ప్రాచేతనుడు 100 కోట్ల శ్లోకములతో ఆత్మరామాయణమును వ్రాసి ముల్లోక వాసులకు సమానముగా పంచడానికి ప్రయత్నించేడు. ఒక్కొక్క లోకవాసులకు 33 కోట్ల 33 లక్షల వందల 33 శ్లోకాలను పంచాడు కాని చివరకు ఒక శ్లోకము మిగిలిపోతుంది. ఈ శ్లోకములో కూడా 32 అక్షరములున్నాయి. ఈ అక్షరాలను ముల్లోకవాసులకు సమానముగా పంచి పెట్టడానికి ప్రయత్నం చేసాడు. ఈ ఒక్క శ్లోకములో 32 అక్షరాలున్నాయి. ఈ అక్షరాలను 10 చొప్పున పంచగా రెండు అక్షరములు మిగిలిపోయేయి... ఈ రెండు అక్షరములు ముల్లోకవాసులకు పంచడం సాధ్యం కాకపోయింది. అప్పుడు ఈ రెండు అక్షరములను ముల్లోకవాసులకు సమముగానే అనుభవించమన్నాడు ఈశ్వరుడు.
రామ-కృష్ణ-సాయి: ఈ రెండు అక్షరములే ప్రేమ. ప్రేమ దైవంగా మారిపోయింది. ఈ ప్రేమనే రామ, కృష్ణ, హర, సాయిగా వచ్చింది. ఈశ్వరుడు యీ ప్రేమను దైవలోకవాసులు నరలోకవాసులు నాగలోకవాసులు సమానంగా పంచుకోమన్నాడు. ఈ ముల్లోకములే - విష్ణులోకము, బ్రహ్మలోకము, శివలోకము. ఇవే జాగ్రత్ స్వప్న సుషుప్తిలోకములు. ఈ ముల్లోకములు మనలోనే ఉన్నాయి. (త.శ.మ.పు.293)
ప్రేమ స్వరూపులారా! రామాయణ మంటే సీతాపహరణం జరగటము, రామలక్ష్మణులు రావణ కుంభకర్ణాదులను హతమార్చడం కాదు. ఆధ్యాత్మిక అంతరార్థమును మనం గుర్తించాలి. ఆత్మారామాయణమును ఒక్క తూరి మననం చేయాలి. రామలక్ష్మణ భరతశతృఘ్నులు దశరధుని కుమారులు. ఎవరీ దశరథుడు? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములతో కూడిన ఈ దేహమే దశరథుడు. ఇతడు అయోధ్యా నగరానికి రాజు. అయోధ్య అనగా విరోధులు ప్రవేశించడానికి వీలుకాని చోటు. అదే మన హృదయం. ఈ దేహమనే దశరథునకు సత్వరజస్తమో గుణములనే ముగ్గురు భార్యలున్నారు. సాత్వికము - కౌసల్య: రాజసికము-కైక, తామసికము సుమిత్ర: ఈ దశరథునికి ధర్మార్థకామ మోక్షములనే నల్గురు కొడుకులు పుట్టారు. వారే రామ లక్ష్మణ భరత శతృఘ్నులు. ధర్మము ప్రజ్ఞానమును ఆశిస్తుంది. ప్రజ్ఞానమే సీత. కనుకనే రాముడు సీతను వరించాడు. ఈ ప్రజ్ఞానమనే సీతము తీసుకుని అజ్ఞానమనే అడివికి వెళ్ళాడు. అక్కడ దుర్మార్గమనే రావణుడు ప్రజ్ఞానమనే సీతను అపహరించాడు. అప్పుడు రామునికి వివేకమనే సుగ్రీవుడు సహాయం చేశాడు. అవివేకమనే వాలిని రాముడు సంహరించాడు. ధైర్యమనే హనుమంతుని సహాయంతో సంసారమనే సాగరాన్ని దాటాడు. అక్కడ సత్వగుణమనే విభీషణుడు, రజోగుణమునే రావణుడు, తమోగుణమనే కుంభకర్ణుడు ఎదురయ్యారు. రజస్తమో గుణములను సంహరించి, సాత్వికమునకు పట్టాభిషేకం చేసి అనుభవజ్ఞానమనే సీతను తీసుకుని వచ్చాడు. ఇన్ని కష్టాలు పడితేగాని ప్రజ్ఞానం అనుభవ జ్ఞానంగా మారదు.
రాముడు సర్వజ్ఞుడు, సర్వశక్తి మయుడు కదా! మరి తాను కూడా ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవించవలసి వచ్చింది? అని మీరు ప్రశ్నించవచ్చు. భగవంతుడైనా శరీరము ధరించిన తరువాత ప్రవృత్తి ధర్మాన్నే అనుసరించాలి. అవతార పురుషులు కొన్ని సమయము లందు మాత్రమే దైవత్వాన్ని వెల్లడి చేస్తారు కాని, మిగిలిన అన్ని సమయములందు మానవత్వం యొక్క ప్రవృత్తినే ప్రకటిస్తూంటారు. రాముడు మానవాకారము ధరించినప్పటికీ తాను మానవుడు కాదనే సత్యము తనకు తెలుసు. అయితే శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను కూడా సామాన్య మానవుని వలె మాయచేత కప్పబడినట్లు, భార్యా వియోగంతో కుమిలి పోయినట్లు, యుద్ధము చేసి విజయాన్ని సాధించినట్లు నటిస్తూ వచ్చాడు. సత్యాసత్యములకు, ధర్మాధర్మములకు, మంచి చెడ్డలకు మధ్య జరిగిన సంఘర్షణే రామరావణ యుద్ధం, మహాభారత యుద్ధం కూడా. ఈ యుద్ధములు నిరంతరము మానవ హృదయాల్లో జరుగుతూనే ఉన్నాయి. దీనిని నివారణ గావించుకున్ననాడే మానవ జన్మ ధన్యమవుతుంది. రేపటి దినము రాముని యొక్క పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. ఏ రాముని పట్టాభిషేకం? ఆత్మారాముని పట్టాభిషేకం! (శ్రీ భ ఉపు.86/87)