జగత్తంతయు భగవత్ స్వరూపమే, దీనికి మరొక పేరు విశ్వము. వి+శ్వ+మ్. విశ్వమనగా సమస్తస్వరూపముల చేతను సమస్త అంగముల చేతను ప్రవేశింపబడినది. "సహస్రశీ ర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్" అని పురుషసూక్తము. విశ్వము కార్యము, విష్ణువు కారణము.కార్యకారణ సంబంధమే ఈ విశ్వము కారణము వదలి కార్యము, కార్యమును వదలి కారణము ఉండుటకు వీలులేదు. రెండుమ అన్యోన్యాశ్రయములు; అవినాభావ సంబంధములు. విష్ణువు అనగా వ్యాపింపచేయు గుణం కలవాడు. వ్యాపకత్వము చేత సమస్తమును ఆవరించు వాడు విష్ణువు. ఈ విష్ణువుకు మరి కొన్ని పేర్లు కలవు. ఈ విష్ణువు పుట్టినవాటిని, పుట్టబోవు వాటిని, ఉన్నవాటిని సృష్టించగలిగిన వాడు, ప్రభువైన వాడు. ఈతనికి భూతభవ్యభవత్ ప్రభువని పేరు. ఇతనికి భవుడని మరొక పేరు. ప్రపంచస్వరూపముమ ధరించినవాడు భవుడు.
(నేనే.పు.25)
విశ్వమే ఒక విద్యాలయము. ఇందులోని ప్రతి ప్రాణి విద్యార్థియే. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విషయంలో కృషి చేసి పట్టమునందుకొంటున్నాడు. ఎవరికి అభిరుచి గల విషయమును వారు ఎన్నుకుంటారు. ఎవరే మార్గమును అనుసరించినప్పటికీ అందరికీ ఏకోన్ముఖమైన గమ్యమొకటి ఉన్నది. అదే భగవత్ప్రేమ పట్టానందుకోవడం, సైన్యంలో చేరిన వారిలో ఒకరు మంగలిగా పని చేయవచ్చును. ఒకరు "వాచ్మన్" కాపలాదారుగా ఉండవచ్చును. ఇంకొకరు సిపాయిగా ఉండవచ్చును. ఒకరు కర్నల్ కావచ్చును. మరొకరు మేజర్ కావచ్చును. వారి వారి పదవులలో ప్రత్యేకత ఉన్నప్పటికీ పెరేడ్ చేయడం. తుపాకి కొట్టడం ఈ రెండూ అందరికీ అత్యవసరం. అదే విధముగ విశ్వమనే విద్యాలయంలో నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, వైజ్ఞానిక మార్గములెన్ని ఉన్నప్పటికీ అన్నింటికీ కీలకమైనది. ఆధ్యాత్మికము. .
(స.పా.పి. 1988 పు. 5)
(చూ త్రిగుణములు, విభుడు, సగుణభక్తి)