పరీక్షిత్ మహారాజు శుకునకు నమస్కరించి "స్వామీ! చాలాకాలమునుండియు నన్నోక సంశయము పీడించు చున్నది. దానిని తమరు తప్ప అన్యులు తీర్చలేరనియును నాకు తెలియును. తమరు వేరుగా తలంచక, ఈ దాసుని సంశయమును నిర్మూలము గావించుడు. అది యేమన, నేను మా వంశీయులలో ప్రప్రథమ నాయకుడైన, మనువు మొదలు, నేటి మా తాత తండ్రుల చరిత్రల వరకునూ వింటిని, పఠించితిని, ఎవరి చరిత్రల యందు చూచినను యేదో ఒక మహర్షి రాజుల నాశ్రయించి యుండుటయును మహా జ్ఞానవృద్ధులైన పండితులురాజాజ్ఞలలో వారల దర్బారులలో కూడియుండుటయును చేరియుండిరి. సర్వసంగపరిత్యాగులైన ఋషులును, లోకము మిథ్యము, బ్రహ్మసత్యమని గుర్తించిన పండితులును, రాజుల నాశ్రయించి యుండుటలోగల అంతరార్థమేమియో! కారణము లేని కార్యము పెద్దలు తలంచరు, చరించరు. కాన, ఈ సంశయమును తీర్చి నన్ను ధన్యుని గావింపుమనగా,శుకులు (నవ్వి), రాజా! (సరియైన ప్రశ్న గావించితివి. వినుము.) మహనీయులైన ఋషులు పవిత్రులైన పండితులు నిజమైన లోకపాలకులు, తాము గ్రహించిన సత్యములను, ఆచరించిన పవిత్ర కర్మలను, అందుకొన్న దివ్య దైవాను గ్రహమును, తోటి మానవుల కందించి లోక సుఖశాంతులు చేకూర్చవలెనను వాంఛతో పరిపాలనాదక్షులగు రాజులచెంత చేరి రాజుల కిట్టి ఉత్తమ మార్గముల చిత్తములందు చేర్చి శాసన రీతిగా జనరంజకమగు ధర్మ కర్మలను నియమించు చుండిరి. ఆనాటి రాజులే మహాఋషులను ఆహ్వానించి, పండితులను పిలిపించి, రాజనీతిని తెలుసుకొని దానికి తగినట్లు శాసనములు నీ మించెడివారు. ప్రజలకు ప్రభువే ప్రధాన రక్షకుడగుటచేత, ప్రభువు సర్వసుగుణ సంపన్నుడై, సర్వధర్మ పరాయణుడై, సమస్త విద్యాపారంగతుడైయుండిన ప్రజల యొక్క యోగక్షేమమును, పరిపాలనా విధానమును సక్రమమైన మార్గమున నడుపగలరనియుము లోక సుఖశాంతులనాశించి, “సమస్త లోకా సుఖినోభవంతు" అను లక్ష్యముతో రాజులను చేరెడివారు, ఇంతియే కాదు, జన సుఖదాయకుడు రవికుల నాయకుడు, కౌసల్యా కిశోరుడు, వసుదేవనందనుడు, గోపీజన వల్లభుడు, గోలోక వాసుడు అగు శ్రీమన్నారాయణుడు రాజవంశములందు జన్మించునను వార్త వేద శాస్త్రములందు సూచించుటచే, భగవద్దర్శనార్థమై అప్పటి కప్పుడు రాజులను చేరుటకు వీలుగా నుండదనియును, చేరిననూ దైవానందమును మనసారా అనుభవింప సాధ్యము కాదనియును, ఆలోచించి, కొందరు దివ్యదృష్టిగల మహనీయులు ముందుగానే ఆయా రాజుల కొలువు కూటములచేరిదైవరాకకై తపించుచుందురు. అట్టివారే వశిష్ట, వాసుదేవ, విశ్వామిత్ర, గౌతమ, గర్గ, అగస్థ్య ఇత్యాది మహర్షులు, వీరలకేమి కొదువ? త్యాగులు, విరాగులు అయిన ఈ ఋషులు రాజుల చెంత చేరి వ్యర్థ ప్రసంగములు గావించుటకై రాజుల కొలువు కూటముల చేరలేదు. లేదా, వారి కానుకలందుకొనుటకు కానీ, వారందించు తల భారపు బిరుదులను తగిలించు కొనుటకు కానీ, ప్రభువులను చేరలేదు. విశ్వనాథుని దర్శనమునకును, ధర్మరక్షణ దీక్షకును లోకపాలురను చేరిరి. వేరు కారణము లేవియును లేవు. ఆనాటి రాజులు కూడను దైవచింతనా తత్పరులై, ప్రజాపరిపాలనకు తగిన మార్గములను పండితుల వలనను, ఋషులవలనను తెలిసికొని తమకు తామే ఆశ్రమములకు వెళ్ళుటయో, లేదా వారలను రాజభవనములకు రప్పించుటయో జరిపించి, ఆలోచించెడివారు. ఆనాడు స్వార్థరహితులగు ఋషులు, అధికార వాంఛారహితులగు పండితులు, రాజులకు సలహాదారులుగా నుండుటచే ఆనాడు, తిండి గుడ్డలకు కానీ, తీర్థ గృహములకు గానీ, యెట్టి కొరతయూ లేక, నిత్య కల్యాణము పచ్చ తోరణములతో ప్రజాక్షేమమే ప్రభువు దేహముగను, ప్రభువే ప్రజల గుండెలుగను తలంచి, స్మరించి, వరించి, తరించిరి.
(రా.వా. మొ. పు. 4/6)