సర్వజ్ఞడగు బ్రహ్మమే జగత్కారణమని శ్రుతియందు చెప్పబడి యుండుట వలన కూడా ఈ దివ్యరూప వర్ణన చేయబడినది. బ్రహ్మము సంకల్పాది గుణములను వాచ్చార్థముననే కలిగియున్నది. బ్రహ్మము నిర్విశేషమని వర్ణించు శ్రుతి వాక్యములను సమస్త కళ్యాణ గుణాత్మకముగా వర్ణించుచున్నవి. శ్రుతి వాక్యము విశ్వమునుండి చూచినచో బ్రహ్మము నిర్విశేషము.
బ్రహ్మము ఆనందరూపమని కూడా శ్రుతి నిరూపించు చున్నది. ఆత్మస్వరూపమును గురించి. మొదటిది అన్నమయుడనియు, ప్రాణమయుడనియు, మనోమయు డనియు, విజ్ఞానమయుడనియు నిర్వచనము చేసి, అనంతరం ఆనందమయుడని, ఇవన్నియు బ్రహ్మము సందే ప్రయుక్త మగుట వలన ఆనందమయాత్మ బ్రహ్మమే యని తలంచవలసి వచ్చును. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములన్నియు ఒక దానికంటే ఒకటి సూక్ష్మరూపమును ధరించి ఆనందమయ రూపుడైన బ్రహ్మకు ఉపాధులుగా యేర్పడినవనియును తలంచ వచ్చును.
అన్నమయం - కోటు - అది స్థూలమైనది. దానికంటే సూక్షమై దానిని కాపాడుచున్నది. ప్రాణమయం. దానిని విచారణాత్మకముగా భావించి ప్రాణము కంటే సూక్ష్మమయ మయినది మనోమయము, దేహేంద్రియాలను, వాటిని ఆచరణ యోగ్యంగా నడిపించుప్రాణ శక్తిని స్తంభింపచేయుచున్నది మనోమయము. కనుక, అది ప్రాణము కంటే బలవత్తరమైనది. దానికంటే సూక్ష్మమైనది విజ్ఞానమయం. నిత్యానిత్యా విషయ పరిశీలనలో నిమగ్నమై ఆనందమయమునకు అతి సమీపమున నుండుటచేత ఆనందమే బ్రహ్మానుభూతిని నిరూపించుచుండును.
మనము దేహ రక్షణకై అనేక విధములైన దుస్తులు ధరింతుము. ముందు బనియన్, తరువాత షర్టు, ఆ తరువాత కోటు, దానిపై శాలువా, అయితే మనము మన హృదయాన్ని చూడవలెనన్న. మొదలు స్థూలమైన శాలువ తీసివేయవలెను. ఆ తరువాత కోటు విడిచి వేయవలెను. ఆ తరువాత షర్టు విప్పి వేయవలెను. ఆపై బనియన్ తీసివేసినప్పుడే మన హృదయాన్ని మనము చూడగలము. అటులనే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములను ఉపాధులను విసర్జించినప్పుడే ఆనందమయమైన ఆత్మ బ్రహ్మ స్వరూపముగా కనిపించును. అన్నమయము నుండి ఆనందమయునివరకు చేయు ప్రయాణమే జీవిత ప్రయాణము. ఇదే మన గమ్యము. ఇదే జీవిత లక్ష్యము. అని ఈ సూత్రము నిరూపించుచున్నది.
భగవంతుడైన బ్రహ్మ ఆనందమయుడుగా వుండుటచేతనే ఇతరులకు ఆనందము నిచ్చుచున్నాడు. తాను సకల జ్ఞాన సంపన్నుడు కావటం చేతనే సర్వులకు జ్ఞానోదయము కలిగించుచున్నాడు. భగవంతుడు ఆనంద ప్రచురుడు అని మరొక శాఖ ఆనందమయాధికరణమ్. ఆనంద మయోభ్యాసాత్ అను సూత్రము హెచ్చరించినది.
(సూ.వాపు 44/48)