశావాయువు
యోగియైన మరిభోగియైన
సంసారియైన సన్యాసియైననూ
స్వాంతము సత్యము ననుభవించితే
ఆనందమే ఆనందము నందము
కించిద్భగవద్గీతా పఠనము
కొంచెము గంగా తీర్థము పానము
హరిపూజన మొకపరి కావించిన
అతనిని యముడేమని తర్కించును
మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట
అమ్మ కడుపులో అణగి యుండుట
అంతులేని సంసారముదయతో
దాటింపుము నన్ను దబ్బున దేవా
నీలో నాలో నిజమొక విష్ణువె
ఎల్లెడ సమమై ఉల్లంబుంటే
అపుడే అనుభవమగు విష్ణుత్వము
శత్రుడు మిత్రుడు పుత్రుడు బంధువు
అనుచు ఉపేక్షాపేక్షలు మానుము
అన్నటిలోను ఆత్మని చూడుము
భేదమనే అజ్ఞానము వీడుము
పాడుము గీతలు నామ సహస్రము
భగవంతుని రూపముభావింపుము
సలుపుమెపుడు సజ్జన సాంగత్యము
దీన జనులకై దానము చేయుము
ధనమే కీడును కొనురా నిత్యము
దానలేదు సుఖ లేశము సత్యము
కొడుకుకైనా భయపడురా ధనికుడు
నడచేదిదే యెల్లెడల నెప్పుడు
ప్రాణాయామము ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారము
మంత్రముతోడ సమాధివిధానము
జాగ్రత్తగా నిశ్చలముగా చేయుము
కామము, క్రోధము లోభము మోహము
విడుపుము, నేనెవ్వడవని యనుకో!
తము తామెఱుగని దద్దమ్మల కగు
నరకము లోపల నానా బాధలు
సద్గురు చరణాబ్దముపై భక్తీ
త్వరగా ముక్తికి తరలే మార్గము
ఇంద్రియ మానవ సాంద్ర నియమమే
హృదయస్థుని చూపించును దేవుని
(ము.ము.పు. 107/110)
నీతినియమములేక తిరిగిన
దాతకైన అజ్ఞానముడుగదు.
జ్యోతిలేనిదే అంధకారము
భూతలంబున బాయకుండును || భ |
(భ.వే. ప్ర.పు. 77)
"గోవింద భజగోవిందం" దీనికి పెద్దలు అనేక అర్థాలు చెప్పారు. "గాధం యితిగోవిందం" అని అర్థము అనగా గోపులను పాలించేవాడు భరించేవాడు అని అర్థము. అనగా పశుత్వాన్ని కూడా పరిపాలన జరిపేవాడే గోవిందుడు, మానవునియందు పశుత్వము శేషమై యున్నది. ఈ పశుత్వాన్ని పోగొట్టి మానవుని పరిశుద్ధునిగా చేయునదే గోవిందనామము. మానవత్వానికి దివ్యత్వము లభ్యమగును. కాని పశుత్వానికి మానవత్వము లభ్యము కాదు. పశుత్వ లక్షణము పచ్చగడ్డి చూపినప్పుడు దగ్గరకొచ్చి పరుగిడును. యీనాడు మానవుడు పది కాసులు చూపిన దగ్గరకు వచ్చును. కసరిన దూరము పోతున్నాడు. యిది పశుత్వ లక్షణము, అట్లుకాక మానవుడు భయపడకూడదు, భయ పెట్టకూడదు. భయపడుట మృగలక్షణము భయ పెట్టుటకు భయపడుటకు మానవుడు మృగముకాదు. మానవుని తప్పొప్పులను తీర్చిదిద్ది పరమాత్ముని సన్నిధి అందించునది గోవిందుని లక్షణము. కనుకనే గోవిందుని భజింపకతప్పదు. గోవింద నామమునకు మరొక అర్థము, వాక్యము (శబ్దము). మానవుని పలుకులకు, పశువుల అరపులకు, వేదములకు శబ్దమే ప్రధానము. శబ్దములలో భేదముండవచ్చును. కాని శబ్దము యేకశబ్దమే, శబ్ద స్వరూపుడు గోవిందుడు గాం: భూమికి స్వరం: వేదంవా గోవింద. జగన్నాటక భూమియందు సూత్రధారిగా నుండి సర్వ సుఖములకు నిలయమై, సర్వమునకు అధికారిగా నున్నవాడే గోవిందుడు. ”వేదో నారాయణోహరి" వేదము నారాయణతత్వము నిరూపణచేస్తూ వచ్చింది. స్థూల సూక్ష్మకారణ స్వరూపమై నీజగత్తును ప్రకాశింపచేయునదే గోవిందనామము. అందువలననే ప్రహ్లాదుడు “దీని సుఖములేదు. దివ్యజీవనము లేదు. జగతి పుట్టి పుట్టి, చచ్చి చచ్చి, పుట్టనేల మనము పుట్టియు చచ్చియు చావులేని పుట్టు పుట్టవలయు" యిట్టి సత్యమైన త్రోవ వెతకువారే దొడ్డ బుద్ధి అనగ అమృతస్థానమైన దివ్యత్వమును విశ్వశించినవాడు. అయితే దీనిని యేరీతిగా పొందడమనే సందేహము. దేహమే విల్లు, మనస్సేత్రాడు. ప్రాణమే అంబు, దేహమనే విల్లు మనస్సు అనే దారముతో సరిపోయింది. మనస్సు అదే దారములోప్రాణమనే అంబు పెట్టినపుడు విల్లు వంగును. మైండ్ యెంత లాగి విడిచిన ప్రాణమంత సూటిగా పోవును. దేహమునకు కట్టిన మనస్పనే దారము గట్టిగా లాగాలి విడిచి పెట్టకూడదు. దీనిని పురస్కరించుకొని మనస్సును అరికట్టుటకు మాధవుని స్మరించవలెను.
(భ.వి.ప్ర. 1974 పు. 10/11)