విశ్వరూపము చూచుచు అర్జునుడు ఆనంద బాష్పములు రాల్చుచు ఇట్లనెను. "పరమాత్మా! సకలదేవతలను, సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మను, సమస్త ఋషులను, నానా స్థావర జంగమాది భూత సమూహములను, చూచుచున్నాను. అబ్బా! భయంకరమైన నీ మోమున వెలువడు మంటలు, ఈ తేజస్సులు, సమస్త జగత్తును వ్యాపించి తపింపజేయు చున్నవి. ఈ భయంకరమైన ఉగ్రరూపమును తెలిసికొన గోరుచున్నాను.
"అర్జునా చూచితివా ! సమస్త కర్మలకును, సమస్త భూతములకును సృష్టి స్థితి లయకారుడను నేనే అని తెలిసినదా! దీనినిపట్టి ఈ యుద్ధభూమియందు చేరిన జనులను కాపాడువాడవుకానీ, సంహరించు వాడవుకానీ, నీవు కాదని తెలిసి కొమ్ము నీవు నిమిత్తమాత్రుడవే. చంపు అధికారము నీకుగాని, చచ్చు అధికారము వారికిగాని యెప్పటికీ లేదు. సర్వమూ నాయందే, నాసంకల్పమందే యుప్పది. భూభార మణుచుటయు భూభారమును పోషించుటయు, భూభారమును వహించుటయు నా ప్రవృత్తి అని తెలిసి కొమ్ము" అని కృష్ణుడు వీపు నిమురుచూ వాత్సల్యత చూపుచూ వణుకుచున్న అర్జునుని ఓదార్చినాడు.
భక్తవత్సలుడు, భక్తపరాధీనుడనుటలో ఈ ఘట్టము ప్రత్యక్ష నిదర్శనము, ప్రత్యక్ష ప్రమాణము. కాకున్న, సామాన్య మానవునివలె అదరి బెదురుచున్న అర్జునుడెక్కడ! మహావీరులు - సర్వశక్తిమయులు, సర్వవిద్యా ప్రవీణులయిన భీష్మ, ద్రోణ కర్ణాదు లెక్కడ? అట్టివార లను ఒక్క భగవంతుడు తప్ప మరెవ్వరునూ ఓడించలేరు సాధ్యము కాదు. అట్టి మహావీరులను ఓడించినట్టి ఘనత, వధించినట్టి ఘనత, తనకు శరణాగతుడైన అర్జునుని పొందమని తెలిపెను. భక్తుల యొక్క యశస్సును కోరి భగవంతుడు మానవాతీతమైన కార్యములను కూడా చేయించును. తాను సాక్షీభూతుడై సర్వకర్తయై నాటకమాడించి యేమియూ యెరుగనివానివలే నటించును. ఇది తనకు భక్తుల యందుగల వాత్సల్యము. అర్జునుడు కన్నులు తుడుచుకొనుచు, చేతులు జోడించి "పరమాత్మా! నేనెన్నడూ కనీవిని యెరుగని విశ్వస్వరూపమును చూచితిని. ఆందలి సత్యమును తెలిసికొంటిని. భయంకరతేజఃపుంజములు నన్ను కాల్చి వేయుచున్నవి. నా దేహము మండుచున్నది. ఒకపరి ని మొదటి రూపమైన ప్రసన్న స్వరూపమును చూపుము, శాంతింపచేయుము. తాళలేను తండ్రీ చూడలేను" అని మొరపెట్టుకున్నాడు.
అంత కృష్ణుడు అనుగ్రహ హృదయుడై, "అర్జునా! వేదాధ్యయనము చేత గానీ, ఘోర తపస్సులచేత గానీ, దాన ధర్మాది సత్కర్మలచేత గానీ, యజ్ఞయాగాది క్రతువులచేత గాని చూడ సాధ్యము కాని నా విశ్వరూపమున నీవు చూడగలిగితివి. ఇట్టి దర్శనము మదేక నిష్టుడైన ఒక్క భక్తునకు మాత్రమే ప్రాప్తించును,సాధ్యమగును, అనన్య చింతనతోనన్ను ఉపాసించువారికి ఇది సాధ్యము కాగలదు. అట్టివారి హృదయము మాలిన్య రహితమై నిర్మలముగా నుండును. ఆ సమయమున దేనిని చూచిననూ, చేసిననూ భగవత్ స్వరూపముగను, భగవత్ రూపమైన కర్మలుగను తలంతురు. వారలకు వేరు రూపములుగాని వేరు భావములుగాని వుండవు: సర్వకాల సర్వావస్థల యందూ నా రూపమే, నా నామమే, నాభావమే, నాకర్మలే కాంచు చుందురు, చేయుచుందురు. అట్టివారలకే ఈ పవిత్ర ప్రాప్తి లభ్యమగును. నేను అనన్యభక్తినే కోరుచుందును బావా" అని విశ్వరూప సందర్శన ప్రాప్తి గురించి వివరించెను.
(గీ.పు.182/184)