విద్యావంతునికి ఉండవలసిన ప్రధానమైన లక్షణములు మూడు. 1. "సర్వే లోక హితే రత:” (లోక శ్రేయస్సును ఆశించాలి) 2. "సర్వే జ్ఞానోప సంపన్నం" (సమస్త జ్ఞానసంపన్నుడై యుండాలి)3. సర్వే సముదితా గుణైః " (సమస్త సద్గుణములను కలియుండాలి). కనుక, విద్యావంతులు మొట్టమొదట సమాజాభివృద్ధి కోసం పాటుపడాలి. విద్యార్థులారా! మీరు సమాజంలో సభ్యులు.మీ క్షేమము సమాజ క్షేమమునందు ఇమిడియున్నది. కనుక, మీరు నేర్పిన విద్యలను సమాజాభివృద్ధి కోసం వినియోగించాలే గాని, డబ్బుకోసం అమ్ముకో కూడదు. సమాజము నుండి మీరందుకున్న విద్యలను తిరిగి సమాజానికే అమ్ముకోవడం మానవత్వానికి విరుద్ధం. త్యాగమే ప్రధానమైన మావనతా గుణం. కనుక, త్యాగాన్ని పోషించుకోండి. కనుకనే. వేదము "న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే మృతత్వ మానశు!", అని తెలిపింది. విద్య ధనసంపాదన కోసమనే అపోహను విడనాడండి. ఏమిటి సంపాదన? బెగ్గర్లు (భిక్షగాళ్ళు) కూడా సంపాదిస్తున్నారు. స్వార్థాన్ని త్యజించండి. ఐకమత్యాన్ని పోషించుకోండి. ప్రేమ తత్త్వంతో, త్యాగభావంతో జీవించండి. అప్పుడే మీకు అన్ని విధములైన అనుకూలములు చేకూరుతాయి.
(స. సా.జూ..2000పు. 170/171)
"విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునచై వశ్వ పాకేచ పండితా: సమదర్శినః" అనగా విద్యా వినయములు కలిగిన విద్యావంతుడు గోపునందును, బ్రాహ్మణుల యందును, ఏనుగునందును. కుక్క యందును, నీచాతినీచ స్థితియందున్న వ్యక్తి యందును సమదృష్టి కలిగి యుండాలని పై శ్లోకమునకు అర్థముగా యెరిగి సమస్తప్రాణికోటియందును దయా ప్రేమలు చూపవలెను. సమదృష్టి శుభదృష్టి, అట్టి శుభదృష్టి కలవాడే నిజమైన విద్యావంతుడు. సమదృష్టి కలవాడు విద్యావంతుడు, సంఘదృష్టిని దూరము చేయాలి. ఇటువంటి అత్యున్నత తత్వమునే భారతీయ సంస్కృతి ప్రబోధించినది. ఇంతటి వున్నత బోధ మరేవిద్య యందునూ యేదేశమునందునూ కనుపించదు. భారతీయ విద్య విశాలమైన, ఉత్కృష్టమైన ఆదర్శమును ప్రబోధించుచున్నది.
(వి.వా.పు.72/73)