"మధు - మాధవ" అనేటటువంటి ఈ రెండు నెలల మార్పులే వసంత ఋతువు. వసంత ఋతువు అనగా సూర్యుడు మేష, వృషభరాసులందు ప్రవేశించడము. ఈరాశులే శుక్రరాశి అని కూడ చెప్పుతారు. ఈ శుక్రరాశియందు కేవలము నీల వర్ణములో కూడినటువంటి తెలుపుగా నుండిన జీవితమును ప్రబోధిస్తుంది. ఈ నీల వర్ణంలో కూడినటువంటి ఒక భగవతత్త్వం లోకముయొక్క విశాలతత్త్వం, ఆరోగ్యం, ఆనందము సూచించు మూలచిహ్నముగా ప్రబోధిస్తూ వచ్చినది. శుక్రుడు మీనములో ప్రవేశించినప్పుడు శ్రీ రామచంద్రుడు జనన మొందుట సంభవించినది. లోకమున శాంతి భద్రతలుఅందించే నిమిత్తమై మానవత్వమున నున్న దివ్యతత్త్వము ఆవిర్భవించే నిమిత్తమై రామతత్త్వము ఆవిర్భవించినది. ఈ రామతత్త్వము నందు ఈ వసంత ఋతువు చాల ప్రధానమైనది. పండిన ఆకులు రాలి లేత చిగురు మహాకళకళలాడే చిగురు ప్రపంచానికి ఆనందాన్ని అందించే చిగురు ఈ వృక్షములలో అభివృద్ధి అవుతాయి. సూర్య బింబము ఈ దళముల పై పడినప్పుడు ఇది కేవలము సువర్ణమైన జగత్తుగా రూపొందుతుంది. అంతేకాక, ప్రపంచమునే ఒక సౌందర్యముగా నిరూపిస్తుంది. ఈ వసంత ఋతువు.
(స. సా .జూన్.1989 పు. 142)