భగవంతుడు భక్తికే తూగుతాడు కాని, ధనమునకు తూగడు. నీ హృదయాన్ని పవిత్రమైన ప్రేమతో నింపుకో.దానిని పదిమందికీ పంచుకో. నీవు మాత్రం ఇతరులనుండి కోరి, వారికి తిరిగి ఇవ్వకపోతే అది one way traffic అవుతుంది. కాని ప్రేమ one way traffic కాదు. దీనిని ఇచ్చుకోవాలి. పుచ్చుకోవాలి. నీ డబ్బును నీవు Bank లో పెట్టుకొంటే నీవు తిరిగి "చెక్" వ్రాసి ఇస్తేనే నీ డబ్బు నీకు ఇస్తారు లేకపోతే నీ డబ్బయినా నీకివ్వరు. భగవంతుడు కూడా అంతే! నీవు ఆనంద బాష్పాలనైనా అర్పించినప్పుడు, అనంతమైన ఆనందాన్ని అందిస్తుంటాడు. కుచేలుడు ఏమిచ్చాడు? పిడికెడు అటుకులను ఆర్పించాడు. కాని కృష్ణుడు ఆతనికి బహుళ భోగభాగ్యములను అందించాడు. రుక్మిణి దేవి ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది. దానికే కృష్ణుడు ఆమెకు వశమైపోయాడు. కనుక, భగవంతునికి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి. ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి. భగవంతునికి ఏమీ అక్కరలేదు. అతడు ఏమి ఆశించడు కాని ప్రేమను మాత్రం అర్పించాలి. అదికూడా Property కాదు Love is God, Live in Love.
(శ్రీ భ.ఉ.పు.151/152)
ఒక్క ప్రేమను అభివృద్ధి పర్చుకుంటే ప్రపంచమంతా దగ్గర చేరుతుంది. ఈనాడు ఇన్ని దేశముల నుండి, ఇన్నిప్రాంతముల నుండి ఇంతమంది ఇక్కడకు ఎందుకోసం వచ్చారు? చక్కగా విచారణ చేసినప్పుడు దీని అంతరార్థము అర్థమవుతుంది. మీ ఇంటిలో లేనిది, మీ సంసారములో లేనిది. మీ రాష్ట్రములో లేనిది, మీగ్రామములో లేనిది, మీ దేశములో లేనిది. ఏదో ఒకటి ఇక్కడ ఉంటున్నది. అదే సర్వసమానత్వమైన ప్రేమ. ఆప్రేమ నిమిత్తమై మీరు ఇక్కడకు వచ్చారు. ప్రేమచేతనే సన్నిహిత సంబంధ బాంధవ్యము ఏర్పరచుకోవచ్చు. హృదయ భూమియందు ప్రేమతత్వము ఉండాలి.
ప్రేమ రహిత మరు భూములలో
ప్రేమాంకురములు పెంపొంద
ప్రేమావేశముల, ప్రేమ సుధావర్షము వర్షింపగ
ప్రేమ నదులు ప్రవహింపగ
మురళీ గానము సేయగదే, కృష్ణా ! గానము సేయగాదె! అని గోపికలు ప్రార్థించారు. "కృష్ణా! నీ మురళీ నాదమునందే ప్రేమతత్వము ఉంటున్నది. నీ వాక్కునందే ఈ ప్రేమతత్వము ఉంటున్నది. నీ ప్రవర్తనయందే ప్రేమతత్వము ఉంటున్నది" అన్నారు. దీనినీ ఆశించదు ఈ ప్రేమ. ఇది అందించేదేగాని అందుకొనేది కాదు. ఒక్క దైవమునందు మాత్రమే అట్టి నిస్స్వార్థ ప్రేమ లభ్యమవుతుంది. అట్టి నిస్స్వార్థ ప్రేమ నిమిత్తమై మీరు ఇక్కడకు వస్తున్నారు. లేకపోతే ఎవరు మీకు జాబులువ్రాసారు? ఎవరు మీకు invitations పంపారు? ఎందుకోసం ఇక్కడకు వచ్చారు? నేను ఏమిస్తున్నాను మీకు? ఏమీ లేదు. నాయనా! ఎప్పుడొస్తివి?" అని ప్రేమతో మాట్లాడితే మీరు ఉబ్బిపోతున్నారు. చాలా ఆనందము అనుభవిస్తున్నారు. ఒక్క మాటలోనే యింత మాధుర్యము ఉన్నది. కనుక మీరు మధురమైన మాటలు నేర్చుకోండి. పవిత్రమైన మార్గంలో నడుచుకోండి. అప్పుడే మీకు గౌరవము లభిస్తుంది. మీరు మాట్లాడే మాట సత్యమైనదిగా ఉంటుండాలి. You cannot always oblige, but you can speak always obligingly.ఎవరైనా మన యింటికి వచ్చారంటే ఏమండీ, ఎప్పుడు వచ్చారు? దయచేసి లోపలకు రండి అని మంచి మాట మాట్లాడితే వారికి భోజనము చేసినంత ఆనందమవుతుంది. అట్లుకాక "ఎందుకు వచ్చారండి?" అంటే, వారికి మరింత ఆకలైపోయి వెళ్ళిపోతారు. కఠినమైన మాటలు బాంబుల వలె వారిని భస్మం చేస్తాయి. వారికి ఏమీ పెట్టకపోయినా కనీసం మాటలనైనా మృదు మధురంగా మాట్లాడాలి.
(దస.98 పు. 40/41)
"సర్వ మతముల మూలము, సమస్త శాస్త్రముల సారము,
సర్వ మార్గముల గమ్యము, సమస్త జీవుల కీలకము,
ప్రేమతత్వమే, అదే జీవిత సౌధమునకు భద్రమైన పునాది.
విశ్వకళ్యాణమునకు విజ్ఞాన జ్యోతి.
ప్రతి మాట, ప్రతిఆట, ప్రేమమయము కావలెను.
మాటలు కత్తిపోటులుగాను, సూటిబాణములుగానూ,
సుత్తి ఏటులుగానూ, మారరాదు.
అమృతపూటలుగనూ వేదాంత మాటలుగానూ,
పూలబాటలుగమా, కాంతి సుఖ
ముల నందించునట్టివై యుండవలెను.
(ఆ.దీ.పు.1179)
ఈనాడు మీరు ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును ప్రోగు చేసుకుని బ్యాంకుల్లోను, ఇన్సూరెన్స్ కంపెనీల్లోను పెట్టు కుంటున్నారు. కాని ఇవన్నీ అస్థిరమైనవి, అశాశ్వతమైనవి. నిజంగా మీరు ఆనందాన్ని పొందాలంటే ప్రేమ ధనాన్ని పెంచుకోండి. దానిని హృదయమనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. మీ డిపాజిట్ ఎక్కడికీ పోదు. పైగా డబుల్ గా పెరిగిపోతుంటుంది. ఎక్కడైనా దొంగతనం జరగవచ్చు కాని ఈ హృదయమనే బ్యాంకులో దొంగతనం జరుగడానికి వీల్లేదు. దీనికి తలుపులు లేవు. బీగములు లేవు. ఏమి లేకపోయినా సత్యనిత్యమై ఉంటుంది. కనుక అశాశ్వతమైన ధనాన్ని ప్రాకృతమైన కంపెనీలలో ఇన్-షూర్ చేసే బదులు ప్రేమధనాన్ని మీ హృదయంలో ఇన్-షూర్ (in-sure) చేయండి. ఇది లోపలనే ప్యూర్ గా శాశ్వతంగా ఉంటుంది. అమృతము కంటే అధికమైనదిప్రేమ. అమృతము ప్రాకృతమైన జిహ్వకు రుచిగా ఉంటుందేమో గాని ప్రేమామృతం హృదయానికే రుచి కలిగిస్తుంది. ఇట్టి ప్రేమామృతాన్ని గ్రోలటానికి తగిన ప్రయత్నం చేయాలి. త్యాగానికి పట్టం కట్టినప్పుడే ప్రేమకు స్వాగతం పలుకడానికి వీలవుతుంది. అప్పుడు దేనిని తలంచినా తక్షణమే ఫలసిద్ధి కలుగుతుంది.
(సపా.డి.96పు.312)
ప్రేమతత్వము ప్రబోధించి, మమత సమతను పొందుపరచి, మానవత్వపు విలువ దెలిపిన ప్రేమమూర్తి ఆత్మదేవుడు. కనుక ప్రేమనే ఆత్మ, ఆత్మనే ప్రేమ.
(శ్రీఫి. 1995 పు. 2)
"నన్ను కేవలం బాహ్యదృష్టితో చూసి, సాయి ఇట్టివాడు, అట్టివాడు అని వర్ణిస్తున్నారు. కానీ, నాలోని యథార్థ సత్యమును గుర్తింపలేకున్నారు. నా శక్తి అపారము, అనంతము. కొలతలకు అందనిది, పరిణామమునకు అతీతమైనది, పరిశోధనలకు పట్టుబడనిది. ప్రేమతత్త్వమే నాకూ మీకూ మధ్యగల చక్కని లింకు (బంధము). ఇది ఉన్నంతకాలము క్షేమమే కానీ క్షామము రాదు” అని ఎలుగెత్తి చాటారు ప్రభువు. (ఇది వారి శాశ్వతత్వం!) (స. సా. న 2021 పు 29)
ఈ ప్రేమతత్త్వమును అర్థం చేసుకోవడానికి ఈనాడు ఎవరూ ప్రయత్నించడం లేదు. ఈ ప్రేమకుగల శక్తియే సమస్త పాపములను పరిహారము చేయగలదు. ప్రేమ ఒక్కటే ద్వేషభావమును తొలగించి, జీవిత మాధుర్యమును పెంచగలదు” అని స్వామి చెపుతారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు21)