రామలక్ష్మణులు సీతాన్వేషణ సలుపులూ దండకారణ్యంలో ప్రయాణమై పోతున్నారు. కొంత సేపటికి అలసిపోయి, ఒక చెట్టు కింద కూర్చున్నారు. వెంటనే లక్ష్మణుడు లేచి, “అన్నా! నేనీ బాధలు సహించలేను. సకాలమునకు భోజన పానీయాదులు లేక నా శరీరమును కృంగదీసు కుంటున్నాను. ఇక ఒక క్షణమైనా ఇక్కడ ఉండనుఅయోధ్యకు వెళ్ళేదను." అన్నాడు రాముడు నవ్వాడు. "సోదరా! మనం మరికొంత దూరం వెళ్ళిన తరువాత మాట్లాడతాను" అని చెప్పాడు. పూర్వము రామ సన్నిదే తన పెన్నిధి అని భావించి తల్లిదండ్రులనైనా త్యజించి వచ్చిన లక్ష్మణునిలో ఈ దుర్భుద్ధి పుట్టడానికి కారణం ఏమిటి? అతనిలో దేహభ్రాంతి, దేహాభిమానం కలుగుటకు కారణమేమిటి? రామలక్ష్మణులు అక్కడ నుండి మరొకొంతదూరం వెళ్ళి ఒక చెట్టుకింద కూర్చున్నారు. తక్షణమే లక్ష్మణునికి పశ్చాతాపం కలిగింది. రాముని కాళ్ళు గట్టిగా పట్టుకొన్నాడు. "అన్నా! నన్ను క్షమించు. నాలో ఈ దుర్బుద్ధి ఎందుకు ప్రవేశించిందో తెలియటం లేదు." అని ప్రార్థించేటప్పటికి రాముడు చెప్పాడు. "లక్ష్మణా! ఆ ప్రదేశమంతయూ శూర్పణఖ సంచారము చేసిన ప్రదేశము. కనుక, ఆమె దుర్గుణములు అక్కడి వాతావరణములో కలిసి ఉన్నాయి. ఆ ప్రభావము నీలో ప్రవేశించడం వలన ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. ఆస్థానం వదలగానే లో తిరిగి సద్భావం వచ్చింది."అన్నాడు.
కనుక, కొన్ని కొన్ని స్థానములందు కొన్ని కొన్ని సమయములలో మనం జాగ్రత్తగా ఉంటుండాలి. దుస్సంగానికి, దుర్బుద్ధులు సంచరించే ప్రదేశానికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే మంచికిగాని, చెడుకుగాని, ఒక విధమైన వైబ్రేషన్ ఉంటుంది. మనది డివైన్ వైబ్రేషన్ అది డెమన్ వైబ్రేషన్. సత్సంగము చాలా అవసరము. మంచివారితో మనం స్నేహం చేయాలి. మంచివారితోనే మన జీవితాన్ని అంకితము గావించుకోవాలి. దైవము ఎంత అనుగ్రహస్వరూపుడైనా, మన ప్రవర్తనలందు కొన్ని దోషములుంటున్నాయి. మన ప్రవర్తనను సక్రమముగా తీర్చి దిద్దుకొన్నప్పుడు, దైవానుగ్రహం మనకు డైరెక్టుగా వచ్చి చేరిపోతుంది.
(శ్రీ భ.ఉ.పు.165)