ఒకే అనంతమైన ఆకాశము నుండి వర్షము కురుస్తుంది. అది భూమి మీద పడేవరకు చినుకులుగా వుంటుంది. కానీ, భూమి మీద పడిన వెంటనే ప్రవహిస్తుంది. ఏనేలలో ఎటెటు దిగవలెనో అట్లు దిగుతుంది. అదే విధంగా - ఒకే పవిత్రమయిన భావముతో మానవులు జన్మిస్తారు. కాని భూమిమీద పడిన వెంటనే రకరకాలుగా మారి పోతారు. కాని ఈ జన్మకు ఆధారభూతమైన, మానవుని అంతర్గతమైన దివ్యత్వము ఒక్కటే అని గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము ఎందుకనగా మనభారతీయులలోనే చాలా మందికి మన దేశములోనున్న అనేక మతస్థుల, కులస్థుల సంస్కృతులను గురించి కొంత నిరసన భావం ఏర్పడివుంది. భారత దేశంలో చాలా రకములైన మతములుండుటవలన కలహములు భేదాభిప్రాయములు ఏర్పడినవి - అని భావిస్తున్నారు. భారతీయులు అనేకమంది దేవుళ్లను పూజిస్తారు అని హేళన చేస్తారు. కానీ బాగా ఆలోచించినట్లయితే ఈ నాటి కలహములకు, భేదాభిప్రాయములకు, కారణము మతములు కావు. ఏకేశ్వరోపాసన - ఏకత్వమును ప్రబోధిస్తున్న క్రైస్తవులు, అడవిలో వున్న మృగముల కంటే హీనంగా మనుష్యులను అణ్వాయుధములచే చంపేస్తున్నారే! దీనికి ఎవరు కారణము? మతమా? కాదుకాదు. వ్యక్తిగతమైన చెడు బుద్దులు. తమతోటి వారిని హింసిస్తున్నారు. మతము మీద ప్రతిదీ వేయడం ఒక పరిపాటైపోయింది.
మతములన్నియు చేరి మంచినే బోధించే
తెలిసి మెలగవలయు తెలివితోడ
మతులు మంచివైన మతమేది చెడ్డది!
వినుడు భారతీయ వీరసుతుడా.
కనుక మతమునకు సంబంధించిన విషయములలో మనము ప్రవేశించకూడదు. సర్వమతముల వారిని గౌరవింపవలయును. అన్ని మతముల ఆకారమే ఈ దివ్య మతమైన విశ్వమతము యొక్క రూపము, అని గుర్తించాలి. గ్రహించాలి. ప్రచార ప్రబోధలు సలుపాలి.
(శ్రీ. సా.ది.పు.135/136)