"ఆధ్యాత్మ విద్యా, విద్యానాం" అని గీతయందు కూడా విభూతియోగమున తెలుపబడెను. విత్ అను ధాతువునకు య అను అవ్యయము చేర్చినప్పుడు “విద్య" అను పదము ఏర్పడును. య = ఏది? విత్ = వెలుగు - ఏది వెలుగు నిచ్చుచున్నదో అది విద్యయని యుత్పత్తి అర్థము. కనుక, విద్యయను పదము బ్రహ్మవిద్యకే తగినది. జ్ఞానము వెలుగుగా, ఆజ్ఞానము చీకటిగా, వర్ణించారు. మన పూర్వీకులు. ప్రకాశ అంధకారములు ఒకే కాలమున నిలువజాలవు. కావున ప్రగతి పథమును పయనించు ప్రతి మానవుడు ఆత్మ విద్యను లేక బ్రహ్మవిద్యను అభ్యసించి పరిశుద్దాత్ముడు కావలెను. అన్ని నదులు సముద్రమున కలియునటులే అన్ని విద్యలు, ఆత్మవిద్యలు ఆత్మ విద్యలో లీనమగుచున్నవి. అంతే కాదు. సాగర సంగమ సమయమున నదులన్నియు తమ ప్రత్యేక నామ రూపములన్నీ కోల్పోయి ఆఖండ సముద్ర ఆకృతి అయినట్లు బ్రహ్మ విద్యాసాగర సమ్మేళనమున బాహ్య విద్యలన్నియు, స్వరూపమనామరూపాదుల పరిత్యజించు చున్నవి. "విద్యా తపోభ్యాం పూతాత్మ". విద్యవలనను, తపస్సు వలనము మానవుడు విప్రు డగుచున్నాడు. విద్య - బాహ్యవిద్య, బ్రహ్మవిద్య అని రెండు విధములు. బాహ్యవిద్య కేవలము మానవుని జీవుని ఉపాధికి ఏర్పడినది. పొట్టకూటి చదువులు అని పేర్కొనబడినవి. ఇక బ్రహ్మవిద్య సమస్త మానవులను కృతకృత్యునిగా చేయు సామర్థ్యము కలదియై యున్నది. ఇహలోక, పరలోక సంబంధము కలిగించును. కల్పించును. అందరిని కడతేర్చగల దివ్యశక్తి బ్రహ్మవిద్యకు తప్ప బాహ్య విద్యలకు లేదు. బ్రహ్మవిద్య బ్రహ్మమును తెలుపును. తపస్సు పరబ్రహ్మలో కలుపును.
(సా॥పు 596/597)
ఆత్మజ్ఞానమన్నను, బ్రహ్మజ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్ననుఒక్కటే.అయితేఅనేకత్వములోనియేకత్వాన్నినిరూపించేది.మృత్యుత్వములోఅమృతత్వమును నిరూపించేది ఆత్మజ్ఞానము. పవిత్రమైన సృష్టిస్థితులను పవిత్రమైన దివ్యమార్గమును ప్రసాదించేది ఆధ్యాత్మికజ్ఞానము. ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి? దీనికి నిర్మలమైన చిత్తము, చిత్తశుద్ధి అత్యవసరము. "చిత్తస్య శుద్ధయే కర్మ:" చిత్తశుద్ధికి పవిత్రమైన కర్మలు అత్యవసరము. ఈ కర్మలు సదాచారముచే, సత్ప్రవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించే పవిత్రమైన కార్యములు, ఇంతియే కాక పవిత్రమైన భారత,భాగవత,రామాయణ,గీత,ఉపనిషత్తు,బ్రహ్మసూత్రంఇత్యాదిగ్రంథములు పఠించుట కూడను సత్కర్మలే. దాన ధర్మాదికర్మలు, యజ్ఞయాగాది క్రతువులు సత్కర్మలక్రిందనేరూపొందును.లోకసంబంధమైనవిద్యలుఅభ్యసించినవాడు పండితుడు కావచ్చును. మేధావి కావచ్చును. విద్యావంతుడు కావచ్చును. కానీ సర్వజ్ఞుడు కాలేడు. శోకమును నివారణ చేసుకునే మార్గమునకు ఉపాయము బోధించేదే యీ ఆత్మవిద్య.
(శ్రీగీ..పూ. 1,2)
"సత్య జన విరోధాయ అసత్యం జనరంజనం సురావిశ్రేయతే స్థానే దధ్యాధికం పీత్వా గృహే గృహే" మీకు పాలు కావాలా? పెరుగు కావాలా? అని ఇంటింటికి వచ్చి అడిగినప్పటికీ వాటిపై ఆశ పుట్టదు. కానీ ఎక్కడో ఊరి బయట మద్యవిక్రయ కేంద్రం ఉంటే ఎంత దూరమైనా నడచి వెళ్ళి మద్యం సేవిస్తారు. అదేవిధంగా సత్యమంటే ఎవ్వరూ ఇష్టపడరు. అందరూ అసత్యమువైపే సులభంగా ఆకర్షితులవుతారు. ఈనాటి విద్యార్థుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నది. భారతీయ విద్యను విస్మరించి విదేశీ విద్యకోసం ప్రాకులాడి పోతున్నారు. ఎన్ని విద్యలు నేర్చిన ఏమి ఫలము? వొసటి వ్రాతను తప్పింప నెవరి తరము? చెడ్డ బుద్ధులు తలలో చేరెనేని? ఎండబారును, బుద్ధులు బెండుబారు!" మన బుద్ధులు సరియైనవి కానప్పుడు ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము? మొట్టమొదట ఆత్మవిద్యను నేర్వాలి.
(స.పా.పి. 98 పు.40)
(చూ ఆత్మజ్ఞానము, లక్ష్యము)