ప్రేమస్వరూపులారా! దేనికి మీరు వెఱువనక్కరలేదు. తల పైన పిడుగు పడినా ఫరవాలేదు. మీరేమీ భయపడకండి. ప్రాణం పోతే ఒక్క తూరి పోతుందిగాని, రెండు తూర్లు పోదు కదా! ఈనాడు కాకపోయినా రేపైనా పోతుంది. కాబట్టి ప్రాణం పోతుందని మీరు భయపడనక్కర్లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. సత్యాన్ని అనుసరించడానికి మీరు భయపడకూడదు. సత్యాన్ని వదలుకొని, ప్రేమను వదలుకొని ఏదో ప్రాణం రక్షించుకోవాలని జపములు, తపములు చేస్తే లాభం లేదు. ఎవరేమనుకుంటారో అని భయపడకండి. ఎవరే మనుకున్నా మీకు వచ్చిన నష్టమేమిటి? మీ ఇష్టం మీది, వారి ఇష్టం వారిది. మీరేమీ తప్పు చేయటం లేదు కదా! భగవంతుణ్ణి ప్రేమించడంలో తప్పేముంది?ఆ ప్రేమచేతనే ప్రాణం వదలాలి. అంతే గాని, పిచ్చిపిచ్చి కలహాలకు, లేనిపోని సందేహాలకు అవకాశమందించకండి. ఎవరి కర్మను వారు అనుభవిస్తారు.
"ఎవరు చేసిన కర్మ వారనుభవించక
ఎవరికైనను తప్పదన్నా!
ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు?
అనుభవించుట సిద్ధమన్నా"
అయితే, మీరు నిరంతరము భగవచ్చింతన చేస్తూ ఉంటే మీకు ఎలాంటి బాధలూ సంభవించవు. అడవులందున్న, ఆకసముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేట పడియున్న ఎక్కడున్నప్పటికీ భగవంతుడు మీ వెంటనే, జంటనే ఉండి మిమ్మల్ని కాపాడుతుంటాడు. ఎక్కడున్నా దైవత్వం మీవెంటనే ఉంది. జీసస్ అనండి, రామా అనండి, కృష్ణా అనండి; ఏ పేరుతోనైనా పిలవండి. కాని, భగవంతుడు ఒక్కడే. గమ్యం ఒక్కటే. సత్యం ఒక్కటే. ప్రేమ ఒక్కటే. ఆప్రేమయే దైవం. కనుక, దైవత్వాన్ని విమర్శించడానికి ఎవ్వరికీ అధికారం లేదు: హక్కులేదు. విమర్శలన్నీ బూటకపు మాటలే. అవి దైవత్వాన్ని చలింపజేయలేవు.ఈ కలిప్రభావంచేత ప్రజలు ధనం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. ధనం కోసం ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఎందుకిలాంటి తుచ్చమైన ధనము? ప్రేమధనమును సంపాదించుకోండి. ప్రేమయే అన్ని బాధలనూ నివారణ గావించగలదు.
(స.సా.జ..2001పు.7)
భయ పడి దేవుని భజన సేయగలేక
భ్రమచెంది మరణించు సమయమందు
బలిమిమీర యముడు రమ్మిక రమ్మంచు
లాగగనప్పుడు అయ్యయ్యో
అని ఏడ్వగనెవరు నడ్డగించెదరప్ప
పరమేశ్వరుడెనిట్లు తరుణి పురుషు
క్రీడంచు చుండగా..........
నిజము చూడ తరుణి జన్మమే ఘనముగా
గర్భధారణ భరియింపవలెను
నవమాసములుమోసి కని పెంచి బుద్ధి నేర్పి
తనయునొసగు తల్లి తక్కువగునా !
తల్లిదండ్రులందు తండ్రి పేరు వెనుక
తరుణి నామముందు ముందు
(శ్రీ సత్యసాయి దివ్యబోధ 1993 పు 31)