"ఈనాటి విద్యావిధానము కృత్రిమంగా రూపొందుతూ వస్తున్నది. ధనార్జనకని ప్రాకులాడుతున్నారు. ధన సంపాదన నిమిత్తమై ఏర్పడినది కాదు. విద్య. గుణ సంపాదన, క్రియాశీలత కొరకు యేర్పడినదే. నదులకు పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి నీటినంతా నిలువచేస్తున్నది ప్రభుత్వం, ఆనకట్ట కట్టడములో నున్న ఆశయమేమిటి? నిలువ చేసినట్టి నీరును కాలువల ద్వారా ప్రవహింపజేసి, - పంటలకు నీరు పెట్టి తద్వారా ఆధికోత్పత్తిని కలిగించి దేశ సంక్షేమాన్ని అందిస్తున్నది. అదేవిధంగా లైబ్రరీలో కూర్చుండి బీరువాలోని పుస్తకాలను తీసి, వాటిలోని విషయమంతా మస్తకములో చేర్చుకుంటున్నాం. ఇక్కడ కేవలం ఆనకట్ట కట్టి నీరు నిలువ చేసినంత మాత్రాన ఫలప్రదం కాదు. దానిని క్రియారూపంలో సమాజంలో ప్రవహింపజేసి తద్వారా అధికోత్పత్తిని కలిగింపజేసి దేశానికి కళ్యాణాన్ని చేకూర్చాలి."
(శ్రీవా.97 పు.83) |