సాక్షిమాత్రుడగు నా చేతనే ప్రకృతి యీ జంగమ స్థావరములతో కూడిన ప్రపంచమగుచున్నది. ఈ హేతువు చేతనే నానా విధములుగా ప్రపంచము ప్రవర్తించుచున్నది. ఇట్టి సర్వోత్తమ మైనట్టిదియును సర్వ భూతములను నియమించునట్టిదియును, అగు నాతత్త్వమును తెలిసికొనలేని మూఢులు నన్ను సామాన్య మనుష్యునిగా తలంచుచున్నారు. కొంతమంది మహానీయులు నన్ను బ్రహ్మముగా ఉపాసించుచున్నారు. మరికొంత మందినన్నే వేరు వేరు రూపనామములతో కొలుచుచున్నారు. ఇంకా కొందరు జ్ఞానయజ్ఞమనియు, ఆత్మయజ్ఞమనియు ఆయారూపముల ఉపాసించుచున్నారు.
"ఏవ రెట్లు ఉపాసించిననూ యెవరేపేరు పెట్టిననూ పరమాత్ముడైన నేను మాత్రమే దానిని అందుకొను చున్నాను. నేను తప్ప మరెవ్వరూ లేరు. నేనే నానా రూపనామములతో ఆయా ఉపాసనా స్థానములను నేర్చుకున్నాను. ఇంతియే కాదు. సర్వకర్మ ఫలమును, ఫలప్రదాతయును, సర్వమునకధిష్ఠానమును, వేయటికి, ఉత్పత్తి, స్థితి లయములు మూడింటికిని స్థానమైనవాడను నేనే; ఎట్టినాశము లేని కారణమునూ నేనే అయివున్నాను. "ఆట్టి కారణ స్వరూపుడైన నన్ను పొందుటే మోక్షము. అట్టి మోక్షప్రాప్తిని అనుభవించుటే జీవన్ముక్తి అని అందురు. కాన, జీవన్ముక్తుడవు కావలెనన్న, మోక్షమును పొందవలెనన్న కొన్ని సాధనలు సలుపవలెను; సర్వసంగ పరిత్యాగులు కావలెను. అనగా దేహాభిమానమును నిర్మూలము చేసుకొనవలెను.
(గీ.పు. 161/162)